దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలతో పాటు, పంజాబ్, ఒడిశాలకు నష్టం
దేశ మహిళలను మోసగిస్తున్నారు.. దాన్ని అంగీకరించం
లోక్‌సభలో ముక్త కంఠంతో ప్రతిపక్షాల డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును వెనక్కి తీసుకోవాలని లోక్‌సభలో ప్రతిపక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. ”మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం అనుకూలం. కానీ డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలతో పాటు, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు నష్టపోతు న్నాయి. పెంచిన సీట్ల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ? 2029 ఎన్నికల్లో గెలవడం కోసమే డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చారు. అందుకే అసోం, జమ్మూ కాశ్మీర్‌లో వలే డీలిమిటేషన్ వంటి వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలు చాలా విజ్ఞాన వంతులు. మీ మోసాన్ని తెలుసుకుంటారు” అని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ”మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం పొందింది. కానీ 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయలేదు. హఠాత్తుగా ఇప్పుడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో హడావుడి చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం అసలు లక్ష్యం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కాదు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదంతో తమకు నచ్చినట్టు లోక్‌సభ సీట్లు పెంచుకోవడమే. దేశ మహిళలను చీట్ చేస్తున్నారు. దాన్ని అంగీకరించం” అని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లుల సవరణల పట్ల కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, ఎంపీ ధర్మేంద్ర యాదవ్, సీపీఐ(ఎం) ఎంపీ రాధాకృష్ణన్, టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్, ఆర్‌ఎస్పీ ఎంపీ ఎన్. కె ప్రేమ్ చంద్రన్, డీఎంకే ఎంపీ టిఆర్ బాలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు తీవ్ర అభ్యంతరం చేశారు. బిల్లులు ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు ఓటింగ్ డిమాండ్ చేశాయి. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్‌ను నిర్వహించారు. 333 మంది ఎంపీలు ఓటు వేయగా, అనుకూలంగా 207, వ్యతిరేకంగా 126 ఓట్లు వచ్చాయి. అనంతరం స్పీకర్ ఓం బిర్లా బిల్లులపై చర్చకు అనుమతిచ్చారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బిల్లులపై చర్చను ప్రారంభిస్తూ 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ విధానాన్ని .. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత అమలు చేయనున్నట్టు చెప్పారు. లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 50 శాతం పెంచనున్నట్లు చెప్పారు. 815 సీట్లకు ఆ సంఖ్య చేరుకోనున్నట్టు తెలిపారు. 272 సీట్లను మహిళలకు కేటాయించనున్నట్టు చెప్పారు. దీనివల్ల ఏ రాష్ట్రం కూడా తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోదని, ప్రస్తుతం ఉన్న ఆయా రాష్ట్రాల సామర్థ్యం అలాగే కొనసాగుతుందని ఆయన అన్నారు. పురుషులకు కానీ, రాష్ట్రాలకు కానీ తాజా బిల్లులలో ఎటువంటి నష్టం ఉండబోదన్నారు. 131వ రాజ్యాంగ సవరణ 2026 బిల్లుతో మహిళలకు సమానత్వం వస్తుందన్నారు. తమ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తున్నట్టు తెలిపారు.
మహిళా రిజర్వేషన్ పేరుతో బుల్డోజ్: గౌరవ్ గగోయ్ (కాంగ్రెస్ ఎంపీ)
మహిళా రిజర్వేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని చూస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ విమర్శించారు. ఒకవేళ మహిళా కోటా చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, తాజా లోక్‌సభ సీట్ల సంఖ్య ఆధారంగా తక్షణమే రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. మహిళలకు ఆ బిల్లులు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కులగణనకు, రాజ్యాంగా నికి, ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా ఆ బిల్లులు ఉన్నాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్‌ను కేంద్రం బుల్డోజ్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్‌కు తాము మద్దతు ఇస్తామని, కానీ దాన్ని సరళీకరించాలని, డీలిమిటేషన్‌తో లింకు చేయవద్దు అని కోరారు. 543 సీట్ల ఆధారంగానే లోక్‌సభలో రిజర్వేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. జాప్యం చేసేందుకే రెండు బిల్లులను కలిపినట్లు ఆయన ఆరోపించారు. ఒకవేళ తాము చెప్పినట్టు 2023లోనే విని ఉంటే, 2024లోనే మహిళా రిజర్వేషన్ అమలు అయ్యేదని అన్నారు.
రాజకీయ కోణంలో చూడొద్దు: ప్రధాని మోడీ
మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంలో చూడొద్దు అని ప్రధాని మోడీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ పార్టీకి అనుకూలం కాదని, దానికి రాజకీయ రంగు పూయొద్దని తెలిపారు. ఎవరు బాధ్యులైనా, ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆలస్యం చేశామన్నారు. ఈ బిల్లులను తీసుకువచ్చిన సక్సెస్ తమ ప్రభుత్వానికి కానీ, మోడీకి కానీ దక్కదని, ఇది దేశ ప్రజాస్వామ్యానికి దక్కుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంలో క్రెడిట్ ఎవరిదన్న దానిపై ఆలోచించొద్దని, కావాలంటే మీరే క్రెడిట్ తీసుకోవచ్చని ఆయన ప్రతిపక్షాలకు తెలిపారు. దేశ సోదరీమణులను నమ్మండి అని, వారి ఇంటెలిజెన్స్‌ను గుర్తించాలని అన్నారు. నారీ శక్తి వికసిత్ భారత్‌కు ఉపయోపడుతుందని తెలిపారు. మనం తీసుకోబోయే నిర్ణయాన్ని మహిళలు వీక్షిస్తున్నారని, మన ఉద్దేశాలను కూడా గమనిస్తున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ ప్రక్రియను మరింత ఆలస్యం చేయొద్దని తెలిపారు. రాజ్యాంగ సవరణ బిల్లులతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని, ఎవర్నీ వివక్షాపూరితంగా చూడబోమని అన్నారు.
అమిత్ షా వర్సెస్ అఖిలేశ్ యాదవ్
బిల్లులను ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ మధ్య మాటలయుద్ధం నడిచింది. అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదన్నారు. అలాగే, ఈ బిల్లును ఇప్పుడు చేపడుతున్న జనాభా లెక్కలతో అనుసంధానం చేయాలని సూచించారు. ఈ బిల్లులో వెనుకబడిన వర్గాల మహిళలకు, ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియ రాజ్యాంగ వ్యతిరేకం అని అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఒకవేళ జనగణన జరిగిన తరువాత తాము కుల గణన గురించి అడుగుతామని, అప్పుడు రిజర్వేషన్ సమస్య వస్తుందని, అందుకే మమ్మల్ని మీరు మోసం చేస్తున్నారని విమర్శించారు. దీనికి హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2011 జనాభా లెక్కల్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే, ఇటీవల ప్రారంభమైన జనాభా గణన ప్రక్రియ 2027 నాటికి పూర్తవుతుందన్నారు. అలాగే, కుల గణన కూడా చేపడతామని తెలిపారు. అయితే, మతం ఆధారంగా సీట్లు కేటాయించడం, చట్టసభలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం అంగీకరించ బోదన్నారు. అంతగా కావాలనుకుంటే సమాజ్‌వాదీ పార్టీ తన సీట్లన్నీ ముస్లింలకే కేటాయించాలంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మరో ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ స్పందిస్తూ షా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్నారు. అఖిలేశ్ స్పందిస్తూ.. ముస్లిం మహిళలు మన సగం జనాభాలో భాగం కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా అమిత్ షా మాట్లాడటం సరికాదన్నారు. అమిత్ షా, ఎస్పీ నేతల మధ్య వాదన సాగుతుండటంతో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని, ఇరువురిని శాంతింపజేశారు.
ఏపీ ఎంపీల మద్దతుపై పునరాలోచించాలి: డింపుల్ యాదవ్ (ఎస్పీ)
కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎందుకు మద్దతు పలుకుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని సమాజ్‌వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనతో చిన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గుతుందని, భవిష్యత్తులో కేంద్రానికి ఆ రాష్ట్రాల అవసరమే లేకుండా పోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీ సర్కారు నియోజకవర్గాల పునర్విభజనకు ఉవ్విళ్లూరుతున్నదని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తొందరపాటు వెనుకగల వ్యూహం ఏమిటనేది ప్రశ్నార్థకంగా ఉన్నదని అన్నారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంలో కేంద్రం స్పందిస్తూ.. ముందుగా జనగణన చేపడుతామని, జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపడుతామని చెప్పిందని ఆమె గుర్తు చేశారు. జనగణన జరగకుండానే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ఎందుకు తహతహలాడుతుందో అర్థం కావడంలేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు జనగణన చేపట్టడం చాలా ముఖ్యమని, అప్పుడే ఓబీసీ, మైనారిటీ మహిళకు న్యాయంగా మహిళా రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయని వివరించారు.
సమాఖ్యవాదంపై దాడి ఈ కొత్త బిల్లు ఒక రాజకీయ నాటకం
ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి: సీపీఐ(ఎం) ఎంపీ కె.రాధాకృష్ణన్
సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సీపీఐ(ఎం) ఎంపీ కె. రాధాకృష్ణన్ లోక్‌సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రూల్ 72 కింద నోటీసు ఇచ్చారు. సభలో కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలను తీవ్రంగా విమర్శించారు. ”రాజ్యాంగ సవరణలు సమాఖ్యవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి విలువలను నిలబెట్టాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఇతర పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది సహకార సమాఖ్యవాద స్ఫూర్తికి విరుద్ధం” అని ఆయన అన్నారు. ”2023 సెప్టెంబర్ 28న ఆమోదించిన ‘నారీ శక్తి వందన అధినియమ్’ (మహిళా రిజర్వేషన్ చట్టం)ను జనాభా లెక్కల తర్వాత అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, జనాభా లెక్కలు నిర్వహించడా నికి ఇంకా సిద్ధంగా లేని ప్రభుత్వం, ఆ వాగ్దా నాన్ని మరిచి కొత్త సవరణతో ముందుకు రావడం వింతగా ఉంది” అని విమర్శించారు. ”రాబోయే ఎన్నికలకు ముందు ఈ కొత్త బిల్లు ఒక రాజకీయ నాటకం. ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్కరణల కంటే రాజకీయ లబ్దికే ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రాల అధికారాన్ని హస్తగతం చేసుకుని, కేంద్రంలో అధికారాన్ని కూడగట్టేందుకు ఇది ఒక ఎత్తుగడ. తగినంత చర్చలు లేకుండా ఇలాంటి కీలకమైన సవరణలను హడావిడిగా ఆమోదించడం ప్రజాస్వామ్య వ్యతిరేకం” అని రాధాకృష్ణన్ అన్నారు. ”ప్రజల ప్రజాస్వామ్య హక్కులను, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని బలహీనపరిచే ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. కొత్త సవరణలు తీసుకురావడానికి ముందు, ప్రస్తుతం ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయడానికి జనాభా లెక్కల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి” అని డిమాండ్ చేశారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను పార్లమెంటు లోపల, వెలుపల తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన పేర్కొన్నారు.
డీలిమిటేషన్‌ను వెనక్కి తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



