Wednesday, May 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎదురీదిన ఎర్రజెండా బిడ్డలు

ఎదురీదిన ఎర్రజెండా బిడ్డలు

- Advertisement -

రెండు రోజుల వ్యవధిలో కార్మికోద్యమం ఇద్దరు మహిళా కార్యకర్తలను కోల్పోయింది. దశాబ్దాల కృషితో ఎదిగిన కామ్రేడ్స్….ఇంతలోనే అందనంత దూరం కనుమరుగవుతారని ఎవ్వరూ ఊహించలేదు. మరణం సహజమే. కానీ, ఇద్దరి అకాల మరణమే దిగ్భ్రాంతికి గురిచేసింది. మహిళా కార్యకర్తల మీద శ్రద్ధ పెడుతున్న సమయంలోనే కామ్రేడ్ నూర్జహాన్, కామ్రేడ్ రోజా మృతి కార్మికోద్యమానికి పెద్దలోటు. వీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కాదు. విద్యుత్తు ఉద్యమ వీరులు కాదు. అయినా వీరి విలువ తరగనిది. దోపిడీ సమాజపు దుర్లక్షణాలతో వామపక్ష శ్రేణులు పెనుగులాడుతున్న సమయమిది. ఎర్రజెండా ఉద్యమ పునాదులు కొంత కరిగిన కాలమిది. విష సంస్కృతి విజృంభిస్తున్నప్పటికీ శ్రమ సంస్కృతికి కట్టుబడిన కార్యకర్తలు వీరు. వరదల్లో కొట్టుకుపోయే కట్టెపుల్లలు కాదు! ఏటికి ఎదురీదిన ఎర్రజెండా బిడ్డలు. కానీ, వ్యవక్తిగత స్వభావంలో వేర్వేరు లక్షణాలు ప్రదర్శించిన కామ్రేడ్స్. కార్మికవర్గ దృక్పథంతో నిటారుగా నిలిచిన వారు… .. తలెత్తుకొని తిరిగిన వారు… నిజాయితీగా నిలబడిన వారు. అదే వీరిద్దరి ప్రత్యేకత.

తన తండ్రి సమాధి పక్కనే తన సమాధి ఉండాలని నూర్జహాన్ కోరుకున్నది. తండ్రి ప్రభావంతోనే ఎర్రజెండా నీడన చేరింది. ఆయన ఆశీర్వాద బలం, ప్రోత్సాహమే తనను కమ్యూనిస్టుగా నిలిపింది. అందుకే… ఆ తండ్రి పక్కనే చోటు కోరుకున్నది. నూర్జహాన్ కేవలం కమ్యూనిస్టు కార్యకర్త మాత్రమే కాదు. తన కుటుంబాన్ని ప్రభావితం చేసింది. తన తల్లిదండ్రుల వైపే కాదు, తన భర్త వైపు కూడా… రెండు కుటుంబాలకు, చిన్న వయస్సులోనే పెద్ద దిక్కుగా వ్యవహరించింది. అందరికీ ‘అమ్మ’ అయ్యింది. మైనరు బాలికగానే, ఆవేశంతో పీపుల్స్‌వార్ దళాలలో చేరి, 8 నెలల పసివాడితో 18 మాసాలు జైలు జీవితం గడిపింది. ఎక్కడున్నదో కుటుంబానికి తెలియదు. ఎవరు ‘ములాఖాత్‌’ కోసం వచ్చినా తనకోసమేనేమో అనుకున్నది. ఎవ్వరూ రాలేదు. చిన్న వయస్సులోనే ఆ గుండె రాటుదేలింది. జన జీవనంలో కలిసిన తర్వాత, నిజామాబాద్ జిల్లా సీపీఐ(ఎం) నాయకుడి సహకారంతో సరైన బాటను ఎంచుకున్నది. చంటి బిడ్డను సంకనెత్తుకొని సమావేశాలకు హాజరుకావటం, పోరాటాలలో పాల్గొనటం అందరూ చూసిందే. తన ఇద్దరు కొడుకులకు ఉగ్గుపాలతో ఎర్రబాట రంగరించి పోసిన తల్లి.

ఆమె కుటుంబమంతా ప్రజా ఉద్యమంతో పెనవేసుకున్నది. సమరశీలతకు మారుపేరు నూర్జహాన్. రోడ్డు పక్కన తన చున్నీ పరిచి, బిడ్డను పడుకోబెట్టి, పికెటింగ్‌లో పాల్గొన్న తీరు ఎవ్వరినైౖనా ఆలోచింపజేయక మానదు కదా! అధికారులను, పోలీసులను, ప్రత్యర్థులను ఎదిరించి నిలబడిన ధైర్యశాలి. కార్మికులకు సమస్యలొస్తే, రాత్రీ పగలూ తేడాలేదు. ఎప్ప్పుడైనా, ఎక్కడైనా, సమస్య ఉన్నచోట తానుండేది. రాజకీయాలు, సిద్ధాంతం లోతుగా విశ్లేషించకపోవచ్చు. కానీ, ఆమె ఓ మాస్ లీడర్. మహిళలూ, పురుషులూ, థర్డ్ జెండర్ అన్న తేడా లేదు. కార్మికులందరికీ ఆమె నాయకురాలే. స్కీమ్ వర్కర్లు, అసంఘటిత రంగాలన్నింటా ఆమే…!! వి‌స్తృత సంబంధాలు. చొరవ గల నాయకురాలు. స్నేహశీలి. కామ్రేడ్స్ మధ్య ఆప్యాయతలూ, అనుబంధాలకు ప్రాధాన్యతనిచ్చింది. ఎవరికి ఆరోగ్య సమస్యలొచ్చినా హాస్పిటల్‌కు తీసుకెళ్లటం, డాక్టర్లతో మాట్లాడి ఖర్చు తగ్గించటం తన బాధ్యతగా భావించింది. నిజామాబాద్ సిఐటియూ కార్యాలయాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న ఉద్యమం అంత పెద్ద కార్యాలయం ఎట్లా నిర్మించగల్గిందనిపిస్తుంది.

కార్యాలయం నిర్మాణం కోసం వనరుల్ని సేకరణలో శక్తికి మించి కృషి చేసిన ఐదారు మంది జిల్లా నాయకులలో నూర్జహాన్ ఒకరు. ఆఫీసు నిర్మాణంతోపాటు ఉద్యమావసరాలు, పూర్తికాలం కార్యకర్తల అలవెన్సులకోసం నిధి వసూళ్లలో ముందున్న బృందంలో నూర్జహాన్ ఒకరు. బాధ్యతాయుతమైన కృషికి, చొరవకు అదొక నిదర్శనం. అభిప్రాయాలెన్ని ఉన్నా, అంతిమంగా పార్టీ క్రమశిక్షణకు బద్ధురాలు. అస్తిత్వ రాజకీయాలు, ముఠా ధోరణుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించిన కామ్రేడ్. మతపరంగా మైనారిటీ కుటుంబం నుండి వచ్చింది. అందునా మహిళ. అయినా ఆంక్షలను, ఒత్తిళ్లనూ అధిగమించి నిలబడింది. ప్రజాకళాకారుడిని మతాంతర వివాహం చేసుకున్నది. ప్రస్తుత పరిస్థితులలో ఇది చిన్న విషయమేమీ కాదు కదా! ఆర్థిక ఇబ్బందులు, మానసిక వత్తిడులు, పోరాట క్రమంలో ఎదురైన అవమానాలు, నిర్బంధం తన ఉద్యమ జీవితానికి పరిమితులు విధించలేక పోయాయి. సంప్రదాయాలు, బంధు మిత్రుల అభ్యంతరాలు ప్రభావితం చేయలేకపోయాయి. ఇందుకు భిన్నంగా తానే ప్రభావితం చేయగల్గింది. విప్లవమే లక్ష్యంగా, పోరాటమే జీవితంగా గడిపిన కామ్రేడ్. అందుకే నూర్జహాన్ జీవితమే ఒక సందేశం. నూతన కార్యకర్తలకు ఆదర్శప్రాయం. ఎవరికి ఆరోగ్యం బాగా లేకున్నా పట్టించుకునే తాను, తన ఆరోగ్యం గురించి మాత్రం లెక్కచేయలేదు. అదే ఇంతముప్ప్పు తెచ్చిపెట్టింది. 43 ఏండ్ల వయస్సులోనే దూరమైంది. మత్యువుతో పోరాడుతున్నదని తెలిసి ఏప్రిల్ 11న సాయంత్రానికే కార్మికులతో హాస్పిటల్ కిక్కిరిసింది.

బతికున్నప్ప్పుడు అర్థంకాని కొందరి విలువ మరణానంతరమే వ్యక్తమవుతుంది. కామ్రేడ్ రోజా ఆ కోవకే చెందుతుంది. రోజా మరణంపట్ల కార్మికోద్యమ శ్రేణులే కాదు.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థుల స్పందన అనూహ్యం. ఇందుకు కారణం లేకపోలేదు. ఉద్యమంపట్ల, కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించిందో, ఉద్యోగ బాధ్యతల నిర్వహణలోనూ అంతే బాధ్యతగా పనిచేసింది. విద్యార్థి దశ నుండి ప్రారంభమైన తన ఉద్యమ జీవితంలో ఉద్యమ కార్యకర్తనే జీవిత భాగస్వామిగా ఎంచుకున్నది. పట్టుదల, పని పట్ల నిబద్ధత రోజా ప్రత్యేకత. తన శక్తి ఏమిటో, పరిమితులేమిటో తనకు తెలుసు. క్రమశిక్షణ విషయంలో ఎదుటివారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. తాను చేయాల్సిన పని, చేయగల్గిన పని బాధ్యతగా చేసే మనస్తత్వం. మెడికల్ అండ్ హెల్త్ రంగంలో కార్మికులను సంఘటితం చేసే కృషితో కార్మికోద్యమంతో అనుబంధం మొదలైంది. కార్మికవర్గ పత్రిక బాధ్యతలు కూడా పంచుకున్నారు. ప్రభుత్వోద్యోగిగా, ఉన్నతాధికారిగా ఉంటూ కూడా కార్మికోద్యమం పట్ల అంకిత భావంతో పనిచేసిన కామ్రేడ్. ఆడబిడ్డ తల్లి అయినా ఈ సమాజ ప్రభావాలను తట్టుకుని, ఇంటా బయటా కార్మికవర్గ దృక్పథం ప్రదర్శించింది. బిడ్డమీద కూడా అవే ప్రభావాలు.

ప్రజా జీవితంతో ముడిబడి ఉన్న శాఖలో ఉద్యోగి. ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేయడంలో భాగంగానే ఉద్యోగ ధర్మం కూడా బాధ్యతగా నిర్వర్తించింది. సంస్మరణ సభలలో తన సహచర అధికారులు, మిత్రులు చెప్పిన విషయాలే అందుకు నిదర్శనం. నర్సింగ్ కళాశాలలో గానీ, వైద్య ఆరోగ్య శాఖలో గానీ, కామ్రేడ్ రోజాకు అందిన స్థాయి నివాళులు, బహుశా ఇప్పటివరకు ఎవరికీ అందివుండవు. రోజా స్థానాన్ని ప్రతిబింబిస్తున్న స్పందన ఇది. నర్సింగ్ రంగంలో అత్యున్నత స్థాయిని చేరుకున్నప్పటికీ, ఆ స్థానాన్ని తానెప్పుడూ కోరుకోలేదు. తన అంకిత భావం, సూత్రబద్ధ వైఖరి, నిజాయితీ, నిబద్ధతలే ఆ ఆస్థానానికి చేర్చాయి. అటువంటి స్థానంలో ఉండి కూడా నిజాయితీ ప్రదర్శించడం అంత సులభం కాదుకదా! సరిగ్గా…. నిజాయితీగా ఉన్నందుకే, సూత్రబద్ధంగా పనిచేసినందుకే ఉద్యోగ జీవితంలో వత్తిడులు, వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నర్స్‌గా ఉద్యోగం ప్రారంభించినప్పటి నుంచే మొదలైన వేధింపులు, బాధ్యతలు పెరిగిన మేరకు కక్షసాధింపు చర్యలకు చేరుకున్నాయి. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ బాధ్యతల్లో, ఇన్ని రకాల ఒత్తిళ్ల మధ్య కూడా, తనదంటూ ఓ ముద్ర వేయగలిగింది. వత్తిడులకు, వేధింపులకు ఎప్పుడూ తలవంచలేదు. తనలోని కమ్యూనిస్టే తనను అంత ధైర్యంగా నిలబెట్టింది. అందుకే కమ్ముకొచ్చిన సమస్యలతో మనోస్థైర్యం కోల్పోలేదు. తన పని విధానం పట్ల పశ్చాత్తాపంలేదు. పట్టుదల సడలకుండా పనిచేసిన కార్యకర్త. మరణానంతరం కూడా తన దేహం ప్రజా ప్రయోజనాలకోసం వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలనే కుటుంబం కోరుకున్నది. రోడ్డు ప్రమాదం జరిగిన తీరువల్ల, అందుకు అవకాశం లేకపోయింది.
రెండు రోజుల వ్యవధిలోనే, భిన్న మనస్తత్వాలు, భిన్నమైన బాధ్యతలలో కమ్యూనిస్టు దృక్పథం ప్రదర్శించిన ఇద్దరు మహిళా కార్యకర్తలను కార్మికోద్య మం కోల్పోయింది. ఎవరూ ఊహించ వీలులేని పరిణా మం. అయినా… “మట్టిలో ఉంటిరీ, మొక్కలై మొలకెత్తిరీ” అని ఒక ప్రజాకవి చెప్పినట్టు వీరిరువురి దేహాలు మట్టిలో కలవటం కాదు, మరిన్ని మొలకలు మొలకెత్తటం సహజం. ఆ దిశలోనే ముందుకు సాగుదాం.

ఎస్.వీరయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -