జ్ఞాపకశక్తి మందగించటం, ఆలోచనా సామర్ధ్యం తగ్గటం, మాటలను – భాషను మర్చిపోవటం, ప్రవర్తనలో మార్పులు రావటం… వంటి లక్షణాలు మీలో కనిపిస్తున్నట్టయితే మీరు వెంటనే అనుభవజ్ఞులైన న్యూరాలజిస్ట్ లేదా సైక్రియాటిస్ట్‌ని సంప్రదించవల్సిన అవసరం వుంది. ఇవన్నీ ‘అల్జీమర్స్’ అనే మెదడుకు సంబంధించిన వ్యాధి లక్షణాలు. అల్జీమర్స్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రతి జూన్ నెలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ వ్యాసం సోపతి పాఠకుల కోసం…
ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్, డెమన్షియాతో బాధ పడుతున్న వారి సంఖ్య దాదాపు 55 మిలియన్ల పైగా వుందని నిపుణుల అంచనా. దీనికి నివారణ లేదు. అయితే మందుల వాడటం, కౌన్సిలింగ్ తీసుకోవటం వల్ల వ్యాధి లక్షణాల్ని కొంత వరకు అదుపులో వుంచవచ్చు. దాంతో పాటు వ్యాధి పెరుగుదలని నెమ్మదింప చేయవచ్చు.
అల్జీమర్స్ ఎందుకు వస్తుంది? : అల్జీమర్స్‌ని ‘అల్జ్ – హై – మర్స’ అని కూడా ఉచ్ఛరిస్తారు. ఇది మెదడును ప్రభావితం చేసే ఒక ‘నాడీ క్షీణత’ వ్యాధి. మెదడులో ప్రోటీన్లు అసాధారణంగా పేరుకు పోవటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రత్యేకంగా ‘అమైలాయిడ’, ‘టౌ’ అనే రెండు ప్రొటీన్ల వల్ల ఇది జరుగుతుంది. మెదడులో ఈ రెండు ప్రొటీన్లు పేరుకుపోయినప్పుడు అతి నెమ్మదిగా న్యూరాన్‌లను నాశనం చేస్తాయి. చివరికి మెదడు కణాలు పూర్తిగా చనిపోతాయి. ఈ కణాలు ఎందుకు పేరుకుపోతాయి అన్నదానిపై కచ్చితమైన కారణాలు తెలుసుకోవటం కోసం నిపుణులు అధ్యయనం చేస్తూనే వున్నారు.
నిపుణుల అంచనా : ప్రపంచ వ్యాప్తంగా అల్జీమర్స్, డెమెన్షియాతో బాధ పడుతున్న వారి సంఖ్య దాదాపు యాభై అయిదు మిలియన్ల పైనే వుండవచ్చని నిపుణుల అంచనా. ‘అల్జీమర్స్ అసోసియేషన’ ఆధ్వర్యంలో ‘అల్జీమర్స్ అండ్ బ్రెయిన్ అవేర్నెస్ మంత’ పేరిట ప్రతి ఏటా జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతోంది. దానితో పాటు ఆ వ్యాధితో బాధ పడుతున్న వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అన్నదానిపై కూడా విస్తతమైన అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అల్జీమర్స్‌ను అశ్రద్ధ చేసినట్లయితే వ్యాధి బారిన పడిన వ్యక్తులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవల్సి వుంటుంది. ఈ వ్యాధి ఙ్ష్ఞపకశక్తిని, ఆలోచనా శక్తిని నశింపచేయటమే కాకుండా, సాధారణంగా వారు చేసుకోవల్సిన చిన్న చిన్న సొంత పనులకు కూడా ఇతరులపై ఆధారపడవల్సి వస్తుంది.
ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ : ఈ వ్యాధి బారిన పడేవారిలో చాలా మంది అరవై ఏండ్లు పైబడిన వారే వుంటారు. ఒకసారి ఈ వ్యాధి వచ్చిందంటే ప్రతి ఐదేండ్లకి వ్యాధి తీవ్రత రెట్టింపు అవుతుంది.
అల్జీమర్స్ వారసత్వంగా కూడా సంక్రమించే అవకాశాలు వున్నాయి. తల్లితండ్రులకు, తోబుట్టువులకు అల్జీమర్స్ వ్యాధి వున్నట్టయితే మీకు ఆ వ్వాధి వచ్చే అవకాశం పది నుంచి ముప్ఫై శాతం ఎక్కువగా వుంటుంది. అలాగే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత జబ్బులు, ధూమపానం, శారీరక శ్రమ, సరైన నిద్ర లేకపోవటం, సామాజిక ఒంటరితనం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు కుండా దీనికి దోహదం చేస్తాయి.
లక్షణాలు : స్వల్పకాలిక జ్ఞాపకశక్తి లోపం: ఇటీవల జరిగిన సంఘటనలు, సంభాషణలు మర్చిపోవటం లేదా ఒకే ప్రశ్నను పదే పదే అడగటం. వంట చేయటం, తెలిసిన ప్రదేశానికి వాహనం నడపడం, ఆర్థిక వ్యవహారాలు నిర్వహించటం వంటి రోజు వారీ సాధారణ కార్యకలాపాలను పూర్తి చేయటానికి ఇబ్బంది పడటం. తేదీలు, వారాలు లేదా సమయాన్ని మర్చిపోవటం. తెలిసిన పరిసరాల్లోనే దారి తప్పిపోవడం. నిర్ణయాలు తీసుకోవటంలో, సమస్యన్ని పరిష్కరించటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
భాష, కమ్యూనికేషన్ సమస్యలు: సంభాషణలను అర్థం చేసుకోవటం, అనుసరించటంలో ఇబ్బందులు పడటం. సందర్భానుసారం ఉపయోగించాల్సిన పదాల్ని, వస్తువుల పేర్లని, కుటుంబ సభ్యుల పేర్లని, వారితో తమ రిలేషన్‌ని కూడా మర్చిపోతారు. మానసిక స్థితి, వ్యక్తిత్వ మార్పులు: ఆందోళన పెరగటం, నిరాశ లేదా ఆకస్మికంగా మానసిక స్థితిలో మార్పులు ఏర్పడతాయి. అనుమానపడటం లేదా సామాజిక కార్యకలాపాల నుండి దూరంగా వుండటం చేస్తారు. గందరగోళానికి గురౌతూ ఒకచోట నిలకడగా వుండలేక పోతారు. సాధారణంగా ఈరకమైన ప్రవర్తన సాయంకాలాల్లో ఎక్కువగా వుంటుంది. దీనిని ‘సన్ డైనింగ’ అనికూడా అంటారు. పరిసరాలను గమనించలేక పోవటం వల్ల తరచుగా వస్తువులను ఢ కొడతారు. వస్తువులను సాధారణంగా పెట్టే ప్రదేశాలలో కాకుండా అసాధారణ ప్రదేశాలలో పెట్టడం లేదా దాచటం చేస్తారు. తిరిగి వాటిని కనిపెట్టలేక గందరగోళ పడతారు, ఈ లక్షణాలన్నీ వారిని తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురిచేస్తాయి.
మనం మూడవ స్థానంలో : ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అల్జీమర్స్, డెమెన్షియా కేసుల సంఖ్యలో భారతదేశం.. చైనా, యునైటెడ్ స్టేట్స్ తర్వాత మూడవ స్థానంలో వుంది. భారతదేశంలో జనాభా సంఖ్య, వద్దుల సంఖ్య ఎక్కువగా వుండమే దీనికి కారణం. ప్రస్తుతం మన దేశ జనాభాలో ఎనభై ఎనిమిది లక్షల మంది అల్జీమర్స్ వ్యాధితో జీవిస్తున్నారని, అందులో అధికశాతం గ్రామీణ ప్రాంతాల వారు, స్త్రీలు వున్నారని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక విద్య, ఆరోగ్య సంరక్షణ వనరులకు తగిన ప్రాధాన్యత లేకపోవటం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు మనం గమనించినట్లయితే నేడు చాలా గ్రామాలు నిశ్శబ్దంగా, నిరాసక్తితో వుండటం స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతంలోని యువత వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారు. వద్ధాప్యంలో తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలి పోతున్నారు. మనం ఎదుర్కొనే అనేక మానసిక, శారీరక వ్యాధుల కన్నా తీవ్రమైంది ఒంటరితనం. అదే వారిని అల్జీమర్స్‌కి దగ్గర చేస్తోంది.
స్త్రీలే ఎక్కువ : ఇక మన దేశంలోని స్త్రీలు విషయానికి వచ్చినట్టయితే పురుషులకన్నా స్త్రీల ఆయుర్థాయం ఎక్కువగా వుండటంతో పాటు వారిపై వుండే అనేక ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక నిబంధనలు, కట్టుబాట్లు కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పాలి. వాటి వల్ల స్త్రీల మానసిక వికాసం, ఆలోచనా శక్తి, మేధస్సు, స్వయం నిర్ణయాధికారం చాలా వరకు అరికట్టబడ్డాయి. వారిలో అంతర్గతంగా పేరుకు పోయిన నైరాశ్యం కూడా స్త్రీలని అల్జీమర్స్‌కి గురిచేస్తోంది. కానీ గత దశాబ్దిన్నర కాలంగా స్త్రీల స్థితి గతుల్లో కొంత మార్పు వచ్చిన విషయం మాత్రం వాస్తవం.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. : అల్జీమర్స్ కచ్చితమైన నివారణ లేని వ్యాధి కాబట్టి వీలైనంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవటం ఒక్కటే మార్గం. నలభై – నలభై అయిదేండ్ల వయసు నుంచే మనం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. గుండెకు ఏది మంచిదో మెదడుకు కూడా అదే మంచిదని శాస్త్రవేత్తలు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. రక్తనాళాల ఆరోగ్యం మెదడును నేరుగా ప్రభావితం చేస్తుంది కాబట్టి హదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా తగు రక్షణ చర్యలు తీసుకోవాలి.
రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించాలి.
ధూమపానం, మధ్యపానం వంటి అలవాట్లు వున్నట్టయితే వాటిని పరిమితం చేయాలి. పూర్తిగా మానేయటం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
మనసు, శరీరం రెంటినీ చురుకుగా వుంచుకోవటం చాలా అవసరం. దాని కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
బంధువులు, స్నేహితులతో మంచి బంధాలు ఏర్పరచుకోవటం, సామాజిక బృందాలతో పరిచయాలు పెంచుకోవటం ద్వారా మీలో కొత్త ఉత్సాహం కలుగుతుంది.
అందరితో మనసువిప్పి మాట్లాడటం చాలా అవసరం. దానివల్ల ఒత్తిడికి దూరం అవుతారు.
పుస్తకాలు చదవటం, కొత్త విషయాలపై ఆశక్తి పెంచుకోవటం వల్ల మనలో వున్న నైపుణ్యాల్ని మెరుగుపరచుకో గలుగుతాం. కొత్త నైపుణ్యాల్ని కూడా నేర్చుకో గల సామర్థ్యం పెరుగుతుంది. ఇవన్నీ మెదడుకి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని యిస్తాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది.
నిద్రలేమి కూడా అల్జీమర్స్ వ్యాధి ప్రక్రియని వేగవంతం చేస్తుంది. గాఢమైన, నెమ్మదైన నిద్ర లేకపోతే అమైలాయిడ్, టౌ ప్రొటీన్ల ప్రభావం మెదడుపై మరింత ఎక్కువగా వుంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కనుక ప్రతి రోజు కనీసం ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోవటం చాలా అవసరం. ఒక నిర్దిష్ట సమయంలో నిద్రపోవటం అలవాటు చేసుకుంటే అల్జీమర్స్ వ్యాధి తీవ్రతని కొంతవరకు పోస్ట్‌పోన్ చేయవచ్చు.
ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి. మరీ ముఖ్యంగా తణధాన్యాలు, ఆకుకూరలు, చేపలు, కొవ్వు పదార్థాలకి ప్రాధాన్యం ఇవ్వాలి.
క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు లేదా నడక వంటివి చేయటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగు పడుతుంది.
రోగులలో కలిగే అందోళన, నిరాశ, నిద్రలేమి వంటి సమస్యల్ని తగ్గించుకోవటానికి ప్రత్యేకమైన కౌన్సిలింగ్, మద్దతు తీసుకోవాలి.
ముందుగానే మేల్కొంటే : వ్యాధి లక్షణాలు మొదలయ్యాక హడావుడి పడటం కన్నా ముందుగానే మేల్కొనటం ఎంతో మంచిది. మనందరి శారీరక, మానసిక ఆరోగ్యం మన జీవనశైలి పైనే ఆధారపడి వుంటుంది. సాధారణంగా స్త్రీ – పురుషులు ఇద్దరిలో నలభై ఏండ్లు దాటగానే హార్మోనల్ సమస్యలు మొదలవుతాయి. వాటి వల్ల ఏర్పడే మానసిక, శారీరక సమస్యల్ని ఎదుర్కొన్నట్టయితే వద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, డెమెన్షియా వంటి వ్యాధుల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోగలం. అందుకే నలభై ఏండ్లు దాటినప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాలన్నిటి పైనా విస్తత స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించక పోతే 2036 నాటికి మన దేశంలో అల్జీమర్స్‌తో బాధపడే వారి సంఖ్య సుమారు పదిహేడు మిలియన్లను దాటవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
– గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్ సైకాలజిస్ట్,
ఫ్యామిలీ కౌన్సిలర్



