Sunday, September 13, 2026
E-PAPER
Homeకవితమగ్గం

మగ్గం

- Advertisement -


కరిగిపోయే కాలాన్ని
కదురుకు చుడుతూ
కలలు ముడేసుకుంటం
పోగు పోగూ పొందిచ్చి
చుక్కల ముగ్గు దించుతం
బుర్రలో వెలిగిన దీపం
లోకానికి పంచుతం
చేతిలో విరబూసిన పద్మం
జగతికి కానుక జేస్తం
కుందేలు జింక పిల్లను ఒక్క గూటికి తోలుతం
హంసలూ చేపలకు పందెం పెడుతం
ఏనుగూ పిట్టను ఒకే చెట్టు నీడకు చేరుస్తం
మల్లెలూ మందారాలు పూయిస్తం
పడుగూ పేకల మీద
ప్రకృతి అందాలు ఆరబోయడమే
మాకు వచ్చిన పని, మాకు నచ్చిన పని
మీ మనసు మెచ్చిన పని
మగ్గం
వేల వేల నక్షత్రాల కాంతులు వెలిగే పాలపుంత
రెక్కలు తెగని దారం
ఆకాశంలో ఎంతగా విహరిస్తున్నా
బతుకు మీద ఆశ చావని వాళ్ళం
దిగులు మేఘాలు ఎన్ని కమ్మినా
దుఃఖపు వాగులు ఎన్ని పొంగినా
మగ్గం మా ప్రాణం
దారం మా అవసరం
మగ్గం
తొక్కిన కొద్దీ
మెతుకు దగ్గరయ్యే జైత్రయాత్ర
మొక్కిన కొద్దీ
వరాలు కురిసే అక్షయపాత్ర
కొమ్మ విరగకుండా, కాలు బెనకకుండా
చిటారు కొమ్మ మీది పువ్వు కోసుకొచ్చినట్టు
మగ్గం మీద నేసిన ఈ వస్త్రానికి
పట్టుచీర అని ఎవరు నామకరణం చేశారో ఏమో
రంగు రంగుల చీర
ఇంద్రధనుస్సు చీర అని అంటే
కాసులు గలగలా రాలుతున్న సిరుల పంట
నిజం చెప్పొద్దు
రెప్పలు వాల్చకుండా
రెక్కలకు విశ్రాంతి ఇవ్వకుండా
మగ్గం ఆడుతూ ఉంటే
కడుపులో మెసిలే ఆకలి అనకొండ
ప్రశాంతంగా నిద్ర పోతున్నది.

గజ్జెల రామకృష్ణ, 8977412795

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -