కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి

KCR should be wise– పేదల రక్తం తాగేందుకే మల్లారెడ్డికి కాలేజీల అనుమతి : రేవంత్‌
నవతెలంగాణ- మేడ్చల్‌
హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్‌కు ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికలు జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తాయని తెలిపారు. గురువారం మేడ్చల్‌ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద నిర్వహించిన మీటింగ్‌కు రేవంత్‌ హాజరై మాట్లాడారు. మేడ్చల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేశారని గుర్తుచేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, మైనార్టీలకు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు, కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య వంటి ఎన్నో హామీలను ఇచ్చి నట్టేట ముంచారన్నారు. ఇప్పుడు ఏకంగా మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మంత్రి మల్లారెడ్డికి 30 ఇంజనీరింగ్‌ కాలేజీలు, మూడు మెడికల్‌ కాలేజీలు, ఒక యూనివర్సిటీ అనుమతులు ఇచ్చారని, కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేదని చెప్పారు. పేద ప్రజలు చదువుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించి హక్కుల కోసం పోరాడతారని, అందుకనే కళాశాలను ఏర్పాటు చేయకుండా పేదల రక్తం తాగేందుకే మల్లారెడ్డి కాలేజీలకు అనుమతులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దేవేందర్‌ గౌడ్‌, మలిపెద్ది సుధీర్‌ రెడ్డి ఉన్నప్పుడే నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు. అంతకుముందు కాంగ్రెస్‌ శ్రేణులు రేవంత్‌రెడ్డికి క్రేన్‌ సహాయంతో భారీ గజమాల వేసి బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్‌ యాద వ్‌, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్‌ గౌడ్‌, మున్సిపల్‌ అధ్యక్షులు వేముల శ్రీనివాస్‌ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్‌ యాదవ్‌, కౌన్సిలర్‌ చాపరాజు, మండల అధ్యక్షులు రమణారెడ్డి పాల్గొన్నారు.

Spread the love