నవతెలంగాణ-హైదరాబాద్: ప్రజల మధ్య విభజనలు సృష్టించే సనాతన ధర్మాన్ని తప్పకుండా రద్దు చేయాలని డిఎంకె నేత, ప్రతిపక్షనేత (ఎల్ఒపి) ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. మంగళవారం ప్రతిపక్షనేతగా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. సనాతన ధర్మం ప్రజలను విభజిస్తోందని, దానిని ఖచ్చితంగా రద్దు చేయాలని అన్నారు. ఇటీవల కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తమిళ ప్రార్థనా గీతమైన `తమిళ్ తాయ్ వాళ్తు’ను పక్కన పెట్టడంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో రాష్ట్ర గీతానికి సంప్రదాయబద్ధంగా లభించాల్సిన ప్రాధాన్యత దక్కలేదని, మూడవస్థానానికి వెళ్లిందని అన్నారు. ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జరిగిన ఇటువంటి సంఘటన ఒక పొరపాటు అని, ఈ అసెంబ్లీలో ఇది మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, తాము దానికి అనుమతించమని అన్నారు. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాల్లో తమిళ్ తాయ్ వాళ్తు కు ఎప్పుడూ ప్రాధాన్యతనివ్వాలని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ఎక్కడా రాజీపడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని, మన హక్కులు, సంప్రదాయాలను కాపాడుకోవడంలో మనమంతా చాలా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ నిబంధనల మార్పు రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం, దిగ్బ్రాంతిని కలిగించిందని అన్నారు. ప్రోటోకాల్‌ను మార్చడానికి గవర్నర్ చేసిన ప్రయత్నాలను 2023లో అధికార డిఎంకె ప్రతిఘటించిన ఉదంతాన్ని కూడా ఆయన సభకు గుర్తు చేశారు.
ప్రతిపక్ష పాత్రను వివరిస్తూ.. డిఎంకె వ్యవస్థాపకుడు సి.ఎన్.అన్నాదురైని స్మరించుకున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాన్ని నడిపించేందుకు ప్రతిపక్షం వాహనానికి బ్రేకులు’,ఎద్దుకు పగ్గాలు’ వంటిదని అభివర్ణించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. కేవలం అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికే కాకుండా, నిర్మాణాత్మకంగా పనిచేయాలని ప్రతిపక్షం ఉద్దేశిస్తోందని అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలోనూ సుమారు అధికార పక్షంతో సమానమైన సంఖ్యలో సభ్యులు ఉన్నారని అన్నారు. అలాగే, అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు. అలాగే మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పెరగడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాను, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ ముగ్గురమూ లయోలా కళాశాల పూర్వ విద్యార్థులేనని ఉదయనిధి పేర్కొన్నారు. రాజకీయంగా డీఎంకే ఇప్పటికీ ‘సీనియర్ బ్యాచ్’ గానే మిగిలిపోయిందని ఆయన చమత్కరించారు. ద్రావిడ పాలనా విధానమైన ‘అందరికీ అన్నీ’ అనే సూత్రం నిలబడేలా చూసేందుకు ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిశితంగా పర్యవేక్షిస్తుందని ఆయన అన్నారు. స్పీకర్ తటస్థంగా ఉండాలని, అసెంబ్లీలో ప్రజల ఆందోళనలకు మద్దతుగా ప్రతిపక్షాల గొంతుక వినిపించేలా చూడాలని అన్నారు.
సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కుదరదని, దాన్ని డెంగూ, మలేరియాల్లాగ నిర్మూలించవలసిందేనని 2023 సెప్టెంబర్‌లో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.



