Saturday, August 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపకడ్బందీగా బాసర మాస్టర్‌ ప్లాన్‌ అమలు

పకడ్బందీగా బాసర మాస్టర్‌ ప్లాన్‌ అమలు

- Advertisement -

దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు
నవతెలంగాణ-ముధోల్‌

నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని శ్రీజ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్‌ ప్లాన్‌ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బాసర ఆలయ మాస్టర్‌ ప్లాన్‌ అమలు తదితర అంశాలపై ఆదివారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, నిర్మల్‌ కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సమీక్షించారు. ముందుగా అధికారులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మహంకాళి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ తదితర ప్రాంతాలు తిరిగి చూశారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలు గురించి కీలక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు మాట్లాడుతూ.. బాసర మాస్టర్‌ ప్లాన్‌ అమలుతో ఆలయ రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. బాసర క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. రూ.225కోట్లతో బాసర ఆలయాన్ని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. బాసర ఆలయ అభివృద్ధి కోసం ఇటీవల ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారని చెప్పారు. సందర్శకులకు సకల సౌకర్యాలతో ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌, ఏఎస్పీ సాయికిరణ్‌, ఆలయ ఈఓ అంజనాదేవి, తహసీల్దార్‌ పవన్‌ చంద్ర, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -