Tuesday, July 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘హైడ్రా’కు రూ.227.98 కోట్లు మంజూరు

‘హైడ్రా’కు రూ.227.98 కోట్లు మంజూరు

- Advertisement -

తొలి విడతగా ఓఆర్‌ఆర్‌ పరిధిలోని
నాలుగు చెరువుల అభివృద్ధి
మొత్తం మూడు విడతల్లో
రూ. 536.5 కోట్ల పనులకు ప్రతిపాదనలు
నవతెలంగాణ- సిటీ బ్యూరో

హైదరాబాద్‌ నగర పరిధిలోని సహజ వనరులు, చెరువుల సంరక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్న హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని నాలుగు ప్రధాన చెరువుల పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి (ఫేజ్‌-1 కోర్‌ పనులు) కోసం రూ.227.98 కోట్లు కేటాయిస్తూ మున్సిపల్‌ పరిపాలన, ‌పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ సోమవారం (జీ.ఓ నెంబర్‌ 678) ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా కమిషనర్‌ సమర్పించిన డీపీఆర్‌, కార్యాచరణ ప్రణాళికను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించిన అంచనాలను హెచ్‌ఎండీఏ పరిశీలించి, ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీ హైదరాబాద్‌) ద్వారా స్వతంత్ర సాంకేతిక విశ్లేషణ, క్షేత్రస్థాయి తనిఖీలను పూర్తి చేయించింది. ఐఐటీ హైదరాబాద్‌ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఈ నిధుల మంజూరు ప్రక్రియ వేగవంతమైంది. ఈ నాలుగు చెరువుల సమగ్ర అభివృద్ధికి మొత్తం మూడు విడతల్లో రూ.536.5 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించగా, ప్రస్తుతం మొదటి విడత (కోర్‌ ఐటమ్స్‌) పనుల కోసం ప్రభుత్వం రూ. 227.98 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో చెరువుల పూడికతీత, గట్ల బలోపేతం, మురుగునీరు కలవకుండా మళ్లించడం వంటి అత్యవసర పనులను హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ​నిర్వహణ ఖర్చులకు అదనంగా రూ. 12.50 కోట్లు చెరువుల అభివృద్ధి నిధులతోపాటు, హైడ్రా ఏజెన్సీ రోజువారీ నిర్వహణ, కార్యాచరణ సహాయం కోసం బడ్జెట్‌ అంచనాలు 2026-27 నుంచి మరో రూ. 12.50 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం మరో జీఓ నెంబర్‌ 679 జారీ చేసింది. ఆర్థిక శాఖ బడ్జెట్‌ విడుదల ఉత్తర్వుల అనుగుణంగా ఈ నిధులను డ్రా చేసేందుకు హైడ్రా కమిషనర్‌కు పూర్తి అధికారాలు కల్పించింది. జీఓ ఆదేశాల ప్రకారం హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, హైడ్రా కమిషనర్లు సంయుక్తంగా ఈ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -