‘అమ్మా… ఈరోజు స్కూల్‌కి వెళ్లను… నా బెస్ట్ ఫ్రెండ్ రాలేదు!’ అని చెప్పే పిల్లలను మనం తరచూ చూస్తుంటాం. నిజానికి చిన్నతనంలో పిల్లల ప్రపంచంలో అమ్మానాన్నల తర్వాత అత్యంత ముఖ్యమైన స్థానం స్నేహితులదే. సైకాలజీ ప్రకారం యుక్తవయసులో పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు, భావోద్వేగాలు చాలావరకు స్నేహితుల ప్రభావంతో రూపుదిద్దుకుంటాయి. అందుకే స్నేహం పిల్లలకు ఒక బంధం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగ ప్రపంచం.
(అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా)
ఈరోజుల్లో పిల్లలు ఒక సరదా మాట చెబుతుంటారు.. ‘అమ్మకు చెప్పను.. కానీ నా బెస్ట్ ఫ్రెండ్‌కి మాత్రం చెబుతాను!’. ఇది సరదాగా అనిపించినా, ఇందులో ఒక గొప్ప మానసిక సత్యం ఉంది. పిల్లలు తమ సంతోషం, బాధ, భయం, రహస్యాలన్నీ ముందుగా స్నేహితులతోనే పంచుకుంటారు.
కానీ స్నేహం ఎంత గొప్పదో, నమ్మకం విరిగితే అంత ప్రమాదకరమవుతుంది. ఇటీవల జరిగిన ఒక విషాదకర సంఘటనలో దాదాపు పదేండ్లు మంచి స్నేహితులుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలలో, ఒక అమ్మాయి తన స్నేహితురాలు చెప్పిన వ్యక్తిగత రహస్యాన్ని ఇతరులకు చెప్పింది. ఆ అవమానం, నమ్మకం కోల్పోవడం, తోటి వారి మాటలను తట్టుకోలేక మరో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ ఆమెను చంపింది ఒక మాట కాదు.. నమ్మకద్రోహం వల్ల కలిగిన తీవ్రమైన మానసిక వేదన.
అయితే స్నేహంలో ఎప్పుడూ ఇలాంటి కథలే కాదు. ప్రపంచాన్ని కదిలించిన మరో నిజ జీవిత సంఘటన కూడా ఉంది.
ఒక చిన్నారికి క్యాన్సర్ చికిత్స కారణంగా జుట్టు మొత్తం ఊడిపోయింది. గుండు తలతో స్కూల్‌కు రావడానికి ఆమె సిగ్గుపడింది. అది గమనించిన ఆమె స్నేహితురాలు ‘నువ్వు ఒంటరిగా లేవు’ అని చెప్పడానికి తను కూడా గుండు చేయించుకుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ స్కూల్‌కు వెళ్లారు. ఆ చిన్నారి కళ్లలో కన్నీళ్లు వచ్చినా, ఆ కన్నీళ్ల వెనుక ఒంటరితనం లేదు.. స్నేహం ఉంది.
ఇదే సైకాలజీ చెప్పే ‘ఎంపతి ‘ అంటే, ‘నీ బాధను నేను కూడా అర్థం చేసుకుంటాను’ అనే భావన. నిజమైన స్నేహితుడు సలహాలు ఇచ్చే ముందు నీ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఒక సరదా మాట.. ‘బెస్ట్ ఫ్రెండ్ అంటే నీ టిఫిన్‌లో సగం తినేవాడు కాదు.. నీ బాధలో సగం మోసేవాడు’. మరో మాట.. ‘స్నేహితుడి రహస్యం WhatsApp Status కాదు…Locker లాంటిది. దాన్ని భద్రంగా దాచుకోవాలి’.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు మార్కులతో పాటు స్నేహం విలువ, నమ్మకం, పరస్పర గౌరవం, భావోద్వేగ నియంత్రణ కూడా నేర్పాలి. అలాగే పిల్లలకు ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వాలి. ఏ అవమానం, ఏ సమస్య కూడా జీవితాన్ని ముగించడానికి కారణం కాదు. బాధగా ఉంటే తప్పకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలతో మాట్లాడాలి.
– నిజమైన స్నేహితుడు.. నీ రహస్యాలను బయటపెట్టేవాడు కాదు, నీ గౌరవాన్ని కాపాడేవాడు.
– నిజమైన స్నేహితుడు.. నీతో కలిసి సెల్ఫీ దిగేవాడు కాదు, అవసరమైతే నీతో కలిసి గుండు గీయించుకునేవాడు.
– నిజమైన స్నేహం.. నవ్వుల్లో కనిపించదు, కష్టాల్లో నిరూపించబడుతుంది.
ఈ అంతర్జాతీయ స్నేహ దినోత్సవం సందర్భంగా ప్రతి బిడ్డా గుర్తుంచుకోవాల్సిన ఒక్క మాట.. ‘స్నేహితుడిని సంపాదించడం గొప్ప కాదు.. స్నేహితుడి నమ్మకాన్ని జీవితాంతం కాపాడుకోవడమే గొప్ప’. స్నేహం అంటే నమ్మకం.. నమ్మకాన్ని ఎప్పుడూ అమ్మకూడదు. స్నేహితుడి రహస్యం సరదా కాదు.. బాధ్యత. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలతో మాట్లాడటం నిజమైన ధైర్యం.
స్నేహం జీవితాన్ని అందంగా మార్చాలి.. ఒక క్షణిక పొరపాటు జీవితాన్ని చీకటి చేయకూడదు.’
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్


