అది 1951… భారతదేశానికి స్వాతంత్య్రం లభించి నాలుగేళ్లు మాత్రమే గడిచింది. దేశం పునర్నిర్మాణంలో నిమగమై ఉన్న ఆ సమయంలోనే, హైదరాబాద్ నగరం మూ సీ నది దక్షిణ తీరం వద్ద ఒక చారిత్రాత్మక ఉద్యమం జరిగింది. అదే సాలార్ జంగ్ మ్యూజియం స్థాపన. తెలంగాణ రాష్ట్ర గర్వించదగిన ఈ సంస్థ కేవలం ఒక మ్యూజియం మాత్రమే కాదు, ఒక కలల సాకారం. ఒక వ్యక్తి అమితమైన కళాప్రేమకు, అనన్యమైన సేకరణకు, ఒక కుటుంబం చేసిన గొప్ప త్యాగానికి ప్రతీక.
ప్రపంచంలోని వివిధ దేశాల నుండి సేకరించిన అరుదైన కళాఖండాలు, పురావస్తువులు, అమూ ల్యమైన గ్రంథాలు, హస్తప్రతులతో నిండిన ఈ మ్యూజియం నేటికీ విస్మయపరుస్తోంది. ఒక చోట కూర్చుని, ప్రపంచ సంచారం చేయాలంటే ఇక్కడే సాధ్యం. ఇటాలియన్ మార్బుల్ శిల్పాలు, ఫ్రెంచ్ చిత్రలేఖనాలు, జపనీస్ వెదురు కళ, భారతీయ మినియేచర్ పెయింటింగ్స్.. ఇలా ప్రతీ మూ లలో ఒకఖండం దాగి ఉంది.
దక్కన్ సింహాసనానికి అలంకారం
ఈ అద్భుత సష్టికి మూ లకారకులు సాలార్ జంగ్ కుటుంబం. నిజాం పాలనను అలంకరించిన ఈ కుటుంబంలో ఐదుగురు సభ్యులు ప్రధాన మంత్రులు (దివాన్లు)గా పనిచేశారు. వారి ప్రతిభ, నిజాయితీ, దూరదష్టి నేటికీ చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ కుటుంబంలోనే ప్రత్యేకించి చెప్పుకోదగ్గ పేరు ‘నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్’ ప్రసిద్ధిగా ‘సాలార్జంగ్. ఆయన 1912లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేత ప్రధాన మంత్రిగా నియమితులైనారు. అంతటి ఉన్నత పదవిలో ఉన్నా, ఆయనకు నిజమైన సంతప్తి కళలలోనే ఉండేది. 1914 నవంబరులో కేవలం ఆరోగ్య కారణాలు చూపుతూ.. కళల పట్ల తనకున్న అనురక్తితో ప్రధాన మంత్రి పదవి రాజీనామా చేశారు. తదనంతరం తన సర్వస్వాన్నీ, జీవితాన్ని కళా సేకరణకు అంకితం చేశారు.
కళల కలయిక మహాకుంభమేళా
సాలార్ జంగ్ నివాసమైన ‘దివాన్ దేవిడి’ ఒకప్పుడు ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక కళాకేంద్రంగా మారింది. ఆ ప్రాంగణం ఎల్లప్పుడూ ప్రపంచ నలుమూ లల నుండి వచ్చే పురావస్తు వ్యాపారులు, కళావస్తు విక్రేతలు, చరిత్రకారులతో నిండిపోయేది. వారందరికీ ఆ దేవిడి ఒక తీర్థయాత్రగా మారింది. ఆయన యూరప్, మధ్యప్రాచ్య దేశాలు పర్యటించినప్పుడల్లా, ఎంతో విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు. విదేశాలలో ఆయనకు ప్రత్యేక ప్రతినిధులు ఉండేవారు. వారు ప్రముఖ పురావస్తు వ్యాపారుల జాబితాలు, కేటలాగ్లు పంపించేవారు. అలా ఎంతో పట్టుదలతో, శ్రద్ధతో ఎన్నో అరుదైన కళాఖండాలు ఈ దేవిడికి చేరాయి. కేవలం సేకరణకర్త మాత్రమే కాదు, గొప్ప సాహిత్యాభిమాని కూడా. కవులను, రచయితలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన సాటిలేనివారు. కుటుంబ చరిత్రకు సంబంధించిన ఎన్నో గ్రంథాల ప్రచురణకు సహకరించారు.
దేశానికే బహూకరించిన అపార సంపద
1949 మార్చి 2న… ఆ మహామనిషి చిరునిద్రలోకి జారుకున్నాడు. ఆయనకు ప్రత్యక్ష వారసుడు లేడు. ఇక ఈ అపూర్వ సేకరణ సంగతేంటి? ఇది విక్రయించబడుతుందా? విదేశాలకు తరలించబడుతుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ సాలార్ జంగ్ కుటుంబం అపూర్వమైన ఉదారత చూపించింది. ఆ సంపదను, ఆ వారసత్వాన్ని దేశానికే బహూకరించాలని నిర్ణయించుకుంది. ఆ త్యాగం వల్లనే ఈనాడు మనమందరం ఆ అరుదైన కళను దర్శించుకోగలుగుతున్నాం. 1951 డిసెంబరు 16… భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా విచ్చేసి, దివాన్ దేవిడిలోనే ఏర్పాటు చేసిన ఆ మ్యూజియాను ప్రజలకు తెరిచారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యుల సమ్మతితో మ్యూజిరును స్వాధీనం చేసుకుని నిర్వహణ బాధ్యతలు చేపట్టింది.
జాతీయ ప్రాముఖ్యత
1961లో అంటే మ్యూజియం ప్రారంభించిన పదేండ్లకు, భారత పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టం ద్వారా సాలార్ జంగ్ మ్యూజియం, దాని గ్రంథాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ప్రకటించింది. ఆ చట్టం వల్లనే ఈ సంస్థను ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం సంరక్షించడం మొదలుపెట్టింది. 1968లో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ చేతులమీదుగా ప్రస్తుత భవనం ప్రారంభించబడింది. ఆ భవనం నిర్మాణం కూడా ఒక కళాఖండం. సుందరమైన తోటలు, ప్రశాంతమైన మూసీ నది నేపథ్యం, లోపల అనేక గ్యాలరీలు. ఈ మ్యూజియం పాలక మండలికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధ్యక్షుడిగా వ్యవహరించడం ఎంత గౌరవకరమైన విషయం.
సాలార్ జంగ్-1 : ప్రారంభకుడు, వీల్డ్ రెబెక్కా
మనం ఇప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్దాం. ఈ సేకరణకు పునాది వేసిన వ్యక్తి సాలార్ జంగ్–× (నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్). కేవలం 13 ఏండ్ల వయసులోనే ‘సాలార్ జంగ్’ బిరుదు పొందారు. 24 ఏండ్ల యువకుడిగా నాల్గవ నిజాం ప్రధాన మంత్రి పదవి నిర్వహించారు. ఆయన గొప్ప సంస్కరణవాది, పరిపాలకుడు. 1876లో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా తన చిత్రపటంతో కూడిన ప్రత్యేక సిరామిక్ వస్తువులను తయారు చేయించారు. అది అప్పటి ఆయన ప్రజాదరణకు చిహ్నం. కానీ ఆయనని ప్రపంచ ప్రసిద్ధుడిని చేసింది ‘వీల్డ్ రెబెక్కా'(Veiled Rebecca)అనే అద్భుత శిల్పాన్ని భారతదేశానికి తీసుకురావడం. ఇటాలియన్ శిల్పి జియోవన్నీ బాట్జిస్టా లొంబార్డీ చేసిన ఈ మార్బుల్ విగ్రహం… ఒక స్త్రీ ముఖంపై పారదర్శకమైన ముసుగు ఎలా ఉంటుందో, అదే భావనను రాతిపై సష్టించారు. ఆ ముసుగు నుండి ముఖలక్షణాలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయంటే, ప్రతి సందర్శకుడు నివ్వెరపోతాడు. ఈ రోజు ఆ శిల్పం సాలార్ జంగ్ మ్యూజియంలోనే ప్రధాన ఆకర్షణ.
సాలార్ జంగ్-ల-2 : అకాల మరణం కానీ చిరస్మరణీయ సంస్కరణలు
తండ్రి అడుగుజాడల్లో ‘సాలార్ జంగ్-×× (నవాబ్ మీర్ లాయక్ అలీ ఖాన్)’ 1884లో ఆరవ నిజాం వద్ద ప్రధాన మంత్రి అయ్యారు. కేవలం 26 ఏండ్ల వయస్సలోనే ఆయన మరణించడం. తండ్రి సామాజిక సంస్కరణలను కొనసాగించినా తన కుమారుడు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ జన్మించిన 24 రోజులకే ఆయన మరణించాడు.
సాలార్ జంగ్-3 : వారసుడు, కళాప్రేమికుడు
పదేండ్ల బాలుడు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ వారసత్వంగా సాలార్ జంగ్ బిరుదు, అపార సంపద పొందారు. సుమారు 450 గ్రామాలు, 1480 చదరపు మైళ్ళ భూభాగం, ఏడాదికి రూ.23 లక్షల ఆదాయం! కానీ ఆ ధనం ఆయన దుర్వినియోగం చేయలేదు. ప్రపంచ కళా సేకరణనే జీవిత లక్ష్యంగా స్వీకరించారు. 1914లో ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన, పూర్తిగా కళల సేకరణకే నిమగమయ్యారు. అదే సష్టే నేడు మనం చూస్తున్న సాలార్ జంగ్ మ్యూజియం.
జ్ఞానానికి చిహ్నం
మ్యూజియం మాదిరిగానే దాని గ్రంథాలయం కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. 1961లో పార్లమెంట్ చట్టం ద్వారా ఇది కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ భద్రపరచబడిన హస్తప్రతులు ప్రపంచంలోనే అత్యంత విలువైన వాటిలో కొన్ని. బంగారు అలంకరణలు, అద్భుత కాలిగ్రఫీ, లాపిస్ లాజులీ నీలం, ముత్యపు తెలుపు, ఎరుపు, పచ్చ వర్ణాలతో చేసిన అలంకరణలు కన్నుల పండుగగా ఉంటాయి. కాలిగ్రాఫర్లు, చిత్రకారులు, పుస్తక బైండర్లు… వీరందరి సామూహిక ప్రయత్నం ఈ గ్రంథాలు. కొన్ని హస్తప్రతులు 1656 ఏండ్ల నాటివి. గ్రంథాలయంలో మొత్తం 62,772 పుస్తకాలు ఉన్నాయి. ఆంగ్ల విభాగంలో 40,000 పుస్తకాలు చరిత్ర, తత్వశాస్త్రం, సాహిత్యం, జీవశాస్త్రం, ఇంజినీరింగ్, జీవిత చరిత్రలపై ఉన్నాయి. బ్రిటన్ రాణి విక్టోరియా స్వయంగా సాలార్ జంగ్-× కి బహూకరించిన Leaves from the Journal of Our Life in the Highlands అనే గ్రంథం ఉంది. సుమారు 19,000 పుస్తకాలు ఉన్న ఓరియంటల్ విభాగంలో ఉర్దూ, అరబిక్, పర్షియన్, టర్కిష్ భాషలలో గ్రంథాలున్నాయి. ఇస్లామిక్ అధ్యయనాలు, చరిత్ర, సాహిత్యం, వైద్యం.. ప్రత్యేకించి దక్కన్ చరిత్రకు సంబంధించిన అరుదైన గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. దక్కన్ సుల్తానులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీల చరిత్రను అధ్యయనం చేయాలనుకునే పరిశోధకులకు ఇదొక స్వర్ణ ఖని. ఇవి కేవలం పుస్తకాలు మాత్రమే కావు.
చరిత్రకు సజీవ సాక్ష్యాలు. కాగితం, తాళపత్రం, వస్త్రం, గాజు, కలప, రాతి పలకలు, పార్చ్‌మెంట్ (చర్మం) వంటి వివిధ మాధ్యమాలలో రాశారు. అరబిక్, పర్షియన్, ఉర్దూ, టర్కిష్, దఖ్నీ, పుష్టూ, హిందీ, సంస్కతం, తెలుగు, ఒరియా వంటి ఎన్నో భాషల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వైద్యం, గణితం, ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, వ్యవసాయం, చరిత్ర, సంగీతం, తత్వశాస్త్రం, రాజకీయాలు, న్యాయశాస్త్రం, సూఫీ తత్వం, మత అధ్యయనాలు, విలువిద్య, మంత్రశాస్త్రం (పురాతన వైద్య/ రసాయన ప్రక్రియలు) వంటి 84 కంటే ఎక్కువ అంశాలున్నాయి. ప్రపంచంలో కేవలం రెండు సూక్ష్మ ఖురాన్ ప్రతులు ఉన్నాయట. ఒకటి ఇరాన్లో, రెండవది మన సాలార్ జంగ్ వ¶్యజియంలో! దీని పరిమాణం కేవలం ‘2.4 సెంటీమీటర్లు’. అంటే అరచేతిలో దాచుకోదగినంత చిన్నది. కానీ అందులోని అక్షరాలు అతి సూక్ష్మంగా, స్పష్టంగా ఉంటాయి. దీన్ని చదవడానికి భూతద్దం కావాలి. మరోవైపు, 60 ఐ 30 సెంటీమీటర్ల పరిమాణం కలిగిన భారీ ఖురాన్ ప్రతి కూడా ఇక్కడుంది.
మూలాలను వెలుగులోకి
సాలార్ జంగ్ మ్యూజియం ఇప్పటివరకు హస్తప్రతులపై 19 వివరణాత్మక కేటలాగ్లను ప్రచురించింది. ప్రతి హస్తప్రతిలోని రచయితలు, కాల నిర్ధారణ, చిత్రాలు, ముద్రలు, స్వహస్త సంతకాలు వంటి వివరాలను ఆ కేటలాగ్లలో పొందుపరిచారు. ఇది ఎంతో శ్రమతో కూడిన పని, కానీ చేస్తూనే ఉన్నారు. ఇంకా 30 ఫోలియోలతో కూడిన అరుదైన ఖురాన్ ప్రతిని కూడా ప్రచురించారు. అందులో ప్రతి పంక్తి అరబిక్ అక్షరమాల తొలి అక్షరం ‘అలిఫ్’తో ప్రారంభమవుతుంది. ఇది అలంకారికంగా, కాలిగ్రఫీ దష్ట్యా చాలా ప్రత్యేకం. మ్యూజియం పార్చ్‌మెంట్ (చర్మంపై రాసిన) హస్తప్రతులపై పరిశోధనలు చేపడుతోంది. అవి చాలా పురాతనమైనవి, భద్రపరచడం కష్టం. అలాంటి వాటి పరిరక్షణకు కూడా మ్యూజియం కషి చేస్తోంది.
– డా|| రవికుమార్ చేగొని, 9866928327



