Sunday, June 21, 2026
E-PAPER
Homeసోపతినారాయణ శ్రీధర బింద్రే తలచిన ఆధునికత ఏమిటి?

నారాయణ శ్రీధర బింద్రే తలచిన ఆధునికత ఏమిటి?

- Advertisement -

1920 దాటి 1930 వస్తు వస్తూ స్వదేశీ విప్లవం బ్రిటీష్‌వారికి విరుద్ధంగా జోరునందుకుంది. బ్రిటీష్‌ వారి కళా పద్ధతులను పూర్తిగా పక్కకు పెట్టి, మన కళా పద్ధతులు మాత్రమే ముందుకు తెద్దామని కొందరంటే, మరికొందరు కళాకారులు మన భారతీయ ఆధ్యాత్మికత, జీవన సంస్కృతి విషయాలను చిత్రిస్తూ, పాశ్చాత్యుల టెక్నిక్‌ వాడవచ్చు అంటూ సామాజిక రాజకీయ పరిస్థితుల ప్రకారం వారి వారి దృశ్యకళలను, వారి సందేశాలుగా ముందు పెట్టారు. ఇలాంటి విప్లవ వాతావరణంలో అవన్నీ ఏమీ పట్టించుకోక కళను కళల కోసమే చిత్రించాలని తన ప్రయాణం మొదలెట్టాడు కళాతపస్వి నారాయణ శ్రీధర బింద్రే.

ఎన్‌.ఎస్‌.బింద్రేగా పేరుగాంచిన ఈయన 1910లో ఇండోర్‌లో జన్మించాడు. చిన్నతనం నుండే చిత్రం గీసి ఆనందించేవాడు. అక్కడ హోల్కర్‌ కళాశాల నుండే 1934లో డిప్లొమా పొందాడు. ఇది బొంబాయి జె.జె.కళాశాల శాఖగా ఆ రోజుల్లో ఇండోర్‌లో స్థాపించబడింది. ఆ కళాశాల అధ్యాపకుడు డియోలాలీకర్‌ ముంబాయి జె.జె.కళాశాలలో చదువుకుని వచ్చి ఇక్కడ చిత్రం నేర్పే అధ్యాపకుడిగా చేరాడు. ఆయన ప్రకృతి దృశ్యాలు చాలా చక్కగా చిత్రించేవారు. బింద్రే వేసే చిత్రాలు చూసి అతని రంగుల మేళవింపులకు, ఆయనే ఆశ్చర్యపడి, బింద్రే చక్కటి రంగులు సృష్టించే చిత్రకారుడౌతాడని మురిసిపోయాడు. బింద్రేకి చక్కటి రంగుల అవగాహన వుండేది. ప్రకృతిని, ఏదైనా వస్తువులను చూస్తే మనకు కనిపించే రంగుల మేళవాన్ని చక్కగా అర్థం చేసుకునేవాడు. ఎర్రటి పూవును, ఏ పచ్చ ఆకునో చిత్రించాలంటే నేరుగా ఆ రంగు వేసేవాడు కాదు. కనిపిస్తున్న ఆ రంగుకి చుట్టుపక్కల వస్తువుల ప్రభావం కూడా గమనించుకుని, మరేదో రంగుతో మొదటి రంగు వేస్తూ, ఆపై మరో రంగు గీస్తూ ఆ వస్తువు అసలు రంగు చూపించేవాడు. రంగుల కలయికల మాయాజాలంలా అందమైన రంగుల హరివిల్లులు వెలుపలికి వచ్చేవి బింద్రే కుంచె నుండి. యూరోపియన్‌ చిత్రకారులు ఇంప్రెషనిజం అనే పద్ధతిన వస్తువులపై వెలుతురు పడ్డప్పుడు ఆ రంగుల ప్రభావం, అలాగే వర్షపు చినుకులు పడ్డప్పుడు రంగుల విశ్లేషణ వస్తువులపై మరో రకంగా వుంటుంది అని అలా చిత్రించేవారు.

అలాంటి ప్రభావం బింద్రే తన చిత్రంలో తీసుకువస్తాడు. అలాగే ఈయన మరిన్ని పాశ్చాత్య పద్ధతులలో తన చిత్రాలు గీశాడు. ఫ్రాన్స్‌ కళాకారుడు పికాసో వస్తువులను, రూపాలను త్రికోణాలు, వర్తులాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలుగా విభజించి చూసి చిత్రించాడు. దానిని క్యూబిజం అన్నాడు. ఆ పద్ధతిలో విశ్లేషించినా తను ముదురు రంగులలో రంగుల ప్రధానంగా చిత్రించాడు బింద్రే. క్యూబిజంలో లేత రంగులు దిద్దుతారు. మరో ఫ్రాన్స్‌ కళాకారుడు సురా, చుక్కలు పెడుతూ చిత్రం పూర్తిచేస్తాడు. ఒక రంగు చుక్కల పక్కన, పైన వేరే రంగు చుక్కలు పెడితే ఆ రంగుల ప్రదర్శన వేరుగా దర్శనమిస్తుంది. ఆ పద్ధతిలో కూడా బింద్రే చిత్రం గీశాడు. బింద్రేకి కొత్త ప్రదేశాలు తిరిగి చూడడం, అక్కడి ప్రకృతి దృశ్యాలు చిత్రించడం చాలా ఆనందం. ఆయన ఆనందానికి తోడన్నట్టు 1936లో టూరిజం శాఖవారు కశ్మీరు వెళ్లి అక్కడి చిత్రాలు గీయమని మూడు సంవత్సరాలు పని ఇచ్చారు. ఈ పని మరింత మెరుగులు దిద్దింది ఆయన చిత్రకళ నైపుణ్యానికి. ఎదురుగా చూసిన ప్రకృతినీ, దృశ్యాలనూ అతి త్వరగా స్కెచ్‌గా వేసుకోవటం అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ కొండ ప్రాంతాల్లో వెలుతురు గతులు త్వరగా మారుతాయి. కావాలనుకున్న వెలుతురులో స్కెచ్‌ గీసుకుని, ఆ తరువాత విరామంగా చిత్రంగా మార్చుకునేవాడు. అక్కడ వుండగా మరో స్పురణ కలిగింది. ఆనాటి ఆధునిక కళల మీద సమాజంలో అవగాహన తక్కువుందని, అతి తక్కువ ధరకే అక్కడే నీటిరంగుల తన చిత్రాలు అమ్మేసేవాడు.

బింద్రే దృష్టి ఎప్పుడూ కళల భావ ప్రకటన, దేశ విదేశాలలో జరిగే సిద్ధాంతాల మీద వుండేది. అందమైన వస్తువులుగా అన్నింటినీ చూపటం మటుకే కాదు, మానవ సమాజంలో కష్టసుఖాలనూ చూపాలనేది ఆయనకున్న ఒక ఆలోచన. బింద్రే పల్లెజీవనం, కష్టసుఖాలూ చిత్రించేవాడు. అందమైన గీతల, రంగుల మధ్య ముల్లు గుచ్చుకున్న అమ్మాయి బాధా చూపించగలిగాడు. అలాగే ఆయన చిత్రాలు వేయ మొదలెట్టిన సమయాన స్వతంత్ర పోరాటాలు ముమ్మరంగా సాగుతున్నా, కళాకారులూ తమవంతు తమ చిత్రాల ద్వారా తమ స్వదేశీ భావనను భారతీయ సామాజిక సంస్కృతి ద్వారా ప్రదర్శించదలిచినా, బింద్రే మటుకు ఒక కళాతపస్విలా చిత్రాలపై ధ్యాసతో ఆనందం పంచి ఇచ్చాడు. స్వదేశీ పోరాటం స్పృహ ఆధునికత అని మిగిలిన కళాకారులు నమ్మితే ఈయన మటుకు కళను కళల కోసమే ఆనందించటం తన ఆధునికత అన్నాడు. అలాగే బింద్రే మన భారతీయ పద్ధతి గౌష్‌ అనే రంగుల పద్ధతిలోనూ చిత్రాలు వేశాడు. ఆయన చిత్రాలు మన సామాజిక, సంస్కృతిక జీవన విధానాలు, పల్లెల జీవితాలు చిత్రాలుగా వేసేవాడు. 1927లో ఇండోర్‌ కళాశాలలో ఈయన చేరే నాటికి, ఆ సమయాన పొడి రంగులను నీటిలో తడిపి, కొంత జిగురు కలిపి ఆ మిశ్రమం చిత్రాల్లా గీసేవారు. ఆనాడు ఇన్ని రంగుల ట్యూబులు దొరికేవి కాదు. ఆనాటి పద్ధతిలో ఒక ఒత్తైన రంగుల పూతలు వచ్చేవి. బింద్రే తనంతట తానుగా పలుచటి రంగుల పట్టీలు నియమించుకుని రంగుల మేళవింపు చిత్రాలు గీశాడు.

1947-48లలో అమెరికా వెళ్లి అక్కడి కళా పద్ధతులూ, సిద్ధాంతాలూ అవగాహన చేసుకుని తన చిత్రంలో తెచ్చాడు. బరోడా ఫైన్‌ ఆర్ట్స్‌ ఫాకల్టీకి 1950లో అధ్యాపకుడిగా వచ్చి తన ప్రయోగాత్మక చిత్రాలు విద్యార్థులకు నేర్పాడు. 1966 వరకూ ఆయన ఆ కళాసంస్థను తన మార్గదర్శంలో నడిపించాడు. ఆదర్శ అధ్యాపకుడయ్యాడు. ఈనాటికీ ఆయన విద్యార్థులు అతి ప్రేమగా ఆయనని గుర్తు చేసుకుంటారు. ఆయన విద్యార్థులు ఎంతోమంది అంతర్జాతీయ కళాకారులయ్యారు. బింద్రేకి అతిథి కళాకారుడిగా శాంతినికేతన్‌ కళాభవన్‌కి వెళ్లగలిగే అవకాశం దొరికింది 1945లో. కొత్త ప్రదేశాలు, కొత్త కళాశాల, ఎంతోమంది కళాకారులను కలవాలనే ఉత్సాహంతో ఎంతో ఆనందంగా బయలుదేరాడు. తను వెళ్తున్న రైలులోనే వార్ధా నుండి గాంధీజీ బయలుదేరి నోవాఖలి వెళ్తున్నారు అక్కడి జాతి, మత విప్లవ మంటలను ఆర్పటానికి. ఎంతో దగ్గరగా ఆ రోజు గాంధీజీ దర్శనమైంది బింద్రేకి. శాంతినికేతన్‌ చేరి అక్కడి కళాకారులూ, అధ్యక్షుడు నందలాల్‌ బోస్‌ని కలుసుకున్నాడు. అందరితో కళావిషయాలు పంచుకోవాలని ఎదురు చూశాడు. నందలాల్‌ బోస్‌ దేశీయ కళాపద్ధతి, కళా విషయాలు తప్ప ఏదీ మెచ్చడు. తను ఏనాడూ తైలవర్ణ చిత్రాలు వేయలేదు. విద్యార్థులనూ వేయనీయలేదు. బింద్రేకి కళల మీదే ధ్యాస.

భావ ప్రకటన కోసం, గొప్ప చిత్రం వేయడం కోసం పూర్వ పాశ్చాత్య పద్ధతులను అరమరికలు లేక తన చిత్రంలోకి తెచ్చాడు. నందలాల్‌ బోస్‌కి అది అంగీకారం కాదు. తన కోటలో పాశ్చాత్య ఆలోచనల వ్యక్తి వుండటం ఇష్టం లేక, శాంతినికేతన్‌ నుండి వెళ్లిపొమ్మని కబురు పెట్టాడు. బింద్రే బరువైన మనసుతో మధ్యలోనే అక్కడి నుండి వెళ్లిపోవలసి వచ్చింది. 1934లో బింద్రేకి బొంబాయి ఆర్ట్‌ సొసైటీ నుండి రజత పతకమూ, 1941లో బంగారు పతకమూ బహుమతులుగా అందాయి. ఆపై ఒక సంవత్సరం మద్రాసు సినిమా ఇండిస్టీలో ఆర్ట్‌ దర్శకుడిగా పనిచేశాడు. 1969లో భారత ప్రభుత్వం పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్‌తోనూ సన్మానించింది. 1986 – 87లో ఆయనకు కాళిదాసు సన్మాన గౌరవం అందినప్పుడు తన కళలు, తన దృష్టి గురించి రాస్తూ, ఒక అందమైన దృశ్యాన్ని మన మనసు అనుభవించినప్పుడు, ఆ అనుభవమే చక్కటి రూపం దాల్చి చిత్రంగా వెలువడుతుంది. తను అనుభవించే విషయాలను ఒక దృశ్య నమూనాలా చిత్రిస్తానన్నాడు. కొన్నిసార్లు వెంటనే వెలువడవచ్చు, కొన్నిసార్లు ఆ భావం మనసులో నిలిచిపోయి తరువాత వెలువడవచ్చు.

ఈ సృష్టి తనకొక గ్రంథాలయం అని చెప్పాడు. బింద్రే శిష్యుడు ప్రొ||రతన్‌ పరిమూ, కళాచరిత్రకుడు రాసిన మాటల ప్రకారం, బింద్రేకి ఒక అకస్మాత్‌ భావం, ప్రమాదం సూచించే చిత్రాలు, వ్యంగ్యాలు, ఏహ్యం, రాజకీయ చిత్రాలు ఆయన ఇష్టపడలేదు. దర్శకులకు అకస్మాత్‌ తడబాటు, భయం కలిగించలేదు. బింద్రే ఒక శ్రేయోభిలాషియై విద్యార్థుల మంచీచెడులు ఆలోచించి మార్గం చూపాడు. భయమూ, భక్తి, ప్రేమ అన్నీ కలిపి అందించాడు విద్యార్థులకు. 1966లో బరోడా వదిలినా తన చిత్రకళ అభ్యాసం వదలలేదు. ఏ విషయంలోనైనా ఉన్న ప్రేమ, అందం తీసి చిత్రించి, కళ కోసం తన కళలు అని అదే తన ఆధునికత అనుకున్నాడు. 1992లో బొంబాయిలో కన్నుమూశాడు.

డా||యం.బాలామణి, 8106713356

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -