Saturday, May 9, 2026
E-PAPER
Homeసోపతికాటి కాపరి జీవితాలపై వచ్చిన నవల

కాటి కాపరి జీవితాలపై వచ్చిన నవల

- Advertisement -

చిత్తూరు జిల్లాలో తోటి అనే వ్యవస్థ అనాదిగా ఉంది. ఇది కొన్ని కుటుంబాల వారికి వంశపారం పర్యంగా వస్తూ ఉంది. వారి విధులు, విధానాలు, వారు పనిచేస్తున్న గ్రామాలలో చావుల్లో పాల్గొని కాటికాపరిగా పనిచేయడం, ఆయా గ్రామాలలో పశువులు చనిపోతే తీయడం, వ్యవసాయ పనుల్లో పాల్గొనడం చేస్తుంటారు. ఈ తోటి పని మాలల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్లను మాల తోటిగా వ్యవహరిస్తారు. ఎవరైనా చనిపోయారని తెలిసిన వెంటనే అక్కడకు చేరుకోవడం, వారి బంధువులకంతా కబురు చెప్పడం, వారిచ్చే రూపాయి రెండు రూపాయలు తీసుకోవడం, లేదా వారిచ్చే పాత పంచలు పై సవకాలు తీసుకోవడం చేస్తుంటారు. శవయాత్రలో పలకలు కొట్టి కొమ్ములూదడం, తాగి ఆడుతూ పాడుతూ తీసుకెళ్లి గుంతల్లో పూడ్చడం లేక ఖననం చేయటం, శవం మీద కప్పే వస్త్రాన్ని, అక్కడ పెట్టే చావు బియ్యం, పాడె మీద చల్లే చిల్లర తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

ఈ నవలలో తోటి తనం అంటే ఏమిటి? తమ వారసుడ్ని ఎలా తోటిగా మారుస్తారో చెబుతూ.. తోటి వారి విధులు, వారి జీవిత విధానం తెలియజేయడంతో పాటు, ఊళ్లో వారు ఎదుర్కొనే అంటరానితనం, వివక్షత, దోపిడి గురించి కూడా తెలియజేశారు. గ్రామం పై ఆధిక్యతను ప్రదర్శించే గ్రామ మునసబు మాల మాదిగల ఐక్యతను చెడగొట్టి, వాళ్ళలో విభేదాలను సష్టించడానికి ప్రతి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో వివరంగా తెలిపారు. పనులు చేయించుకునే రెడ్లు వారికి తిండి పెట్టక, డబ్బులు ఇవ్వక ఎలా వేధిస్తుంటారో చెబుతారు. మునుపటిలా తోటి తనం గిట్టుబాటు కాకపోవడంతో ఊళ్ళు వదిలి కూలి పనులకు పోవాల్సి వస్తుంది. కాలం మారుతున్నది. అయినప్పటికీ దళితులు, సవర్ణుల మధ్య ఉన్న ప్రేమ కలాపాలు, అక్రమ సంబంధాలుగానే ఉండిపోవాలి.

వివాహాల మాట ఎత్తితే అది చావులకే దారితీస్తుందని వివరిస్తారు. ఓట్లు ఎవరికి వేయాలో గ్రామమునసబు నిర్ణయిస్తాడు. కాదంటే వాళ్ళని నిర్బంధించి, వాళ్లే ఓట్లు వేసుకుంటారు. ఎదిరించిన వాళ్లను అరెస్టులు చేయించి జైలుకు పంపుతారు. వీళ్ళ దోపిడీ, అణచివేతలను ఎదుర్కోవాలంటే మాల మాదిగల ఐక్యత అవసరమని బోధించి, వాళ్ళను ఏకం చేసిన చెంగల్రాయుడు జీవితాన్ని వివరిస్తూ, మూరిశెట్టి గోవిందు ఈ ”కాపరి” అనే పరిశోధనాత్మక నవలను రాశారు. ఈ నవల తోటి సమాజ నిత్య పోరాటాన్ని, మనుగడ కోసం వారి తిరుగులేని పట్టుదలను, భవిష్యత్తుపై వారికి ఉన్న ఆశను చిత్రిస్తుంది. అట్టడుగు స్థాయిలో ఉండి అంటరాని వాడుగా చూడబడే కాపరుల జీవితాలను, పరిశోధనాత్మకంగా పాఠకుల ముందుకు తెచ్చిన రచయిత మూరిశెట్టి గోవిందు అభినందనీయుడు.

కాపరి (పరిశోధనాత్మక నవల), మూరిశెట్టి గోవింద్‌. పేజీలు : 140, వెల :150/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు,
అమెజాన్‌ ఫ్లిప్‌కార్ట్‌

– కె.పి.అశోక్‌ కుమార్‌
9700000948

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -