పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి

– వికారాబాద్‌ జిల్లా యాలాలలో ఘటన
నవతెలంగాణ-తాండూరు
పిడుగుపాటుకు గురై ముగ్గురు రైతులు మృతి చెందిన ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని జుంటుపల్లి, బెన్నూర్‌ గ్రామాల్లో ఆదివారం జరిగింది. జుంటుపల్లి గ్రామానికి చెందిన మంగాలి శ్రీనివాస్‌(35), కోనింటి లక్ష్మప్ప (28) పెర్కంపల్లి గ్రామ శివారు పొలంలో వరి కోపిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో వారు వరి కోత మిషన్‌ కింద కూర్చుకున్నారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో మంగాలి శ్రీనివాస్‌, కోనింటి లక్ష్మప్ప అక్కడికక్కడే మృతిచెందారు. వరి కోత మిషన్‌ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను తాండూర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అలాగే బెన్నూర్‌ గ్రామంలో గొల్ల వెంకటయ్య (62) రైతు పంట పొలానికి మందు కొడుతున్నాడు. వర్షం పడటంతో చెట్టు కిందికి వెళ్లాడు. ఈ క్రమంలో పిడుగు పడటంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే మండలంలో ఒకే రోజు ముగ్గురు రైతులు పిడుగుపాటుకు గురై మృతిచెందడంతో బాధితుల కుటుంబాల్లో విషాదఛాయాలు అలుముకున్నాయి.
ఎమ్మెల్యే దిగ్భాంత్రి
పిడుగుపాటుకు గురై ముగ్గురు రైతులు మృతిచెందిన ఘటన పట్ల తాండూర్‌ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన రూ.ఆరు లక్షల ఆర్థిక సహాయం అందేలా వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆర్డీవోకి సూచించారు. వీలైనంత త్వరలో బాధిత కుటుంబాలకు సాయం అందేలా కృషి చేస్తానని ఒక ప్రకటనలో ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Spread the love