గెలుపు గుర్రాలకే టికెట్‌

The ticket is for winning horses– కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన
– మొదటి లిస్టులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నలుగురి పేర్లు
– క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని అధిష్టానం నుంచి ఆదేశాలు
– ప్రచారానికి సమాయత్తం అవుతున్న ఆశావహులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను ఇప్పటికే ఎలక్షన్‌ కమిటీ పరిశీలించింది. మొదటి జాబితాలో 40 మంది పేర్లను ఏఐసీసీకి పంపింది. ఈ లిస్టులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి నలుగురికి చోటు దక్కినట్టు సమాచారం. వీరిని క్షేత్రస్థాయిలో పని చేసుకోవాలని అధిష్టానం నుంచి సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆశావహులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ తమ పనిలో నిమగయ్యారు.
గతంలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా కాంగ్రె స్‌కు కంచుకోట. ప్రత్యేక తెలంగాణ ఉద్య మం, బీఆర్‌ఎస్‌ దూకు డుతో జిల్లాలో కాంగ్రెస్‌ చతికిల పడింది. ముఖ్య నేతలు గులాబీ గూటికి చేర డంతో ఆ పార్టీకి నాయకత్వం వహించేవారే లేకుండా పోయారు. అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా వీడలేదు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో మళ్లీ కాంగ్రెస్‌ పుంజుకుంది. పార్టీ ఆగ్రనేత రాహుల్‌ చేపట్టిన జోడో యాత్రతో క్యాడర్‌లో జోష్‌ పెరిగింది. దీనికితోడు బీజేపీ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్‌తోపాటు పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌ గూటికి చేరడంతో పార్టీ పూర్వ వైభవం వైపు అడుగులు వేస్తోందన్న అభిప్రాయం ఆపార్టీలో వ్యక్తమవుతోంది. అలాగే చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ సభ విజయవంతం కావడం కూడా పార్టీకి కలిసొచ్చే అంశం. ఇదే క్రమంలో ఆశావహులు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఒక్కో నియోజకవర్గం నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే బలమైన లీడర్‌కు టికెట్‌ ఇచ్చి ఉమ్మడి జిల్లాలో అత్యధిక సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది.
ప్రజాదరణ కలిగిన నాయకులకు టికెట్‌
క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులనే బరిలో నిలిపేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో సర్వేలు చేయించింది. అభ్యర్ధిత్వానికి దరఖాస్తులు చేసుకున్న నాయకులపై ఇటీవల మరోసారి సర్వేలు చేయించింది. అయితే సర్వే రిపోర్టుతో పాటు అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఢకొీట్టేందుకు అంగబలం, అర్థబలం ఉన్న నాయకుడినే బరిలో నిలిపేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది.
మొదటి లిస్టులో నలుగురి పేర్లు ఖరారు ?
రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొదటి లిస్టులో 40 మంది జాబితాను కాంగ్రెస్‌ రాష్ట్ర ఎలక్షన్‌ కమిటీ ఏఐసీసీకి పంపింది. ఈ 40 మంది జాబితాలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదని కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నారు. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్‌ నియోజవకర్గం నుంచి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, పరిగి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి, షాద్‌నగర్‌ నుంచి వీర్లపల్లి శంకర్‌, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు అధిష్టానం ఆమోదం కోసం పంపింది. వీరిని క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ఎన్నికలకు సిద్ధం కావాలని గాంధీ భవన్‌ నుంచి సంకేతాలు పంపినట్టు సమాచారం.

Spread the love