Friday, May 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎ్రరజెండా ఎజెండా.. ప్రజలే

ఎ్రరజెండా ఎజెండా.. ప్రజలే

- Advertisement -

ప్రజాస్వామ్య రాజకీయ యవనికపై గెలుపోట ములనేవి నిరంతరం సాగే ఒక సహజ ప్రక్రియ. ఇక్కడ అధికార పీఠాన్ని అధిరోహించడం, తిరిగి దానిని కోల్పోవడం ఒక అనివార్య చారిత్రక పరిణామం. ప్రజలిచ్చే తీర్పును శిరసావహించి గౌరవించడం ఏ రాజకీయ పక్షానికైనా ప్రాథమిక ధర్మం. సాధారణంగా బూర్జువా పార్టీల రాజకీయ ప్రస్తానమంతా కేవలం ఈ గెలుపోటముల పరిధిలోనే పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే, ప్రజా రాజకీయాల కోసం, సామాజిక పరివర్తన కోసం అంకితమైన శక్తుల ఉనికిని కేవలం ఎన్నికల గణాంకాలతోనే బేరీజు వేయాలనుకోవడం చరిత్రను కించపరచడమే అవుతుంది. కేవలం అధికారంలో ఉన్నప్పుడే ప్రాబల్యం ఉంటుందని, సీట్ల సంఖ్య తగ్గగానే ఒక ఉద్యమ ప్రస్థానం ముగిసిపోయిందని భావించడం అపరిపక్వ రాజకీయ విశ్లేషణే అవుతుంది.
నిజానికి, అధికారం కోసమే పాకులాడే బూర్జువా పార్టీలను, సిద్ధాంత ప్రాతిపదికన నడిచే కమ్యూనిస్టు పార్టీలను ఒకే తాటిపై నిలబెట్టి చూడటం ఏమాత్రం సమంజసం కాదు. బూర్జువా శక్తులు అధికారం చుట్టూ రాజకీయాలు అల్లుకుంటే, కమ్యూనిస్టులు అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం శ్రమజీవుల పక్షాన, పీడిత ప్రజల గొంతుకై క్షేత్రస్థాయిలో నిలబడతారు. సమాజంలోని లోతైన సామాజిక వైరుధ్యాలను విశ్లేషించకుండా, కమ్యూనిస్టు ఉద్యమాలపై కార్పొరేట్ మీడియా సాగిస్తున్న వ్యవస్థీకృత విషప్రచారం వెనుక స్పష్టమైన వర్గ ప్రయోజనాలు దాగున్నాయి.

ఎన్నికల అంకెలకు అందనంత లోతైన సామాజిక పునాదులు కలిగిన ఈ ప్రజా ఉద్యమాలను, కేవలం ఓట్ల రాజకీయాల కోణంలో చూడటం అంటే వాస్తవికతను విస్మరించడమే. అధికారం కంటే ప్రజా ప్రయోజనమే పరమావధిగా సాగే ఈ ప్రయాణంలో ఓటమి అనేది కేవలం ఒక తాత్కాలిక విరామం మాత్రమే తప్ప ప్రస్థానానికి ముగింపు కాదు. ఈ దేశంలో ఎన్నో పార్టీలు అధికారాన్ని అనుభవించాయ, కోల్పోయాయి, మళ్లీ పుంజుకున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, వైఎస్సార్ కాంగ్రెస్‌ వంటి పార్టీలు ఎన్నో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాయి. మరెన్నో సందర్భాల్లో పరాజయాలను ఎదుర్కొన్నాయి. కానీ వాటి ఓటములను కార్పొరేట్ మీడియా ఎన్నడూ రాజకీయ పతనంగా చిత్రీకరించలేదు. అదే మీడియా కమ్యూనిస్టుల విషయంలో మాత్రం ఎన్నికల ఫలితాలను సిద్ధాంత పరాభవంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లలో కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోగానే “వామపక్షాల కాలం ముగిసింది”, “ఎర్రజెండా ప్రభావం తగ్గిపోయింది” అంటూ విస్తృత ప్రచారం చేస్తోంది. కానీ ఒక సత్యాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా మరుగునపరిచింది. కమ్యూనిస్టులకు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి పోరాడే రాజకీయ సంస్కారం ఉంది. పీఠం ఉన్నా పోరాటమే.. పీఠం లేకున్నా పోరాటమే.

సభలో ఉన్నా ప్రజల గొంతే.. వీధిలో ఉన్నా ప్రజల హక్కుల కోసమే ఉద్యమం. ఎన్నికల రాజకీయాల్లో డబ్బు, మద్యం, కార్పొరేట్ ప్రభావం పెరిగిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి సభకు ఖర్చు, ఓటుకు నోటు పంచే సంస్కృతి బలపడింది. దాని ప్రభావంతో కమ్యూనిస్టుల సీట్లు తగ్గిన మాట వాస్తవమే. కానీ ప్రజా ఉద్యమాల్లో, కార్మిక పోరాటాల్లో, రైతు సమస్యలపై జరిగే ఆందోళనల్లో మాత్రం వారి ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కమ్యూనిస్టుల వైపే చూస్తున్నారు. విద్యార్థులు, యువజనులు, మహిళలు, రైతులు, సంఘటిత–అసంఘటిత కార్మికులు, ఉద్యోగులు సహా సకల జనుల సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు అండగా నిలిచేది ఎర్రజెండానే. బూర్జువా పార్టీలు ప్రజా పోరాటాలకు కూడా డబ్బులిచ్చి జనాలను సమీకరించాల్సిన పరిస్థితి ఉంది. కానీ కమ్యూనిస్టుల పిలుపు వస్తే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారు. ఇదే వారి అసలు బలం. కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు మాత్రమే కోలమానం కాదు. ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు, సిద్ధాంత నిబద్ధతే అసలు ప్రమాణం. ఉద్యమాలు తగ్గలేదు. పోరాటాలు ఆగలేదు. ప్రజల మద్దతు ఇప్పటికీ వారికి బలంగానే ఉంది. మావో చెప్పిన “ఈ దేశంలో కులం, మతం పరిపాలించిన తర్వాతే కమ్యూనిస్టులు పరిపాలన చేస్తారు” అన్న మాట ఇప్పటికీ ప్రాసంగికంగానే వినిపిస్తోంది.

కేరళలో సాధారణంగా ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ అక్కడి ప్రజలు వరుసగా పదేళ్లు కమ్యూనిస్టు ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు. ఈసారి మార్పు కోరుకున్నా, భవిష్యత్తులో మళ్లీ వామపక్షాలకు అవకాశం ఇవ్వకపోతారని ఎవరూ చెప్పలేరు. కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల ఫలితాలతో మొదలై ముగిసే శక్తులు కావు. పశ్చిమ బెంగాల్‌లో గతంలో తృణమూల్ కాంగ్రెస్‌, అతివాద శక్తులు కలిసి కమ్యూనిస్టు పాలనను ఓడించినప్పటికీ, ఇప్పుడు మళ్లీ అక్కడ వామపక్షాల ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారికి సీట్ల చరిత్ర మాత్రమే కాదు.. శతాబ్దాల పోరాట చరిత్ర ఉంది.భారత స్వాతంత్ర్యోద్యమం నుంచి రైతాంగ సాయుధ పోరాటాల వరకు, కార్మిక సమ్మెల నుంచి భూ హక్కుల ఉద్యమాల వరకు, వెట్టిచాకిరి నిర్మూలన నుంచి విద్యా, వైద్య హక్కుల సాధన వరకు ప్రజల తరఫున సాగిన ప్రతి ప్రధాన ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర చెరగని ముద్రగా నిలిచింది. ఈ దేశంలో శ్రమజీవి హక్కుల చరిత్రను తిరగేస్తే ప్రతి పుట వెనుక ఎర్రజెండా త్యాగగాథ కనిపిస్తుంది. ఎనిమిది గంటల పనిదినం, కనీస వేతనం, కార్మిక భద్రత, కార్మిక చట్టాలు, భూమి కోసం పోరాటాలు, భుక్తి కోసం ఉద్యమాలు, వెట్టిచాకిరి నిర్మూలన, ప్రభుత్వ రంగ పరిరక్షణ, రైతు సమస్యలపై నిరంతర ఉద్యమాలు, విద్యా–వైద్య రంగాల రక్షణ.. ఇవన్నీ అధికార కరుణతో లభించిన వరాలు కావు. ఇవి ప్రజా పోరాటాల ఫలితాలు.

అందుకే కార్పొరేట్ మీడియా కమ్యూనిస్టులను లక్ష్యంగా చేసుకుంటోంది. కారణం స్పష్టం. కమ్యూనిస్టులు ఎన్నికల రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే కాదు.. దోపిడీ వ్యవస్థను ప్రశ్నించే సిద్ధాంత శక్తి. ఎర్రజెండా బలహీనపడితే ప్రశ్నించే గొంతు సన్నగిల్లుతుంది. ప్రజా చైతన్యం బలహీనమవుతుంది. అందుకే కమ్యూనిస్టుల ఉద్యమాలను నిర్లక్ష్యం చేస్తూ, వారి ఎన్నికల వెనుకడుగులను మాత్రమే పెద్దదిగా చూపించే ప్రయత్నం కొనసాగుతోంది. ఇక్కడే మీడియా పాత్రపై మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. పత్రిక ప్రజల పక్షాన నిలవాలా? లేక పాలకుల పక్షానా? ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పిలువబడే మీడియా బాధ్యత ప్రజా సమస్యలను ప్రతిబింబిం చడం, పాలకులను ప్రశ్నించడం, అణగారిన వర్గాల గొంతుకగా నిలవడం. కానీ నేడు కార్పొరేట్ మీడియా ఆ ధర్మం నుంచి దూరమవుతోంది. రైతు, కార్మిక, నిరుద్యోగ, అట్టడుగు వర్గాల సమస్యల కంటే అధికార ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. కమ్యూనిస్టుల రాజకీయాల మూల స్వరూపం కూడా ఇక్కడే స్పష్టమవుతుంది. వారికి అధికారం లక్ష్యం కాదు.. సాధనం మాత్రమే. పదవి అంతిమ గమ్యం కాదు.. ప్రజా ప్రయోజనాల కోసం వేదిక మాత్రమే.

అధికారం కంటే త్యాగాన్ని, పదవికంటే ప్రజా ధర్మాన్ని గొప్పగా చూసిన రాజకీయ సంస్కారం కమ్యూనిస్టులది. ప్రధానమంత్రి పదవికి అవకాశం వచ్చినా సిద్ధాంత నిబద్ధత కోసం దాన్ని తిరస్కరించిన రాజకీయ చైతన్యం కమ్యూనిస్టులదే. చరిత్రను ప్రచారంతో చెరిపేయలేరు. పోరాటాలను శీర్షికలతో చిన్నబుచ్చలేరు. కమ్యూనిస్టులను ఎన్నికల గణాంకాలతో పరిమితం చేయలేరు. వారు కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు.. ప్రజల పక్షాన నిలిచే చారిత్రక అవసరం. విద్యార్థి నుంచి కార్మికుడి వరకు, రైతు నుంచి మహిళ వరకు, ఉద్యోగి నుంచి నిరుద్యోగి వరకు సకల జనుల సమస్యలపై స్పందించే ప్రజా శక్తి ఎర్రజెండానే. ఈ జగతి ఉన్నంతకాలం దోపిడీ ఉంటుంది. దోపిడీ ఉన్నంతకాలం శ్రమజీవి ఉంటాడు. శ్రమజీవి ఉన్నంతకాలం అతని పక్షాన నిలిచే ఎర్రజెండా ఉంటుంది. ప్రజలు ఉన్నంతకాలం.. వారి సమస్యలు ఉన్నంతకాలం.. అన్యాయం ఉన్నంతకాలం కమ్యూనిస్టు ఉద్యమం ఉంటుంది. అది పదవుల కోసం కాదు.. ప్రజల కోసం. అధికారం కోసం కాదు.. హక్కుల కోసం. అందుకే ‘‘ ఈ దేశంలో వామపక్ష‍ాలకు భవిష్యత్తు ఉందా అనేది కాదు, వామపక్ష‍ాలు లేకుండా ఈ దేశానికి భవిష్యత్తు ఉందా?’’ ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు ప్రభాత్‌ ‌పట్నాయక్‌ ‌మాటలు గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది.

గడగోజు రవీంద్రాచారి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -