అధికారం..అవినీతి..ఇదే దాని నీతి
ఆ పార్టీతో ప్రజాస్వామ్యానికి
పెను ప్రమాదం మోడీ విధానాలను
తిప్పికొట్టాలంటే ఐక్య పోరాటాలే శరణ్యం
వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభలో త్రిపుర
మాజీ సీఎం మాణిక్ సర్కార్
మహబూబ్‌నగర్ నుంచి
అచ్చిన ప్రశాంత్
దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్న బీజేపీ ఆటలు ఎల్లకాలం చెల్లబోవని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ (ఎం) అగ్రనేత మాణిక్ సర్కార్ అన్నారు. ఆపార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం నానారకాల కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల హక్కులపై దాడిచేస్తూ, విభజన రాజకీయాలతో అధికారాన్ని పరిరక్షించుకుంటున్నదని తెలిపారు. అధికారంతో అవినీతి చేయడమే నీతి అన్నట్టుగా మోడీ సర్కారు వ్యవహరిస్తున్నదన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ గ్రౌండ్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మాణిక్ సర్కార్ మాట్లాడుతూ…దేశంలో అత్యంత పేదలు వ్యవసాయ కార్మికులనేనని చెప్పారు. వారు బట్టలు, తిండి, ఇల్లు వంటి ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేక అర్థాకలితో పస్తులుంటూ దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారి పక్షాన ఎర్రజెండా మాత్రమే పోరాడుతున్నదని స్పష్టం చేశారు.
వామపక్షపార్టీల ఒత్తిడి వల్లే ఉపాధి హామీ చట్టం
వామపక్ష పార్టీల ఒత్తిడితో యూపీఏ-1 ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. గ్రామీణ పేదలు ఆత్మ గౌరవంతో జీవించడం ఇష్టం లేని ఇప్పటి మోడీ సర్కార్ ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. దీంతో వ్యవసాయ కార్మికులు మళ్లీ రోడ్డున పడి, వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు సైతం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతోపాటు ఉపాధి గ్యారంటీ లేని పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి కష్టాలు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌కు పట్టడం లేదన్నారు.
కార్పొరేట్ల కోసమే
మోడీ సర్కార్ పేదల కష్టాలు తీర్చడం కంటే కార్పొరేట్లకు లాభాలు చేకూర్చటమే ధ్యేయంగా పనిచేస్తున్నదని మాణిక్ సర్కార్ విమర్శించారు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యం కాకుండా కులం, మతం, ప్రాంతం పేర్లతో విద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ లబ్దిపొందుతు న్నదని వివరించారు. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎ స్, విశ్వహిందూపరిషత్‌లు దానికి సహకరిస్తు న్నాయని చెప్పారు. బీజేపీ ప్రజాస్వామ్యంపై దాడిని తీవ్రతరం చేసి, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, వాటిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నదని విశ్లేషించారు.
ప్రశ్నించే గొంతులపై దాడులు
ప్రశ్నించే గొంతుకలపై సీబీఐ, ఈడీ, తదితర సంస్థలతో దాడులు చేయిస్తున్నారని మాణిక్ సర్కార్ అన్నారు. మీడియా గొంతును నొక్కేస్తున్నారని చెప్పారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈసీని తన గుప్పిట్లో పెట్టుకుని ఓటర్ల సవరణ (సర్) పేరుతో బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును తొలగించి బీహార్, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాల్లో అధికారం పొందిన తీరును వివరించారు. ఈ క్రమంలో తనకు సహకరించే వారికి ఆ తర్వాత మోడీ సర్కార్ పదవులు కట్టబెడుతున్నదని పలు ఉదాహరణలు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం కోసం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న ఆగడాలు ఎల్లకాలం చెల్లవనీ, ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడుతున్నాయని హెచ్చరించారు.
బీజేపీ పెంచుతున్నదని కాంగ్రెస్సే
చాలా రాష్ట్రాల్లో బీజేపీ బలాన్ని కాంగ్రెస్‌పార్టీనే పెంచుతున్నదని మాణిక్ సర్కార్ వివరించారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ త్రిపుర రాష్ట్రమేనని చెప్పారు. అక్కడ 42 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీ ఓటు బ్యాంకుగా మారిందనీ, కమ్యూనిస్టులను తాము ఓడగొట్టలేమన్న నిర్ణయంతోనే ఆ పార్టీ ఇలా వ్యవహరించిందని తెలిపారు. అదే సమయంలో సీపీఐ(ఎం) 5 నుంచి 7 శాతం ఓటింగ్‌ను మాత్రమే కోల్పోయిందని తెలిపారు.
త్రిపురలో బలపడుతున్నాం
సీపీఐ(ఎం) త్రిపురలో క్రమంగా పుంజుకుంటున్నదని మాణిక్‌సర్కార్ చెప్పారు. అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదనీ, ఈ మోసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. లెఫ్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను రెగ్యులర్‌గా నిర్వహించామని గుర్తు చేశారు. ఇప్పటి బీజేపీ ప్రభుత్వం వాటికి ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు.
క్షీణిస్తున్న శాంతి భద్రతలు
త్రిపురలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనీ, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా ఉందన్నారు. మోడీ సర్కారు రాజ్యాంగ సంస్థలపై చేస్తున్న దాడినీ, కూలీల హక్కులను కాలరాస్తున్న విధానాన్నీ, మనువాద సిద్ధాంతాన్ని ఎండగడుతూ ప్రజలంతా ఐక్యంగా రోడ్లెక్కి పోరాటాల్లోకి రావాలని మాణిక్ సర్కార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం కూడా ప్రజల్లోకి పోరాటాలను ఉధృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు
బీజేపీని పెంచుతున్నది కాంగ్రెస్సే
చాలా రాష్ట్రాల్లో బీజేపీ బలాన్ని కాంగ్రెస్‌పార్టీనే పెంచుతున్నదని మాణిక్ సర్కార్ వివరించారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ త్రిపుర రాష్ట్రమేనని చెప్పారు. అక్కడ 42 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీ ఓటు బ్యాంకుగా మారిందనీ, కమ్యూనిస్టులను తాము ఓడగొట్టలేమన్న నిర్ణయంతోనే ఆ పార్టీ ఇలా వ్యవహరించిందని తెలిపారు. అదే సమయంలో సీపీఐ(ఎం) 5 నుంచి 7 శాతం ఓటింగ్‌ను మాత్రమే కోల్పోయిందని తెలిపారు.



