న్యూఢిల్లీ :బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. నీట్ పేపర్ లీక్ బాధితులకు న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు. బొద్దింకలు ఒకసారి వస్తే వెళ్లగొట్టడం సాధ్యం కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది విద్యార్థుల విజయమని అన్నారు. తమని తాము బాద్‌షాలుగా భావిస్తున్న వారిని దారిలోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత ఓట్లతోనే వారు నేడు అధికారంలో ఉన్నారన్నారు. ఎవరికీ భయపడా ల్సిన అవసరం లేదని చెప్పారు. పాలకులను అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ప్రజాస్వామ్యం, విద్యార్థులు సాధించిన విజయంగా పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై కొన్ని వారాలుగా కొనసాగిన నిరసనల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా విద్యార్థులు ఒత్తిడి తెచ్చారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సామూహిక సంకల్పానికి లభించిన విజయమని ఆయన అభివర్ణించారు. నిరంతర శాంతియుత నిరసనలు మార్పును తీసుకురాగలవని చెప్పడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక నిదర్శనమని అభిజీత్ దిప్కే తెలిపారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మీరు భయపడకపోతే, ఈ ప్రభుత్వం తలొగ్గకపోతే, మనం ఎవరితోనైనా రాజీనామా చేయించగలమని చెప్పడానికి ఇది నిదర్శనం’ అని అన్నారు. అలాగే నీట్ పేపర్ లీక్ వివాదం తరువాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పేర్లను దీప్కే గుర్తు చేసుకున్నారు. వారి స్మృతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని నిరసనకారులను కోరారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిరసన ప్రాంగణంలో విద్యార్థుల సంబరాలు హోరెత్తాయి.



