రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తా..

President's rule will be recommended.–  పంజాబ్‌ సిఎంకు ఆ రాష్ట్ర గవర్నర్‌ బెదిరింపు
చండీగఢ్‌ : పంజాబ్‌ గవర్నర్‌ బన్వారిలాల్‌ పురోహిత్‌, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మధ్య వివాదం శుక్రవారం తీవ్రస్థాయికి చేరింది. ఏకంగా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తానని ముఖ్యమంత్రిని గవర్నర్‌ బెదిరించారు. గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని.. క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమిస్తానంటూ హెచ్చరించారు. ఈ మేరకు మాన్‌కు పంపిన లేఖను గవర్నర్‌ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. గతంలో రాసిన లేఖలపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై కలత చెందినట్టు పేర్కొన్నారు. రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యంపై రాష్ట్రపతికి నివేదించగలనంటూ హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356, ఐపిసి సెక్షన్‌ 124 ప్రకారం తాను ‘తుది నిర్ణయం’ తీసుకోవడానికి ముందే చర్యలు తీసుకోవాలని మాన్‌కు సూచించారు. అలాగే, రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే రాజ్యాంగం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప తనకు వేరే మార్గం ఉండదన్నారు.
రాష్ట్రంలోని ఆప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ గవర్నర్‌ ముఖ్యమంత్రికి పలుమార్లు లేఖలు రాశారు. ఫిబ్రవరిలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లను సింగపూర్‌ పర్యటనకు ఎంపిక చేయడం సహా పలు అంశాలపై గవర్నర్‌ వివరాలు కోరారు. ఇలాంటి అంశాల విషయంలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

Spread the love