Sunday, June 21, 2026
E-PAPER
Homeసోపతిబుక్‌ ఫెయిర్‌ నోట్స్‌

బుక్‌ ఫెయిర్‌ నోట్స్‌

- Advertisement -

పుస్తక ప్రదర్శనలంటే నాకు ఒక గాఢమైన ఆరాధన. కొత్త పుస్తకాల వాసన, స్టాళ్ల మధ్య తిరిగే జనాలు, చేతుల్లో సంచుల నిండా అక్షరాలు మోసుకెళ్తున్న మనుషులు.. అవి నాకు ఎప్పుడూ ఒక గొప్ప ఉత్సవంలా అనిపిస్తాయి. ఆమెకు మాత్రం మొదట్లో ఆ ఆసక్తి పెద్దగా ఉండేది కాదు.
”ఇన్ని పుస్తకాలు ఎవరు చదువుతారు రామ్‌?” అంది ఒకసారి.
”ప్రపంచాన్ని మార్చాలని కలలు కనే వాళ్లు,” అన్నాను.
”మీరు ప్రమాదకరమైన జాతి అనిపిస్తోంది,” అని నవ్వేసింది.
ఆ మాటలు మా మధ్యలో మౌనంగా మిగిలిపోయాయి. కొన్నిసార్లు అవే మళ్లీ మళ్లీ గుర్తొచ్చేవి. ఆ రోజు నగరంలో వార్షిక పుస్తక ప్రదర్శన జరుగుతోంది. నన్ను ఒక చర్చా కార్యక్రమానికి పిలిచారు. సాయంత్రం నేను అక్కడికి చేరుకునేటప్పటికి బుక్‌ ఫెయిర్‌ వెలుగులతో మెరిసిపోతోంది. గేటు దగ్గర నుంచే గుంపులు గుంపులుగా జనాలు. ప్రతి స్టాల్‌ ముందు ఒక చిన్న ప్రపంచం కదులు తున్నట్టుంది. నేను స్టేజ్‌ దగ్గర మిత్రులతో మాటల్లో ఉండగా ఆమె వచ్చింది. బ్లూ కాటన్‌ చీర. చేతిలో చిన్న జ్యూట్‌ బ్యాగ్‌. జుట్టు వదులుగా భుజాలపై పడిపోయింది.
”బోర్‌ కొట్టే స్పీచ్‌ అయితే మధ్యలో వెళ్లిపోతాను” అంది.
”నీ కోసం కొంచెం తక్కువ బోర్‌గా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను” అన్నాను.
ఆమె నవ్వింది.
కొద్దిసేపటికే కార్యక్రమం మొదలైంది. వందలమంది… విద్యార్థులు, రచయితలు, పుస్తకాల ప్రేమికులు, యువకులు. మైక్‌ ముందు నిలబడగానే ఎందుకో నా చూపు ముందుగా ఆమెను వెతికింది. మూడో వరుసలో కూర్చుంది. చేతులు మోకాలిపై పెట్టుకుని చాలా శ్రద్ధగా చూస్తోంది. నేను మాట్లాడటం మొదలుపెట్టాను.
”పుస్తకాలు కేవలం అక్షరాల సమాహారం కావు… మనిషి తనను తాను కనుగొనే ప్రయాణాలు.”
హాల్‌ నిశ్శబ్దంగా మారింది.
”ఒక మంచి పుస్తకం మన ఒంటరితనానికి భాష ఇస్తుంది. మనం ఒంటరివాళ్లం కాదని గుర్తు చేస్తుంది. మనల్ని ప్రపంచంతో సంభాషించేలా చేస్తుంది.”
ఆ మాటకు సభలో ఒక నిశ్శబ్ద సమ్మతి వినిపించింది.
”కానీ, అధికారం ఎప్పుడూ ఈ సమాజం చదవకూడదని కోరుకుంటుంది. ఎందుకంటే చదివే మనిషి ప్రశ్నించడం మొదలు పెడతాడు. ప్రశ్నలు మొదలైతే… అప్పటివరకూ సౌకర్యంగా ఉన్న నిజాలు కదలిపోతాయి.”
ఆ మాటతో కాసేపు ఆగాను. సభలో నిశ్శబ్దం మరింత గాఢమైంది. తిరిగి కొనసాగించాను.
”తెలుసా… అధికారానికి ఎక్కువ భయం ఆయుధాల వల్ల కాదు. పుస్తకాల వల్ల. చదివే మనుషుల వల్ల. పుస్తకాలు సమాధానాలకంటే ముందు ప్రశ్నలను మేల్కొలుపుతాయి. ఆ ప్రశ్నలు మనిషి ప్రపంచాన్ని చూసే విధానాన్నే మార్చేస్తాయి. అందుకే ప్రతి గొప్ప పుస్తకం ఒక నిశ్శబ్ద తిరుగుబాటు.”
చప్పట్లు.
కానీ ఆ చప్పట్ల మధ్య కూడా నాకు కనిపించింది ఆమె ముఖమే. ఆమె కళ్లలో ఒక కొత్త భావం ఉంది. ఇప్పటివరకు నా గురించి ఆమెకు తెలిసింది కొన్ని సంభాషణలు, కొన్ని ప్రయాణాలు, కొన్ని నవ్వులు మాత్రమే. ఆ సాయంత్రం మాత్రం నేను ఎందుకు పుస్తకాలు చదువుతానో, ఎందుకు కొన్ని విషయాల మీద అంత ఆవేశపడతానో, మొదటిసారి ఆమె చూస్తున్నట్టనిపించింది.
నేను మాట్లాడుతూనే ఉన్నాను.
”ప్రేమలో పడిన మనిషి ఒక కవితను వెతుకుతాడు. పోరాటంలో ఉన్న మనిషి ఒక సిద్ధాంతాన్ని వెతుకుతాడు. కానీ జీవితం పూర్తిగా అర్థం కావాలంటే రెండూ కావాలి.”
ఆ మాటలు చెప్పేసరికి ఆమె తల కొంచెం వంచి నవ్వింది. ఆ నవ్వులో
”ఇది నా గురించే చెప్తున్నావు కదా…” అన్న అల్లరి ఉంది.
స్పీచ్‌ ముగిసింది. హాల్‌ మొత్తం చప్పట్లతో నిండిపోయింది.
మైక్‌ ఆఫ్‌ అయ్యాక కూడా హాల్‌లో ఆ నిశ్శబ్దం కొద్దిసేపు మిగిలిపోయింది.
కానీ నా మనసు మాత్రం
ఆమె రియాక్షన్‌ కోసం ఎదురుచూస్తోంది. ఆమె బయట ఒక పుస్తకాల స్టాల్‌ దగ్గర నిలబడి ఉంది. చేతిలో ఒక కవిత్వ పుస్తకం. నేను దగ్గరకు వెళ్లాను. ఆమె మెల్లగా నవ్వింది.
”నువ్వు మాట్లాడుతున్నప్పుడు… నాకోసారి చప్పట్లు కొట్టాలనిపించింది. మరోసారి వచ్చి నిన్ను హత్తుకోవాలి అనిపించింది.”
నేను నవ్వాను.
”ఎందుకంటే… నువ్వు పుస్తకాల గురించి మాట్లాడలేదు రామ్‌.”
”మరి?”
”నువ్వు మనుషుల గురించి మాట్లాడావు.”
ఆ మాట…
నా లోపల ఎక్కడో మదువుగా దిగిపోయింది. మేం స్టాళ్ల మధ్య నెమ్మదిగా డుస్తున్నాం. ఒక్కసారిగా ఆమె ఒక పుస్తకం తీసుకుని నా చేతిలో పెట్టింది. ముఖచిత్రంపై పేరు… ‘ూశీఙవ ఱఅ ్‌ష్ట్రవ ుఱఎవ శీట =వఙశీశ్రీబ్‌ఱశీఅ.’ నేను నవ్వుతూ ఆమె వైపు చూశాను.
”ఇది సూచనామా?”
ఆమె దగ్గరకి వచ్చి నెమ్మదిగా అంది…
”బహుశా…”
కొద్దిసేపు ఆగి..
”నిన్ను ప్రేమించడం కొన్నిసార్లు
ఒక పుస్తకం చదివినట్టుంటుంది రామ్‌.”
”అంత క్లిష్టంగా ఉంటానా?”
”లేదు…
ప్రతి సారి కొత్త అర్థం కనిపిస్తుంటుంది.”
ఆ మాట తర్వాత ఒక అందమైన నిశ్శబ్దం పుట్టింది. స్టాళ్లు మూసే సమయం దగ్గరపడుతోంది. జనం నెమ్మదిగా బయటికి వెళ్తున్నారు.
”నువ్వేం కొనలేదే?” అంది.
”ఈరోజు దొరికిన బెస్ట్‌ స్టోరీ నా పక్కనే నడుస్తోంది కదా…”
ఆమె ఒక్కసారిగా నడక ఆపేసింది.
తర్వాత చిన్నగా అంది…
”రామ్‌…”
”హా?”
”నీతో సమస్య ఏంటో తెలుసా?”
”ఏంటి?”
”నిన్ను అర్థం చేసుకునేకొద్దీ…
ఎక్కువ నచ్చేస్తావ్‌.”
నేను నవ్వలేదు. ఏమీ మాట్లాడలేదు.
కొన్నిసార్లు మనిషి జీవితంలో చప్పట్ల కంటే విలువైన ప్రశంసలు ఉంటాయి.
ఆమె మాటలు ఇంకా నా చెవుల్లో నిశ్శబ్దంగా తిరుగుతూనే ఉన్నాయి.
– రామ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -