టైర్లు పేలి అదుపు తప్పి కంటైనర్‌ను ఢీకొన్న వైనం
ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు
నంద్యాల : నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల కేంద్రంలోని 40వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రయివేట్ ట్రావెల్ బస్సు దగ్ధమైంది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. జిల్లా ఎస్‌పి సునీల్ షోరాన్ తెలిపిన వివరాల మేరకు… ఎఆర్‌బిసివిఆర్ ట్రావెల్ బస్సు 36 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు బుధవారం బయలుదేరింది. శిరివెళ్ల మెట్ట వద్దకు రాగానే బస్సు ముందు టైర్లు పగిలిపోయాయి. దీంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అటువైపు రోడ్డులోకి వెళ్లి ఎదురుగా వస్తున్న కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టింది. కంటైనర్ పల్టీలు కొడుతూ సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. ఆ వెంటనే బస్సు, కంటైనర్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ అభిషేక్ (38), క్లీనర్ నవీన్ (40), ట్రావెల్ బస్సు డ్రైవర్ భాస్కర్ (40) అక్కడికక్కడే మృతి చెందారు.
మంటల్లో వారి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. మృతులు ముగ్గురూ కడప జిల్లా కేంద్రానికి చెందినవారు. ట్రావెల్ బస్సులో ఉన్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై అద్దాలు పగులగొట్టి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణికులందరూ ఒకేసారి బయటకు రావడానికి ప్రయత్నించడంతో పాటు మంటలు వ్యాపించడంతో 15 మంది గాయపడ్డారు. మంటల్లో బస్సు, కంటైనర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎమ్‌డి.ఫరూక్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆళ్లగడ్డ డిఎస్‌పి ప్రమోద్, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
ఏపీలో ట్రావెల్ బస్సు దగ్దం
- Advertisement -
- Advertisement -



