Saturday, September 12, 2026
E-PAPER
Homeకవితచిన్నప్పటి చందమామ

చిన్నప్పటి చందమామ

- Advertisement -

ఏదీ నిన్నటిలా ఉండదు
నిన్న పూసిన పూలలాంటి
పూలు ఏ చెట్టు పూయదు
నిన్న రాలినట్టు ఏ చెట్టు ఆకులు రాల్చదు
నిన్న చూసినట్టే ఆకాశం
ఇవాళ ఉండదు
నిన్న చూసిన నక్షత్రాల
వెలుగు ఈరోజు అలాగే
నీ కళ్లకు అందదు
నిన్న మాట్లాడినట్లు
ఈరోజు మాట్లాడరు
నిన్నటి అనుభూతి నేడు అందదు
నిన్నటి లా నది ఉండదు
నిన్నటి లా కడలి అలలుండవు
నీ చిన్నప్పటి లా నువ్వు నడవలేవు
అప్పటి ఊహలు ఇప్పుడు
నిజాలు కావు
ఒక సారి చదివిన పుస్తకం
మళ్ళీ చదివితే కొత్తవెన్నో ఆలోచనలు
నీలో సుళ్ళు తిరుగుతాయి
నిన్న చేసిన పనులు
ఇప్పుడు కుదరక పోవచ్చు
ఒకే నదిలో ఎన్నిసార్లు మునిగినా
నిన్ను తాకే నీళ్లు ఒకటి కావు
రేపటి ఉదయాలను
ఈరోజు కలగనలేవు
నీ చిన్నప్పటి చందమామ ఇప్పుడు
నీకు దొరకదు
డా.సుంకర రమేశ్‌, 9492180764

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -