Sunday, July 26, 2026
E-PAPER
Homeసోపతికోపం.. ఓ ఉద్వేగం, దాన్ని అర్థం చేసుకోండి..!

కోపం.. ఓ ఉద్వేగం, దాన్ని అర్థం చేసుకోండి..!

- Advertisement -

కోపం.. అంతరంగంలో వుండే అంతః ప్రవత్తిని జాగతపరిచే ఉద్వేగం. అక్కసు వెళ్ళగక్కుతున్నామంటే, మన ప్రతిభను మనం నిరూపించుకుని తీరాలనే ఉద్రేకం ఉత్తేజితమవుతోందని అర్ధం. కోపం అందరూ అనుకునేటట్లు శాపంగానే అనుకోవాల్సిన అవసరంలేదు. అర్ధం చేసుకుంటే అది వరం కూడా..!

బాస్‌ తిట్టాడు. అసలే ఆఫీసు పనితో సతమతమవుతున్న సుబ్బారావుకు పుండుమీద కారం అద్దినట్లయ్యింది. పైగా నువ్వేమీ చేయలేవోరు. నీకేం చేతకాదు’ అని ఒక కితాబు కూడా ఇచ్చాడు. దాంతో సుబ్బారావుకు మరింత కోపం వచ్చింది. ‘ప్రభుత్వ విధానాలు ఇలా తగలడ్డాయి’ అని కసిగా అనుకున్నాడు. ఆ రోజు ఇక పని చేయబుద్ధి కాలేదు. క్యాంటీన్లో టీలు తాగుతూ, కొలీగ్స్‌తో హస్కు కొడుతూ గడిపేశాడు. అతను ‘పనిచేయని’ రోజుల ఖాతాలో మరొక రోజు అదనంగా కలిసింది. చేస్తున్న ఉద్యోగంలో ఇలా అడపా దడపా కోపం తెచ్చుకోవడం ఉద్యోగులందరికీ అనుభవమే. కార్యనిర్వహణలో ఎవరైనా తప్పుదారి మళ్ళించినపుడు, అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినపుడు, శ్రద్ధగా పని చేస్తున్నా చేయటం లేదని కసురుకున్నపుడు, మరీ ముఖ్యంగా నీకేమీ చేతకాదని తీర్మానించినపుడు కోపం తారాస్థాయికి చేరుతుంది. పనిచేయగల సామర్ధ్యం వుండి కూడా ఇలా అందరిచేతా ఈసడింప బడటమేమిటో అర్ధంకాక, ఎవరినీ ఏమీ అనలేక చాలామంది ఇంట్లో పెళ్ళాం, పిల్లల్ని చితకబాదటమో.. మరీ అంత క్రూరంగా ప్రవర్తించలేకపోయే వారయితే అందుబాటులో వున్న ప్రభుత్వాన్ని నిందించడమో చేస్తుంటారు. కొంతమంది ఈ అసంతప్తి కారణంగా పనిని వాయిదా వేస్తూ మరింత చెడ్డపేరు తెచ్చుకుంటారు. మరి కొంతమంది నిజంగానే తమకు ఏమీచేతకాదేమోనన్న మీమాంసలో పడిపోతారు. ఇంకొంతమంది తమ కార్యనిర్వహణ సామర్ధ్యం బాగా దెబ్బ తిందని నిస్సహాయులై కెరీర్‌ కౌన్సెలర్ల వద్దకు పరిగెడతారు. కెరీర్‌ ‘కోపం’ అంత పని చేయిస్తుంది.
నేలవిడిచి సాము చేసే కొంతమంది ఉద్దండులు ఇలా కాదని చెప్పి ‘మరో ఉద్యోగం చూసుకుంటే పోలా’ అని నిర్ధారణకు వచ్చి, ఉద్యోగాల వేట మొదలుపెడతారు. ఇలా చేసే వాళ్ళకి మంచి పరిణామాలెదురైతే సరే సరి. లేకపోతే మాత్రం ‘తన కోపమే తనకు శత్రువు’ అనే నానుడి నిజమయ్యింది కదా అని అనుకుంటారు. తన కోపం ఎపుడూ తనకు శత్రువు కానేకాదని అమెరికాకు చెందిన కెరీర్‌ కౌన్సెలర్‌ కేథీ గుడ్విన్‌ అనే ఆమె అంటుంది. కోపం వచ్చినపుడు ఏం చేయాలో ఎలా ఆలోచించాలో ఆమె గైడెన్స్‌ ఇస్తుంది.
కోపం.. ఉపయోగపడే ఉద్వేగమే
చాలామంది ‘కోపం’ మనల్ని తప్పుదారి పట్టించే నెగటివ్‌ ఉద్వేగం అనుకుంటారు. ‘కోపం’ ఉద్వేగాన్ని విశ్లేషణ పూర్వకంగా అవగాహన చేసుకోక పోవడం వల్లనే ఈ రకమైన వ్యతిరేక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. కానీ, నిజానికి ‘కోపాన్ని’ సరిగ్గా అర్ధం చేసుకుంటే అందువల్ల ఎన్ని ప్రయోజనాలు వున్నాయో చాలా సులభంగా తెలుస్తుందని కేథీ గుడ్విన్‌ అంటుంది. ముఖ్యంగా ‘నీకేం చేతకాదు’ అని ఎవరైనా అన్నపుడు కస్సున తారాస్థాయిలో లేచే కోపం మరింత ఉపయోగకరమైందని ఆమె వివరిస్తుంది. ఒక పనిని సమర్ధవంతంగా నిర్వర్తించగలమన్న దఢమైన విశ్వాసం, గుండె నిబ్బరం కలవారికే ఇలా ‘కోపం’ పాము పడగలా కస్సుమంటుందని ఆమె అభిప్రాయం. ఇది వారిలో అంతర్లీనంగా దాగివుండే సామర్ధ్యానికి దర్పణమని కేథీ అంటుంది. అలా దాగివున్న సామర్థ్యం మరింత పదును తేలి కార్యరంగంలోకి మరింత ఉత్సాహభరితంగా అడుగు పెట్టేలా చేస్తుందని అంటారామె. ‘నాకెందుకు చేతకాదు.. చేసి చూపిస్తా.. ఎన్ని అవరోధాలు వచ్చినా నేను ఈ పనిని చేయగలను, నేను మాత్రమే ఈ పనిని చేయగలనని అందరికీ నిరూపిస్తా’ వంటి సవాలుతత్వం ఎదురవుతుందని అంటుంది. నిజంగానే ఎన్ని అవరోధాలు ఎదురైనా, అవమానాలు ఎదురయినా, వాటన్నిటినీ పట్టించుకోకుండా, మరింత నిబ్బరంగా, లక్ష్యసాధన పట్ల ఒక రకమైన కసితో గట్టిగా దష్టి పెట్టి పనితనపు సామర్ధ్యాన్ని వెలికి తీసే అవకాశాన్ని కోపం అందిస్తుంది.
అయితే కోపం వల్ల దుష్ప్రయోజనాలుండవని.. ఎప్పుడూ కోపమే తెచ్చుకోవాలని, కోపం వున్నపుడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ‘కోపం’ అనే ఉద్వేగం ఏర్పడినపుడు దానికి లోబడిపోకుండా సరిగ్గా అర్ధం చేసుకొని, కర్తవ్య నిర్వహణకు ఉద్యుక్తం కావాలని నా అభిప్రాయం. కోపం వల్ల కలిగే ఉపద్రవాలను ఉపేక్షించి, కోప్పడడం ఏదో దేశం గర్వించదగ్గ విషయంగా ఫీలయిపోయి, ‘ముక్కోపి’ అనే తిట్టును పరమవీరచక్ర బిరుదులా తీసుకునే వ్యక్తులు ‘వట్టి చాదస్తపు పిండం’గా మాత్రమే పరిణితి చెందుతారు. కోపం ఎందుకు వచ్చిందో, అది అంతరంగంలోకి ఏ ‘ప్రతిభ’ బయటపడటానికి సంకేతమో సరిగ్గా అర్ధం చేసుకోగలిగే వ్యక్తులు మాత్రమే, కోపమనే కత్తిని మనిషిని హత్య చేయటానికికాక, ప్రాణాలను పోయడానికి ఉపయోగించుకోగల్గుతారు.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -