Sunday, June 21, 2026
E-PAPER
Homeసోపతిశ్రీవిద్య విఫల జీవన విషాద కథానాయిక

శ్రీవిద్య విఫల జీవన విషాద కథానాయిక

- Advertisement -

ఆమె కళ్ళు అమాయక చూపులతోనే మాట్లాడేవి. ముఖంలోని కదలికలే హావ భావాలను పలికించేవి. కేవలం 13 ఏండ్లకే సినిమాల్లోకి అడుగుపెట్టింది. దాదాపు 40 ఏండ్లకు పైగా సాగిన తన ప్రస్థానంలో బాలనటి, కథానాయిక, భార్య, ప్రేమికురాలు, తల్లి వంటి అనేక రకాల పాత్రలను పోషించి తనదైన ముద్ర వేసింది. ఆమె శ్రీవిద్య. శ్రీవిద్య అనగానే తెలుగు సినిమా ప్రేక్షకులకు దాసరి తీసిన ‘తూర్పు పడమర’లో ఆమె పోషించిన పాత్ర వెంటనే గుర్తుకొస్తుంది. ఆ సినిమా బాలచందర్‌ తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్‌’కు రీమేక్‌. తన కెరీర్‌ ఆరంభం నుంచీ చివరి వరకు సహజ నటిగా నిలదొక్కుకుంది. మలయాళ, తమిళ, తెలుగు చిత్రసీమలతో ఆమెకు సుదీర్ఘమైన అనుబంధం వుంది.

శ్రీవిద్య 1953 జూలై 24న చెన్నైలో తమిళ హాస్య నటుడు కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన ఎం.ఎల్‌. వసంతకుమారి దంపతులకు జన్మించింది. శ్రీవిద్య పుట్టిన కొన్నాళ్ళకి తండ్రి జబ్బు పడటంతో ఆయన నటనకు దూరం కావలసి వచ్చింది. దాంతో వారి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులలో పడింది. నిరంతరం సంగీత కచేరీలలో మునిగిన తల్లికి తనకు పాలు పట్టటానికి కూడా సమయం ఉండేది కాదు. శ్రీవిద్య చాలా చిన్న వయసులోనే నటనలో ప్రవేశించింది. ఆమె స్వయంగా మంచి సంగీతకారిణి, అద్భుతమైన భరతనాట్య నత్యకారిణి కూడా. మొదట్లో శ్రీవిద్యకు అమెరికాలోని ఒక శాస్త్రవేత్త నుండి వివాహ ప్రతిపాదన వచ్చింది. కానీ కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆ వివాహం జరగలేదు.

తమిళ చిత్రపరిశ్రమలో…
పి.సుబ్రమణ్యన్‌ దర్శకత్వం వహించిన కుమార సంభవం(1969) లోని ఒక నత్య సన్నివేశంతో మలయాళ చిత్రరంగంలో ప్రవేసించింది. దాసరి నారాయణరావు తెలుగులో దర్శకత్వం వహించిన చిత్రం ‘తాతా-మనవడు’ (1972)తో శ్రీవిద్య తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె నటించిన మొదటి చిత్రం ‘తిరువరుట్చెల్వర్‌’ అని కూడా అంటారు. మొదట ‘చట్టం బిక్కవల’ చిత్రంలో ఆమె సత్యేన్‌ సరసన నాయికగా నటించింది. ఎ.విన్సెంట్‌ ‘చెందా’ (1973) చిత్రంతో ఆమె ప్రజాభిమానాన్ని చూరగొంది. ‘జూలీ’ హిందీ చిత్రంతో లక్ష్మి ఆమెకు స్నేహితురాలు. 1970ల మధ్య కాలంలో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో బాగా నిలదొక్కుకుంది. నూత్రుక్కు నూరు, కె. బాలచందర్‌ ‘సొల్లతాన్‌ నినక్కిరెన’్‌, ‘అపూర్వ రాగంగళ్‌’ వంటి చిత్రాలలో నటించింది. అపూర్వ రాగంగల్‌ (1975) లో ఆమె అప్పటి కొత్త నటులు, ఇప్పటి అగ్ర హీరోలైన రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో నటించింది. ఈ చిత్రం ఆమె జీవితాన్నే మార్చివేసింది. ఆ చిత్రంలో ఆమె రజినీకాంత్‌ భార్యగా, కమల్‌ హాసన్‌ ప్రేయసిగా నటించింది. ఈ సినిమా ఆమె సినీ జీవితంలో మైలురాయి వంటిది.

జీవించిన కొన్ని పాత్రలు
‘కట్టతే కిలికూడు’ చిత్రంలో ఈమె నిశ్శబ్దంగా, గహిణిగా, ప్రేమగా ఉండే భార్య శారద పాత్రను పోషించింది. ‘కట్టతే కిలికూడు’ నిజానికి ఆమె కథే. అన్ని ప్రతికూలతల మధ్య కుటుంబాన్ని కలిపి ఉంచడానికి ఆమె చేసే పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన విద్యార్థినిని ప్రేమించే భర్త చేష్టలను భరించే సన్నివేశంలో దుఃఖం, నిస్సహాయతల మధ్య నలిగిపోతుంది. పిల్లల కోసం ధైర్యంగా కుటుంబ బంధాన్ని నిలుపుకునే ప్రయత్నంలో శ్రీవిద్య సహజ నటన అనితన సాధ్యం. ‘కందుకొండైన్‌ కందుకొండైన్‌’లో ముగ్గురు పెద్ద కుమార్తెలు ఉన్నప్పటికీ, తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోయినందుకు క్షమించని తన తండ్రి ఆగ్రహాన్ని ఎదుర్కొనే పద్మ పాత్రలో జీవించింది. కే.జీ. జార్జ్‌ ‘ఇరకల్‌’లో అత్యంత వాస్తవికమైన, సాహసోపేతమైన కథానాయిక ‘అన్నీ’ పాత్ర శ్రీవిద్యది. ‘అడమింటే వారియెల్లు’లో కుట్రలు పన్నే, మోసపూరితమైన, సున్నితత్వం లేని వ్యాపారవేత్త మామచాన్‌ భార్య ‘ఆలిస్‌’ పాత్ర శ్రీవిద్యది. అతని కుట్రలకు, కుయుక్తులకు బలైన భార్యగా చివరలో భర్తను ధిక్కరిస్తుంది. ‘ఎడవళియిలే పూచ మిండ పూచ’లో శ్రీవిద్య ఒక వ్యాపారవేత్త నిర్లక్ష్యానికి గురైన భార్య రోహిణి పాత్రను పోషించింది. ‘ఎంతే సూర్యపుత్రిక్కు’లో పట్టు చీరలలో తేజోవంతంగా కనిపించే ఒక శాస్త్రీయ గాయని ‘కేఎస్‌ వసుంధర దేవి’ పాత్ర ఆమెకు అచ్చుగుద్దినట్లు సరిపోయింది. ఆమె కచేరీలు నిర్వహించే సన్నివేశాలు చూస్తుంటే, ఆమె జీవితాంతం అదే చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ పాత్రలో శ్రీవిద్య సూక్ష్మంగా, భావోద్వేగం, ప్రశాంతత, నిస్సహాయత, కోపాలను సరైన మోతాదులో ప్రదర్శించింది. తెలుగులో నటించిన ‘తూర్పు మడపర’లో తనకన్నా తక్కువ వయసున్న యువకుడి ప్రేమలో పడిన నడివయసు స్త్రీ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించలేము.

పలు భాషల్లో చిత్రాలు
ఈ నేపథ్యంలో శ్రీవిద్య ‘శక్తి, తీక్కడల్‌, విల్కానుండు స్వప్నంగళ్‌ (1980), అత్తిమరి, కతయరియతే (1981), ఇతిరి నేరం ఒతిరి కార్యం, కెల్వియుం నానే బదిలుం నానే (1982), కట్టతే కిలికూడు, పిన్‌ నిలవు, ప్రతిజ్ఞ (1983), అరంటే ముల్ల కోచు ముల్ల (1984), జనకీయ కొడతి, తిన్కలళ్చ నల్ల దివసం (1985), ఇరకాల్‌ (1986), పున్నగై మన్నన్‌హొ(1986), జాలకం, స్వాతి తిరునాళ్‌ (1987), ఇన్నలే, మాప్పిలై, విక్కీ దాదా (1989), సామ్రాజ్యం, ఓ పాపా లాలి, కొండవీటి దొంగ (1990), దళపతి, అద్వైతం, ఎంతే సూర్యపుత్రిక్కు (1991), దైవతింటే విక్రితికల్‌ (1992), పూనిలమళ, అనియతి ప్రవు (1997), కన్నెతిరే తొండ్రినల్‌ (1998), కన్నెతిరే తొండ్రినల్‌ (1998) కన్నెతిరే తొండ్రినల్‌ (1998), అగ్నిసాక్షి, అరుంధతి, సంగమం (1999), కన్డుకొండైన్‌ కన్డుకొండైన్‌, ఇంగనే ఒరు నిలపక్షి (2000), మలయాలిమమను వణక్కం (2002)’ వంటి తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిందామె. అలాగే తెలుగులో తూర్పు పడమర తర్వాత కన్యాకుమారి, రాముని మించిన రాముడు, బలరామ కష్ణులు, ప్రేమలేఖలు, గాండీవం, ధర్మ చక్రం, చిన్నబ్బాయి, సిద్దార్ధ, ఇంద్రుడు చంద్రుడు వంటి తెలుగు సినిమాలలో ఆమె ప్రధానమైన పాత్రలు పోషించింది. కొన్ని హిందీ చిత్రాలలో కూడా ఆమె నటించింది. తన నటనలో ఆమె కళ్లు కూడా భావాలను అద్భుతంగా పలికించగలవు. శ్రీవిద్య ఒక మంచి గాయని కూడా. ఆమె మొదటిసారి ‘అయలతే సుందరి’ అనే మలయాళ చిత్రంలో పాడింది. తర్వాత ఒరు పైన్కిలిక్కద, నక్షత్ర తరట్టు వంటి చిత్రాలలో పాడింది. ఆమె వయోలిన్‌ వాద్య కళాకారిణి కూడా. సూర్య ఫెస్టివల్‌ వంటి వేడుకలలో పాడుతూ ఉండేది.

జీవితమంతా విషాధభరితమే
అపూర్వ రాగంగళ్‌ చిత్ర నిర్మాణ సమయంలో ఆమె కమల హాసన్‌ ప్రేమలో పడింది. వారి ప్రేమను కుటుంబాలు అంగీకరించినా వారు విడిపోయారు. ఒకరకంగా వారి బంధం విడివడటానికి కమలహాసన్‌ ప్రవర్తనే కారణం అని తమిళ పత్రికలు రాశాయి. తర్వాత ఆమె మలయాళం చిత్రం ‘తీక్కనల్‌’ సహాయ దర్శకుడు జార్జ్‌ థామస్‌ తో ప్రేమలో పడింది. తన కుటుంబం నుండి వ్యతిరేకత ఎదురైనా ఆమె అతనిని 1978లో వివాహం చేసుకుంది. ఆమె ఒక గహిణిగా ఉండాలని కోరుకుంది. కానీ భర్త ఆమెను డబ్బు సంపాదించే యంత్రంగానే భావించాడు. ఆర్ధిక సమస్యలను ఎత్తి చూపి జార్జ్‌ ఆమెను సినిమాలలో నటించడానికి ఒత్తిడి చేసాడు. దాంతో ఆమె నటనకు తిరిగి రావలసి వచ్చింది. అతనిని వివాహం చేసుకోవటం ఒక తప్పుడు నిర్ణయం అని ఆమె గ్రహించింది. వైవాహిక జీవితం దయనీయంగా తయారైంది. ఆ వివాహం విడాకులతో ముగిసింది. తర్వాత వారి మధ్య ఉన్న ఆర్ధిక వివాదాల పరిష్కారం కొరకు చాలాకాలం చట్టబద్ధమైన పోరాటం జరిగింది. ఆ కేసు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళింది. అక్కడ అంతిమ తీర్పు ఆమెకే అనుకూలంగా వచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె చెన్నై వదిలి త్రివేండ్రంలో స్థిరపడింది. తన సినీ జీవితంలో చివరి భాగంలో ఆమె మలయాళం చిత్రాలపై ధ్యాస పెట్టింది. పలు చిత్రాలలో తల్లిగా ఆమె నటన గొప్ప ప్రశంసలు అందుకుంది.

మలయాళీల దత్త పుత్రిక
2003లో శారీరిక ఇబ్బందుల తర్వాత ఆమె బయాప్సీ చేయించుకుంది. కాన్సర్‌ ఉన్నట్లు ధవపడింది. మూడేండ్ల పాటు చికిత్స జరిగింది. కానీ అప్పటికే కాన్సర్‌ ఆమె శరీరమంతటా వ్యాపించింది. 2006 అక్టోబర్‌ 19న ఆమె కన్ను మూసింది. శ్రీవిద్య జీవితంలో ఎంత హుందాగా ఉండేవారో, మరణంలో కూడా అంతే హుందాగా ఉన్నారు. కేరళ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అందుకున్న ఏకైక నటి ఆమె. అప్పటి ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ శ్రీవిద్య మరణించినప్పుడు ‘ఆమె తమిళనాడులో జన్మించినప్పటికీ, కేరళకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన నటిగా మలయాళ సినిమా రంగంలో భాగమయ్యారు. కేరళ ఆమెను తమ కూతురిగా దత్తత తీసుకుంది’ అన్న మాటలతో శ్రీవిద్య మలయాళీలకు ఎంతగా చేరువైందో మనకు అర్థం అవుతుంది.
(రిఫరెన్స్‌ కర్టెసీ : నళినీ శివకుమార్‌,
రేమా మహాలింగం)
హెచ్‌ రమేష్‌ బాబు,
7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -