Monday, May 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహస్తంలో అసంతృప్తి

హస్తంలో అసంతృప్తి

- Advertisement -

కార్పొరేషన్‌ పదవులపై నేతల అలకలు
పని చేసేవారిని పక్కన పెట్టారంటూ ఆవేదన
బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన నేతలకు పెద్ద పీట వేశారంటూ ఆగ్రహం
బుజ్జగిస్తున్న సీఎం, పీసీసీ చీఫ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అధికార కాంగ్రెస్‌లో ఇప్పటిదాకా ఒకరకమైన అసంతృప్తి ఉంటే.. ఇప్పుడు మరో రకమైన అసంతృప్తి రాజుకుంది. పదేండ్ల బీఆర్‌ ఎస్‌ పాలనలో విపరీతమైన దాడులను, ఒత్తిడిని, అవమానాలను ఎదుర్కొని పార్టీ జెండాను వదలకుండా పట్టుకున్న వారు…హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు తగిన న్యాయం జరుగుతుందని భావించారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో తమకు ప్రాతినిధ్యం, ప్రాధాన్యత దక్కుతుందని వారు ఆశించారు. అందుకోసం దాదాపు రెండున్నరేండ్లపాటు ఎదురు చూశారు. చివరకు ఆ రోజు రానే వచ్చింది. కానీ తమకు దక్కాల్సిన పదవులు… పని చేయని వారికి, అంకిత భావం లేని వారికి, బీఆర్‌ ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన వారికి దక్కటంతో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నఅసలైన కాంగ్రెస్‌ నాయకుల్లో అసంతప్తి పెల్లుబుకుతోంది.
ఈ క్రమంలో పదవులు ఇస్తే ఒక బాధ.. ఇవ్వకపోతే మరో బాధ అన్నట్టుంది కాంగ్రెస్‌ పరిస్థితి. ఇన్ని రోజులు పదవులు ఇవ్వడం లేదని విమర్శించిన హస్తం నేతలు, పదవులు ఇవ్వగానే పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందని విమర్శించ టం గమనార్హం. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వకుండా ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికే అవకాశాలు ఇచ్చారని వారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా నుంచి ఎంపీ రేణుకా చౌదరి వర్గానికి చెందిన పలువురు నేతలు… హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు వచ్చారు. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకుందామని భావిస్తే… ఆయన అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్యాలయ కార్యదర్శికి తమ వినతిపత్రాన్ని అందజేసి వెళ్లిపో యారు. మరికొందరు నేతలు ఇంకోరకమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులు ఇవ్వక పోయినా ఫరవాలేదుగానీ.. రాత్రిపగలనే తేడా లేకుండా కష్టపడిన వారికి చిన్న చిన్న పదవులు ఇచ్చి అవమానపరిచారని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కులాల సహకార సంస్థలకు బీఆర్‌ ఎస్‌ నుంచి వచ్చిన వారిని చైర్మెన్లుగా నియమించి… కాంగ్రెస్‌ లో ఉన్న వారినేమో వైస్‌ చైర్మెన్లుగా నియమిం చటం వివాదాస్పద మవుతోంది.

అసలు విషయమేమంటే…
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 11 కుల సహకార సంస్థలకు చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను నియమించింది. మరో ఆరు సంస్థలకు చైర్‌ పర్సన్లను మాత్రమే నియమించింది. ఈ నియామకాల పట్ల పార్టీ క్యాడర్‌ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం నియమించిన 11 కుల సహకార సంస్థల చైర్మెన్లలో బస్వరాజు శ్రీనివాస్‌ (బ్రాహ్మణ కార్పొరేషన్‌), మోతుకూరి చంద్రశేఖర గౌడ్‌ (గౌడ కార్పొరేషన్‌), బొమ్మ శ్రీరామ్‌ (మున్నూరుకాపు కార్పొరేషన్‌, గుంజ రేణుక (వడ్డెర కార్పొరేషన్‌) తదితరులు బీఆర్‌ ఎస్‌ నుంచి కాంగ్రెస్‌కు వలసొచ్చిన వారేనంటూ హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు బీజేపీ నుంచి వచ్చిన ఎమ్‌. రఘునాథ యాదవ్‌ కు… యాదవ కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవి దక్కటం గమనార్హం. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో అధికార ప్రతినిధులుగా ఉండి, క్రియాశీలకంగా పని చేస్తున్న నేతలకు పదవులు దక్కకపోవటంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించి, ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న బైకాని లింగం యాదవ్‌, మేడి రవిచంద్ర (టీపీసీసీ అధికార ప్రతినిధి), బీమగాని సౌజన్య (భారత జోడో యాత్రలో క్రియాశీలకంగా పాల్గొన్నారు), లక్ష్మన్‌ యాదవ్‌ (అంబర్‌ పేట), సంధ్యారెడ్డి (సామాజిక కార్యకర్త, ప్రధాన కార్యదర్శి) తదితరులకు పదవులు దక్కలేదు. కాగా బీఆర్‌ ఎస్‌ నుంచి వచ్చారనే కారణంతో కోటూరి మానవతారారు ను పక్కనబెట్టటం కూడా విమర్శలకు తావిస్తోంది. మిగతా నేతల పట్ల ఒకలాగా, మానవతారారు పట్ల మరోలాగా అధికార పార్టీ వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరితోపాటు అసంతప్తితో రగిలిపోతున్న మరికొందరు నేతలను సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పిలిచి, బుజ్జగిస్తున్నట్టు తెలిసింది. మరి అధికార పార్టీ నేతల్లోని ఈ అసంతప్తి ఇంతటితో చల్లారుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -