సెలవుల్లో విద్యాసంస్థల ‘అడ్మిషన్ల’ టార్గెట్లు!
అడ్మిషన్లు చేస్తేనే పూర్తి జీతం.. లేదంటే కోత!
లైవ్ లొకేషన్లతో ఉపాధ్యాయులపై నిఘా
ప్రయివేటు, కార్పొరేట్ బడుల్లో టీచర్ల ‘వెట్టిచాకిరీ’..
విద్యాశాఖ మౌనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
అక్షరాయుధంతో విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన టీచర్లు.. నేడు ప్రయివేటు, కార్పొరేట్ యజమాన్యాల చేతిలో సేల్స్ రిప్రజెంటేటివ్‌లుగా మారిపోతున్నారు. విద్యా బోధనను పక్కనపెట్టి.. ఎర్రటి ఎండలోనూ అడ్మిషన్ల వేటలో వీధుల వెంట తిరగాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి సెలవుల్లో విశ్రాంతి తీసుకోవాల్సిన ఉపాధ్యాయులను కార్పొరేట్ విద్యాసంస్థలు ‘టార్గెట్ల’ పేరుతో మండుటెం డల్లో ఫీల్డ్ వర్క్ చేయిస్తున్నాయి. చదువును వ్యాపారంగా మార్చిన యాజమా న్యాలు, ఉపాధ్యాయులను యంత్రాలుగా చూస్తూ వారి శ్రమను దోచుకుం టున్నాయి. అసలే చాలిచాలనీ వేతనాలు ఇస్తూ.. దానికితోడు అడ్మిషన్లు రాకపోతే వేతనాల్లో కోత విధిస్తామని, అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం విస్మయానికి గురిచేస్తోంది.
టార్గెట్ రీచ్ కాకుంటే జీతం ‘కట్’!
సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో పాఠశాలలకు సెలవులు ఉంటాయి. కానీ ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు మాత్రం ఇవి ‘టార్గెట్’ నెలలు. ప్రతి టీచర్ కనీసం 10 నుంచి 20 అడ్మిషన్లు చేయించాలనే నిబంధన విధిస్తున్నారు. ఒకవేళ టార్గెట్ పూర్తి కాకపోతే, ఇచ్చే అరకొర వేతనాల్లో కూడా కోతలు విధిస్తామని బెదిరిస్తున్నారు. కొన్ని సంస్థలైతే అడ్మిషన్లు చేస్తేనే మే నెల వేతనం ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో చేసేది లేక, పరువు పోతుందన్న భయంతో టీచర్లు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్ల కోసం బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరైతే ఏకంగా అడ్మిషన్లు రాకుంటే జూన్‌లో ఉద్యోగం ఉండదని హెచ్చరిస్తున్నారు.
లైవ్ లోకేషన్లతో నిఘా..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉపాధ్యాయులపై ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యాల నిఘా పరాకాష్టకు చేరింది. ఫీల్డ్ వర్క్‌కు వెళ్లిన టీచర్లు ఎక్కడున్నారు? ఎన్ని గంటలకు ఎవరిని కలిశారు? అనే విషయాలను పర్యవేక్షిం చేందుకు ‘లైవ్ లొకేషన్’ తమ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు. టీచర్లు ఫీల్డ్‌లో ఉన్నంతసేపు వారి ‘లైవ్ లొకేషన్’ ఆన్‌లోనే ఉంచాలి. ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, తిరిగి సాయంత్రం 3:30 నుంచి 5:30 వరకు ఎండలో తిరగాల్సి వస్తోంది. అకౌంటెంట్లు, రిసెప్షనిస్టులను కూడా వదలకుండా అందరినీ వీధుల్లోకి పంపిస్తు న్నారు. మధ్యాహ్నం వేళల్లో కాస్త విశ్రాంతి తీసుకుందామన్నా వీలు లేకుండా పోయింది. ఫోన్ కాల్స్, వాట్సప్ గ్రూపుల ద్వారా నిరం తరం వేధింపులకు గురిచేస్తున్నారని కొందరు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్సెంటివ్‌ల ఆశ.. ముక్కుపిండి వసూళ్లు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సామాన్యులు బయటకు రావాలంటేనే భయపడుతున్న తరుణంలో, ప్రయివేటు, కార్పొరేట్ టీచర్లు మాత్రం వీధి వీధిన తిరుగుతున్నారు. అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను ఒప్పించడానికి టీచర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇదిలావుంటే ఒక అడ్మిషన్‌కి సంబంధించి ముందుగా రూ.3వేల నుంచి 5వేల రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిస్తే, అందులో టీచర్‌కు రూ.1000 ఇన్సెంటివ్ ఇస్తామని యాజమాన్యాలు ఆశ చూపుతున్నాయి. కేవలం రిజర్వేషన్ కోసం రూ.1000 కడితే టీచర్లకు ఎలాంటి లాభమూ ఉండదు. అంటే, యాజమాన్యానికి పైసలు ముట్టేలా చేస్తేనే టీచర్లకు పస్తులు తప్పే పరిస్థితి ఉంది.
జీతాల ఎగవేత.. పర్యవేక్షణ కరువు
ఏప్రిల్ నెలలో సగానికిపైగా పని చేసినా, వేసవి సెలవుల నెపం చూపి ఏప్రిల్ జీతాన్ని జూన్ వరకు వాయిదా వేస్తున్నారు. మే నెల జీతాన్ని జులైలో ఇస్తామంటున్నారు. ఇలా జీతాల చెల్లింపులో అక్రమాలు జరుగుతున్నా, టీచర్లతో వెట్టిచాకిరీ చేయిస్తున్నా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ శూన్యమని విమర్శలు వస్తున్నాయి. విద్యా సంస్థలను వ్యాపార కేంద్రా లుగా మార్చిన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాలని విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
చట్టాలు వర్తించవా..?
కార్మిక చట్టాల ప్రకారం ఉపాధ్యాయులకు కనీస వేతనం, పని గంటల నిబంధనలు ఉండాలి. కానీ ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో అవేవీ అమలు కావడం లేదు. విద్యా చట్టాల ప్రకారం ఉపాధ్యాయులను కేవలం విద్యా సంబంధిత పనులకే ఉపయోగించాలి. కానీ అడ్మిషన్ల కోసం వాడుకోవడం నిబంధనలకు విరుద్ధం. విద్యాశాఖ అధికారులు ఇవేమీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కార్పొ రేట్, ప్రయివేటు విద్యాసంస్థల ఆగడాలపై ఫిర్యాదులు అందుతున్నా, చర్యలు తీసుకో వడంలో వెనుకాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించి, టీచర్లపై అడ్మిషన్ల ఒత్తిడి తెస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యారంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.



