Sunday, July 26, 2026
E-PAPER
Homeసోపతిపీక్కు తినే దెయ్యాలు

పీక్కు తినే దెయ్యాలు

- Advertisement -

జుట్టుపోలుగాడు : జాం జటక్‌… ఎహె. నేను పోలీసు దెయ్యాన్ని.
కేతిగాడు : బూం భటక్‌.. నేను మీడియా దెయ్యాన్ని.
బంగారక్క : ఓయ్ దెయ్యాలు… మీరిద్దరూ ఇటు రండి. దెయ్యాలంటే తెలుసు కదా మనసూ, మనస్సాక్షి లేనోళ్లని అర్థం. ఎందుకంటే మీరు ప్రభువును మించిన ప్రభు భక్తులు కదా…
జుట్టుపోలుగాడు : అవునవును. ముందుగా నే చెప్తా నోచ్‌. టట్టడోరు.. అది 2026 జులై 20వ తేది. మన దేశ చరిత్రలోనే ఓ గొప్ప చారిత్రక దినం. రాజధాని ఢిల్లీ నగరం రణరంగంగా మారిన దినం. అన్నింటికీ మించి మన ప్రజాస్వామ్యాన్ని పీక్కుతిన్న దినం. చీకటి దినం హా… హా… హా… ఈ కితాబులు – మతలబులు ఎవరి చలవ వల్ల వచ్చాయంటే మా దెయ్యాల వల్లే. ఎవరూ ఊహించలేని విధంగా మేం ఎన్నెన్నో ప్లానులు వేశాం. మాకు ముందే తెలిసిపోయింది. ఏ రాజకీయ పార్టీ పిలుపు ఇవ్వకపోయినా, మనీ, మందు, బిరియానీ పొట్లాలు పంచకపోయినా, ఉచిత ప్రయాణ సౌకర్యాలు అందించకపోయినా యువత తమంతట తామే స్వచ్ఛందంగా, తండోప తండాలుగా అదీ వేల లక్షల సంఖ్యల్లో వస్తున్నట్టు ఉప్పందింది. బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో సొంత చార్జీలు పెట్టుకుని, కాలినగకన, మోటార్‌ సైకిళ్లపై, కార్లల్లో, సొంత వాహనాల్లో ఎవరికి వారు అలా చేరుకోవడం ఎంత విడ్డూరం? మేమేం తక్కువ తిన్నామా..? మా ఏర్పాట్లు మేం పగడ్బందీగా చేశాం. ఎక్కడికక్కడ గేట్లు పెట్టేసి ఢిల్లీ నగరాన్ని అష్టదిగ్భందం చేశాం. ఎప్పుడూ లేని విధంగా పార్లమెంటు గేట్లకు తాళాలు వేశాం. సైన్యాన్ని మోహరించాం. మెట్రో స్టేషన్‌లు మూతేశాం. బయటోడు లోపలికి, లోపలోడు బయటకు పోకుండా ఉక్కిరిబిక్కిరి చేశాం. ఒకటే ఉక్కపోత. అంతలోనే కుండపోత వర్షం. ముందురాత్రే లారీలతో, టిప్పర్‌లతో రాళ్ల గుట్టలు పోశాం. కొత్త కొత్త పోలీసు దళాలను మఫ్టీలో దించాం. లాఠీలు, తుపాకులతో మార్చ్‌ చేశాం. ఘడియ ఘడియకు సైరన్లు మోగిస్తూ వ్యానులు తిప్పాం. పిల్లలను ఎంత భయపెట్టాలో అంతా చేశాం. అయినా భయపడక పుట్టపగిలిన చీమల్లా పిల్లలు ఎక్కడిక్కడ పుట్టుకురావడం మమ్మల్ని కలవరపరిచింది. ఛలో పార్లమెంట్‌ ర్యాలీ మొదలయ్యాక చూడాలి నా సామిరంగా.. ఒకటికాదు. రాళ్లు రువ్వడం, మేకులు గుచ్చిన లాఠీలతో బాదడం, రసాయన వాటర్‌ క్యాన్‌లతో కొట్టడం, ఎక్స్‌పైరయిన పొగబాంబు షెల్స్‌ పేల్చడం… ఇలా ఒకదానితో ఒకటి పోటీగా జరిగిపోయాయి. మా దెయ్యాల స్వైరవిహారం తడాఖా అప్పుడు చూడాలి. లాఠీలు కాళ్లమీద, ఈపులు మీదే కాదు, కావాలని తలలు బద్దలు కొట్టాయి. పదిహేనేళ్ల పాప ఏడుస్తూ.. ‘మీకు మాలాంటి పిల్లలుంటారు కదా. వాళ్లని ఇలానే చావమోదుతారా.. ‘ అంటే మాకేం కనికరమా పాడా..? వందమందికి పైగా ఆస్పత్రుల్లో ఉన్నారంటేనే మా పెతాపం ఎలాంటిదో చూస్కో. అక్కో చూస్కో.

కేతిగాడు : ఉండెహె. నే చెప్తాను. సోనమ్‌ వాంగ్‌చుక్‌ చైనా ఏజంటని, నీట్‌ పేపర్‌ లీక్‌ అంతా చైనా కుట్రని కుతుబ్‌మీనార్‌ ఎక్కి కోడై కూశా. అభిజిత్‌ దూప్కే, అమెరికా సి.ఐ.ఎ. ఏజెంట్‌ అని అరచి గీపెట్టా. ఏ యే దేశం వాడు ఎంతెంత ఫండ్‌ ఇస్తుంటే మీరిక్కడ ఉద్యమాలు చేస్తుండ్రు? అని గుచ్చి గుచ్చి అడిగినా. ఇనకపోతే మీద ఇంకు చల్లినా… అసలీ పోరగాళ్లంతా ఉగ్రవాదులు, బి.టీమ్‌ అని విద్యామంత్రే చెప్పాడుగా. ఇంకేముంది? అదే 20వ తేదీ నెట్‌ బంద్‌ పెట్టాం. సమాచారం స్ప్రెడ్‌ కాకుండా. అయినా ఈ జెన్‌.జి పోరగాళ్లు తమ సెల్స్‌తో ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీసి పారేస్తున్నారు. మా ఫేక్‌ వీడియోలు కంటే ఆ రియల్‌ వీడియోలే పాస్ట్‌ అయిపోతుంటే మేం దెబ్బైపోతునాం. ఆ… పలికాడయ్యో పలికాడు. మా ప్రధాని పలికాడు. వినండహో.. ‘పేపర్‌ లీక్‌ ఘోర పాపం. ఇలాంటివి మళ్లీ జరగొద్దు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటా. యువత భవిష్తత్తుతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు.’
బంగారక్క : దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే కదా… పేపర్‌ లీక్‌కి కారణమైన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థి కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని, విద్యా విధానంపై సమగ్ర చర్యలు జరపాలని డిమాండ్‌ చేస్తూ నెల రోజులకు పైగా నిరసనలు, జంతర్‌ మంతర్‌ వద్ద వాంగ్‌ చుక్‌ ఆమరణ దీక్ష చేస్తూ, జులై 20న ఛలో పార్లమెంట్‌ నిర్వహిస్తే, వాటిని భగం చేయడానికి చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు సుద్దులు చెప్తే ఎలా..? మాకు న్యాయం చేసి మా భవిష్యత్తును బాగుచేయండి అని శాంతియుత సత్యాగ్రహ పద్ధతుల్లో పిల్లలు ఉద్యమం చేస్తే… ఇంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ప్రజలను కాదు ప్రజాస్వామ్యాన్ని పీక్కుతినే దెయ్యాలున్న దేశంలో మనం వున్నాం. పారాహుషార్‌!

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -