ఆడా, మగా అనే రెండు గీతలతో
మనిషిని కొలవాలని చూసిన ప్రపంచంలో
ఎవరో..
ఆ గీతల మధ్య కాదు
వాటి అవతల తమను తాము కనుగొన్నారు
అది తిరుగుబాటు కాదు
తమ ఉనికిని గుర్తించుకునే ప్రయాణం
వారి పేర్లు
మొదట్లో ఎవరికీ వినిపించవు
వినిపించినా అంగీకరించడానికి
మనకి ఇప్పటికీ ధైర్యం సరిపోదు
వాళ్లు నడిచే దారిలో
మట్టి అదే ఉంటుంది
ఆకాశమూ అదే ఉంటుంది
కానీ అడుగుల అర్థం
మాత్రం మారిపోతో౦ది
ఎందుకంటే అక్కడ శరీరం కాదు
తమ నిజాన్ని తామే అంగీకరించుకోడానికీ
ఆలింగనం చేసుకోవడానికీ
ఒక నిశ్శబ్ద యుద్ధం నడుస్తోంది
ఎవరో గీసిన రెండు గీతల మధ్య
వాళ్లు ఒదిగిపోవడం లేదు
నలిగి పోతున్నారు
అర్థనారీశ్వరుడి ముందు
చేతులు జోడించే మనమే
మన నిర్వచనాల్లో ఇమడని
మనుషుల్ని చూసి
ఇంకా చీదరించుకుంటూనే ఉంటాం
అర్జునుడు బృహన్నలగా
మారిన కథను చదివి
గౌరవంగా తల వంచుతాం
శిఖండి పేరు చెబుతూ వీరత్వాన్ని స్మరిస్తాం
కానీ ఇప్పటి కాలంలో
తమ పేరు కోసం, తమ అస్తిత్వం కోసం
తామే నిలబడుతున్నవాళ్లని
ఇంకా పరీక్షలోనే ఉంచుతున్నాం
ఇంకా ముఖం తిప్పేసుకుంటున్నాం
వారి కన్నీళ్లు
ఎవరికీ కనిపించని చోట కూడా
తడిగా మిగిలే చరిత్రలు
వాళ్లకి కావలసింది
తమని పరాయివాళ్లలా చూడని చూపు
దయతో చాచిన చెయ్యి కాదు
వెనక్కి తీసుకోని స్నేహం
సరిచేసుకొమ్మని చెప్పే జాగ్రత్త కాదు
ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించే హృదయం
ఎందుకంటే
మనిషిని మనిషిగా చూడలేని చోట
సంస్కృతి ఎంత గొప్పదైనా
అది కేవలం అలంకారమే
వారు మాత్రం ఆ అలంకారాలన్నింటి మధ్య
విరామం లేకుండా చుట్టుముట్టి వేధిస్తున్న
వెకిలి చూపుల మధ్య
తమ నిజాన్ని భుజాన వేసుకుని
ఎప్పటిలాగే కన్నీళ్లని రెప్పల వెనకే అదిమి
నిబ్బరంగా నడుస్తూనే ఉన్నారు
ఎప్పటికైనా
ఈ నేల రెండు గీతల్లో కాదు
అనేక శ్వాసల్లో మనిషిని
చదవడం నేర్చుకుంటుందేమో
ఎప్పటికైనా గుర్తింపులు గోడలు కాక
కనీసం కిటికీలు అవుతాయేమో
అప్పుడే వారి కథలు
వేదనగా కాదు, ప్రతిఘటనగా కాదు
ఒక కొత్త సంగీతంలా వినిపిస్తాయి
అప్పుడే మనిషి అనే పదం
తన పూర్తి అర్థాన్ని గుర్తు చేసుకుంటుంది..
ఖదిజ్ఞాసి రజని, 9848030089
రెండు గీతల అవతల
- Advertisement -
- Advertisement -



