ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి
జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : సంగారెడ్డిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ‘విలేకరులు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు, పంటలకు మద్దతు ధర తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సోమవారం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట జరిగిన ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. సంగారెడ్డిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను మధ్యలో దళారులు చేరి మిల్లర్లకు, వ్యాపారులకు అమ్ముకునే దుస్థితి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వాహనాలు సరిపడా లేవన్నారు. రైతులు అమ్ముకున్న పంటకు వెంటనే చెల్లింపులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందజేయాలని తెలిపారు. తరుగు పేరుతో క్వింటల్‌కు 6 నుంచి 7 కిలోలు తీస్తూ రైతులను దోచుకోవడం దారుణమన్నారు. ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు వెంటనే సరిపడా సంచులు సరఫరా చేయాలని, హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటున్న కాంగ్రెస్.. రైతుల ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు. అదే విధంగా జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెదక్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య, సిద్దిపేటలో పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. జనగామ కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైటాయించి పెద్ద ఎత్తున నినదించారు. ఒక దశలో కలెక్టరేట్ లోపలికి రైతులు తోసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) నాయకులకు, కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్.. చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీధర్‌రెడ్డికి రిఫర్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. అధికారులతో మంత్రి సమీక్షించి 15 రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గద్వాలలోని పాత హౌసింగ్ బోర్డులోని వరి కొనుగోలు కేంద్రాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.వెంకటస్వామి ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం ఆధ్వర్యంలో పార్టీ జిల్లా బృందం పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
కొర్రీలు లేకుండా వడ్లు కొనాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



