పేద విద్యార్థుల చేతికి స్టెతస్కోప్‌ ‘ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌’ సక్సెస్‌

 Stethoscope for poor students 'Operation Blue Crystal' was a success– తొలి విడతలో 108 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు
– అత్యధిక సీట్లు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోనే..
– మరో 50 మంది విద్యార్థులకు అవకాశం
– ఈ ఏడాది ఓపీబీసీలో 181 మందికి శిక్షణ
– 153 మందికి నీట్‌ ర్యాంకులు
– సోషల్‌ వెల్పేర్‌, గిరిజన గురుకులాల నుంచి 185 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌, ఆపరేషన్‌ ఎమరాల్డ్‌’ ప్రతియేటా వందలాది పేద విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేస్తోంది. పేద విద్యార్థులకు వైద్య విద్య నేడు అందని ద్రాక్షగా మారింది. ఈ తరుణంలో వారిని ప్రోత్సహించి, నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి వైద్యులుగా తయారు చేయడంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతియేటా వందకు పైగా ఎంబీబీఎస్‌ సీట్లు సాధిస్తున్నారు. సోషల్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో నడు స్తున్న ఈ సంస్ధలు.. రాష్ట్రంలో కార్పొరేట్‌ ఇన్సిట్యూట్‌లను తలదన్నేలా ఫలితాలను సాధిస్తూ మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. దాంతో తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డిలోని సోషల్‌ వెల్పేర్‌ గురుకులం ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ (ఓపీబీసీ)లో నీట్‌ కోసం లాంగ్‌టర్మ్‌ శిక్షణ పొందిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ఏడాది గౌలిదొడ్డి సోషల్‌ వెల్పేర్‌ గురుకులం నుంచి 181 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షలు రాయగా.. ఇందులో 153 మంది ర్యాంకులు సాధించారు. మొదటి విడత ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో 103 మంది సీట్లు సాధిం చారు. నార్సింగ్‌లో ఓపీబీసీ నుంచి 42 మంది నీట్‌ పరీక్షలు రాయగా 4 ఎంబీ బీఎస్‌ సీట్లు వచ్చాయి. రెగ్యులర్‌ గురుకులాల నుంచి మరో 50 మంది అర్హత పొందారు. గౌలిదొడ్డి గురుకులం నుంచి మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చే అవకాశం ఉందని గురుకులం ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓపీఎం కింద ఈ ఏడాది 93 మంది గిరిజన విద్యార్థులకు నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ ఇవ్వగా, వారిలో 64 మంది ర్యాంకులు సాధించారు. మరో 8 మంది రెగ్యులర్‌ గురుకులాలకు చెందినవారు మొత్తంగా గిరిజన గురుకులాల నుంచి 72 మంది అర్హత సాధించారు. ఓపీబీసీ, ఓపీఎం నుంచి 185 మంది తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందారు.
లెసన్‌ ఫ్లానింగ్‌.. మంచి ఫలితాలు
విద్యార్థులకు సబ్జెక్ట్‌ సులభతరం కావడానికి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా లెసన్‌ ఫ్లాన్‌ తయారు చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా లెసన్‌ ఫ్లాన్‌ తయారు చేయడం వైస్‌ ప్రిన్సిపాల్‌ దేవి, అసోసియేట్‌ లెక్చరర్స్‌ మల్లేష్‌ చారి, రమేష్‌, మల్లేష్‌.. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించడం ఓపీబీఎస్‌ వెనక ఉన్న సిక్రెట్‌తో నీట్‌లో మంచి ఫలితాలు సాధించారు.
విద్యార్థుల పట్టుదల గొప్పది
డాక్టర్‌ కావాలన్న పేద విద్యార్థుల కలలను నిజం చేసేందుకు ప్రభుత్వం మాకు ఇచ్చిన అవకాశం గొప్పది. అవకాశాలను వినియోగించుకోవడంలో విద్యార్థుల పట్టుదల చాలా గొప్పది. అంతే స్థాయిలో వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఫ్యాకల్టీ నాణ్యమైన శిక్షణతో ఎంతో మంది పేద కుటుంబాల జీవన స్థితిగతుల్లో మార్పులు తెచ్చింది.
– శారద, సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్సియల్‌ ఇన్సిట్యూట్‌ సొసైటీ,గౌలిదొడ్డి, ప్రిన్సిపాల్‌
పేద పిల్లలను డాక్టర్లుగా తయారు చేయడమే ఓపీబీసీ లక్ష్యం
ఎస్సీ, ఎస్టీ పిల్లలను డాక్టర్లుగా తయారు చేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఓపీబీసీని ఏర్పాటు చేశాం. లక్ష్య సాధన కోసం ఫ్యాకల్టీ నిర్విరామ కృషి చేస్తోంది. ప్రతి నిత్యం విద్యార్థుల పర్యవేక్షణ, పోటీ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంలో అధికారులు, ఫ్యాకల్టీ ప్రత్యేక చొరవతో మంచి ఫలితాలు ఇస్తోంది. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీ కృషి అభినందనీయం.
– వెంకట రమణ, ఓపీబీసీ అకాడమి కో-అర్డినేటర్‌
అత్యధిక సీట్లు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లోనే..
ఓపీబీసీ, ఓపీఎంలో కోచింగ్‌ తీసుకుని నీట్‌ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 80 శాతం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సీట్లు వచ్చాయి. గాంధీ, ఉస్మానియాలో ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు పొందారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలు భవిష్యత్‌లో ఎక్కువ మంది విద్యార్థులను డాక్టర్లను చేయాలన్న పట్టుదలను ఉపాధ్యాయుల్లో పెంచింది.

Spread the love