Thursday, May 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపశ్చిమాసియాలో శాంతి దోబూచులాట!

పశ్చిమాసియాలో శాంతి దోబూచులాట!

- Advertisement -

ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం ముగిసిందంటారు, మరోవైపు శాంతి ఒప్పందం కుదరలేదంటారు. మేం చెప్పినట్లుగా వినకపోతే పెద్దఎత్తున తిరిగి దాడులు చేస్తామంటూ ఇంకోవైపు బెదిరిస్తుంటారు. అసలు యుద్ధమే లేదంటూ తమ పార్లమెంటును తప్పుదారి పట్టించారు. లెబనాన్ మీద దాడులను కూడా ఆపాలన్న ఇరాన్ డిమాండ్‌ను పట్టించుకోని అమెరికా ప్రతిరోజూ ఇజ్రాయిల్‌‌తో జరిపిస్తూనే ఉంది.తాను ప్రారంభించిన ప్రాజెక్టు ఫ్రీడమ్‌ను రెండురోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. హార్ముజ్ జలసంధిలో చిక్కుకు పోయిన నౌకలకు దారి చూపి గమ్యస్థానాలకు పంపటానికి పెట్టిన పేరు అది. కాల్పుల విరమణకు ప్రకటించిన నెల రోజుల విరామం గురువారం నాటితో ముగిసిపోయింది.ఈ లోగా పాత అంశాలకే కొన్ని మార్పులు చేసి ఇరాన్ కొత్త ప్రతిపాదనలపేరుతో మధ్యవర్తి పాకిస్తాన్‌కు అందచేసింది. వాటిని పరిశీలిస్తున్నా మంటూనే తమతో ఒప్పందానికి రాకపోతే…..తాట తీస్తానంటూ ట్రంప్ పపాటలే పాడుతున్నాడు. ఒప్పందం కుదుర్చుకొనే పరిస్థితి మరింత మెరుగైందని అదే నోటితో చెబుతాడు. అతగాడు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ఈ పరిస్థితిలో మార్పులేదు. ఐరోపాలోని అమెరికా మిత్రదేశాలన్నీ మరింతదూరం జరుగుతున్నాయి తప్ప చేయూత అందించేందుకు సిద్ధపడటం లేదు.

ఇరాన్ సంక్షోభంలో అనేక దేశాల్లో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతున్నది, జనాల మీద ఇంథన భారం విపరీతంగా పెరుగుతున్నది. ఇదిలా ఉండగా బుధవారం నాడు ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అర్గాచీ చైనా సందర్శించి అక్కడి నేతలతో తాజాపరిస్థితి గురించి చర్చించటం ప్రాధాన్యత సంతరించుకుంది. వాషింగ్టన్ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెన్నుదన్నుగా నిలుస్తున్న చైనాను ఇరాన్ నమ్ముతున్నది. ఒప్పందం కుదుర్చుకొనేందుకు ఇరాన్ ప్రతిపాదించిన పద్నాలుగు అంశాలపై రెండు పక్షాలూ క్రమంగా దిగివచ్చేందుకు ప్రాతిపదిక ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు చెప్పిన కథనాలతో బ్రెంట్ ముడి చమురు ధర 98 డాలర్లకు తగ్గింది.రెండు రోజుల పాటు బలవంతంగా నౌకల విముక్తి పధకాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన కూడా దీనికి దోహదం చేసింది. యురేనియం శుద్ధిని కొంతకాలం వాయిదా వేసేందుకు ఇరాన్ అంగీకరిస్తే దాని మీద విధించిన ఆంక్షల ను క్రమంగా సడలించటంతో పాటు, స్తంభింపచేసిన ఇరాన్ నిధులను కూడా విడుదల చేసేందుకు అమెరికా సుముఖంగా ఉందని ఊహాగానాలు వెలువడ్డాయి.యురేనియం శుద్ధి హక్కును తాము వదలుకొనేది లేదని తప్ప అణ్వాయుధాలను తయారు చేస్తామని ఇరాన్ ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు.

అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందానికి (ఎన్‌పిటి) కట్టుబడే ఉన్నామని అంటోంది. ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తిగా ఉన్న అమెరికా ఇప్పుడేం చేస్తున్నది? ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులను ప్రారంభించటమైతే చేసింది గానీ, ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి అమెరికా నానా ఇబ్బందులు పడుతున్నది. చెప్పుకోరాని చోట దెబ్బతగిలితే ఎవరికైనా ఎలా ఉంటుందో ట్రంప్‌ది అదే స్థితి. ఇరాన్ ప్రతిదాడుల్లో జరిగిన నష్టం గురించి చెప్పుకోలేడు, అలాగని దాచుకోలేడు. గల్ఫ్‌లోని పదిహేను అమెరికా మిలిటరీ కేంద్రాలలో 228 కట్టడాలు, ధ్వంసమైన పరికరాలకు సంబంధించి ఇటీవల ఇరాన్ కొన్ని చిత్రాలను విడుదల చేసింది. వాటిలో విమానాలను నిలిపే ప్రాంతాలు, చమురు డిపోలు,విమానాలు, రాడార్లు, సమాచార వ్యవస్థల వంటివి ఉన్నాయి. ఇంతవరకు ఆ చిత్రాలు తిమ్మినిబమ్మిని చేసి చూపినవిగా లేదా కృత్రిమ సృష్టి అని చెప్పలేక అమెరికా ఏవేవో పిట్టకథలను చెబుతున్నది.ఎవరెన్ని చెప్పినా ఇరాన్ గురిచూసి దెబ్బతీసిందని దాడుల సమయంలోనే వార్తలొచ్చినందున అలాంటి కథలను నమ్మాల్సిన అవసరం లేదు.

ట్రంప్ చెప్పి నట్లుగా మరిన్ని దాడులకు పాల్పడితే ఇదే మాదిరి పరాభవం ఎదురుకావచ్చనే హెచ్చరికలే భూతల దాడులకు దిగకుండా అమెరికా మిలిటరీ జాగ్రత్తపడుతున్నదని చెప్పవచ్చు. ఇరాన్‌పై దాడులతో తమకు 25బిలియన్ డాలర్ల మేర నష్టం వచ్చినట్లు రక్షణశాఖ కబుర్లు చెబుతున్నది. కానీ, ఇది 50బిలియన్ డాలర్లకు పైమాటే ఉంటున్నట్టు తెలుస్తోంది. వర్తమాన సంవత్సరంతో పోల్చితే 42శాతం పెంచి వచ్చే ఏడాది రక్షణ బడ్జెట్‌ను 1.5లక్షల కోట్ల డాలర్లకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారంటే ఎంతగా దెబ్బతిన్నదో చూడవచ్చు. పశ్చిమాసియా, మధ్య ప్రాచ్య ప్రాంతంలో జరిగిన నష్టాలకు సంబంధించిన చిత్రాలను విడుదల చేయవద్దని వాణిజ్య ఉపగ్రహ కంపెనీలను ట్రంప్ యంత్రాంగం ఆదేశిం చిందంటేనే అది ఎంతగా మూసిపెడుతోందో తెలుస్తోంది. ఇరాన్ విడుదల చేసిన చిత్రాలు చైనా, రష్యా ఉపగ్రహాలు తీసినవని వేరే చెప్పనవసరం లేదు. ఎందుకంటే టెహరాన్‌కు అలాంటి వ్యవస్థలు లేవు. గురిచూసి అమెరికా లక్ష్యాలను దెబ్బతీయటం కూడా ఆయా దేశాలం దించిన సమాచారం, ఐరోపా సంస్థలు విడుదల చేసిన సమాచారం, చిత్రాలతోనే సాధ్యమైంది. పిల్లి చెలగాటం ఎలుకలకు ప్రాణ సంకటం అన్నట్లుగా అమెరికా వైఖరి మనతో సహా అనేక దేశాలకు ఇబ్బందులను తెస్తున్నది. అందువలన ఇరాన్ న్యాయమైన డిమాండ్లను అంగీకరించి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని యావత్ ప్రపంచం వత్తిడి తేవాల్సి ఉంది!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -