ప్రశ్నార్థకంగా విదేశీ విద్య..!

Questionable foreign education..!– అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధికి కోతలు
– ఏండ్ల కొద్ది పెండింగ్‌లో స్కాలర్‌షిప్‌లు
– విదేశాల్లో విద్యార్థుల అవస్థలు
– అప్పులు చేసి ఫీజుల చెల్లింపులు
– ఈ ఏడాది రాష్ట్రంలో 320 మంది విద్యార్థుల దరఖాస్తు
– 80 మందికి మాత్రమే అవకాశం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ భరోసాతో విదేశీ చదువులకు వెళ్లిన పేద విద్యార్థుల బతుకులు ఆగమవుతున్నాయి. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద విదేశీ చదువులకు వెళ్లిన విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్‌లు అందక వారి చదువులు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. నిధులు సమకూర్చకుండా పథకం నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిఏటా పెడుతున్న ఆంక్షలు, విద్యార్థుల ఎంపికలో తగ్గుతున్న సంఖ్య దీనికి నిదర్శమని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో ఎంబీఏ చేసేందుకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి కింద 2019లో దరఖాస్తు చేసుకు న్నారు. వివిధ కారణాలతో పలు దఫాలుగా రిజెక్టు చేశారు. చివరికి 2021లో ఆ విద్యార్థిని ఎంపిక చేశారు. 2021 మార్చిలో ఆ విద్యార్థి కెనడాకు వెళ్లాడు. అక్కడ కాలేజీలో చదివినప్పటికీ ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌ రాకపోవడంతో ఆ విద్యార్థికి కోర్సు సర్టిఫికెట్లు నేటికీ అందలేదు. దాంతో విద్యార్థి చదువు అగమ్యగోచరంగా తయారైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరంలో విద్యానిధి పథకానికి 98 మంది దరఖాస్తులు చేసుకుంటే 32 మందిని మాత్రమే ఎంపిక చేశారు. 2022-23 అకడమిక్‌ ఇయర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 330 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 80 మందిని మాత్రమే ప్రభుత్వం ఎంపిక చేసింది. కాగా, తొమ్మిది నెలలుగా అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధికి ప్రభుత్వం నుంచి చిల్లీగవ్వ కూడా అందకపోవ డంతో వందల మంది విద్యార్థులు విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎంపికలో కొర్రీలు
ప్రతియేటా రాష్ట్రం నుంచి అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద 210 మందిని పంపించాల్సి ఉంది. డిగ్రీలో 60శాతం మార్కులు, జీఆర్‌ఎఫ్‌లో 20శాతం, జీఎమ్‌ఏటీలో 20శాతం మార్కులు ఉండాలి. కానీ ఇటీవల అనేక మార్పులు తీసుకొచ్చిం ది. గతంలో 60 శాతం ఉన్న దాన్ని 70 శాతానికి పెంచారు. దాంతో ఈ ఏడాది 330 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే కేవలం 80 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. దీని వలన గ్రామీణ ప్రాంతంలో చదవిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మార్కుల శాతాన్ని తగ్గించడంతోపాటు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
బడ్జెట్‌ లేదు…
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తోంది. విదేశాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. కానీ ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ రావాల్సి ఉంది. తొమ్మిది నెలలుగా బడ్జెట్‌ లేదు. బడ్జెట్‌ను బట్టి కొంత కొంత ఎమౌంట్‌ వేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
– రామారావు, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి

Spread the love