హార్ముజ్‌పై కన్నేస్తే యూఎస్ నౌకలను సముద్రంలో కూల్చేస్తాం : ఇరాన్ హెచ్చరిక
రెండో విడత చర్చల కోసం కొనసాగుతున్న దౌత్య యత్నాలు
నవ తెలంగాణ – సెంట్రల్ డెస్క్
హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ చమురు పరిశ్రమపై మరిన్ని ఆంక్షలు విధించారు. మరోవైపు హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తే ఆ దేశానికి చెందిన నౌకలను తమ తొలి క్షిపణి దాడి సముద్రంలో ముంచేస్తుం దని ఇరాన్ హెచ్చరించింది. అంతేకాక జలసంధి దిగ్బంధనం ఇలాగే కొనసాగితే వేలాది మంది అమెరికా సైనికులను బందీలుగా పట్టుకుంటామని తెలిపింది. ఇదిలావుండగా అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు అవకాశం కల్పించి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించేందుకు దౌత్య యత్నాలు కొనసాగుతున్నాయి.
ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బ తీసేందుకే…
రష్యా, ఇరాన్ దేశాల ముడి చమురును పలు ప్రపంచ దేశాలకు విక్రయిస్తున్న పెట్రోలియం వ్యాపారవేత్త మహమ్మద్ హుస్సేన్ షమ్ఖానీ నెట్ వర్క్‌లో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్న పాతిక మందికి పైగా వ్యక్తులు, కంపెనీలు, నౌకలపై అమె రికా తాజాగా ఆంక్షలు విధించింది. చమురు రవా ణాకు చెందిన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమె రికా ఈ చర్య తీసుకుంది. షమ్ఖానీ ఇరాన్ ప్రజల సొమ్ముతో లాభాలు దండుకుంటున్నారని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ఆరోపించారు. షమ్ఖానీ ఇరాన్ సెక్యూరిటీ అధికారి అలీ షమ్ఖానీ కుమారుడు. ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీకి సలహాదారు. వీరిద్దరూ అమెరికా-ఇజ్రాయిల్ జరిపిన దాడిలో తొలి రోజే చనిపోయారు. ఇరాన్‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి అమెరికా చేయాల్సిందంతా చేస్తుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా హార్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైన తర్వాత తొలి 48 గంటలలో ఇరాన్ ఓడరేవుల నుంచి బయటికి పోకుండా పది నౌకలను అడ్డుకున్నానని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే కనీసం మూడు నౌకలు ఇరాన్ ఓడరేవుల నుంచి బయలుదేరి హార్ముజ్‌ను దాటాయని షిప్ ట్రాకింగ్ డేటాను బట్టి తెలుస్తోంది.
మీరు హార్ముజ్‌కు పోలీసా? : ట్రంప్‌ను ప్రశ్నించిన టెహ్రాన్
హార్ముజ్ జలసంధిపై పెత్తనం చెలాయించాలని చూస్తే అమెరికా నౌకలను ధ్వంసం చేస్తామని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు మొV్‌ాసేన్ రెజారు హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వ టీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ‘హార్ముజ్ జలసంధికి పోలీసులా వ్యవహరించాలని ట్రంప్ అనుకుంటున్నారు. నిజానికి ఇదేనా మీ పని? శక్తివంతమైన సైనిక బలగం ఉండి చేయాల్సిన పని ఇదేనా?’ అని ప్రశ్నించారు. అమెరికా నౌకలను తమ తొలి క్షిపణి దాడే సముద్రంలో ముంచేస్తుందని చెప్పారు. అక్కడ ఉన్న అమెరికా సైనికులు కూడా చనిపోతారని, భూతల దాడులకు వచ్చే సైనికులను బందీలుగా పట్టుకుంటామని తెలిపారు. ప్రతి బందీకి బిలియన్ డాలర్లు సంపాదిస్తామని అన్నారు. కాల్పుల విరమణను కొనసాగించడాన్ని తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తానని రెజారు చెప్పారు.
కొనసాగుతున్న దౌత్య యత్నాలు
ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత చర్చల కోసం దౌత్య యత్నాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ సైనిక దళాల ప్రధానాధికారి అశిం మునీర్ గురువారం టెహ్రాన్‌లో ఇరాన్ అధికారులతో సమావేశమయ్యారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో టెలిఫోన్ సంభాషణ జరిపారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ప్రపంచానికి అవసరమని తెలిపారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, భద్రతను, చట్టబద్ధమైన హక్కులను గౌరవించాల్సిందేనని అంటూ అలాగే కీలక జలమార్గంలో నౌకలు స్వేచ్ఛగా రాక పోకలు సాగించడానికి అవకాశం కల్పించాలని సూచించారు. ఇదిలావుండగా ఇరాన్-అమెరికా శాంతి యత్నాలు, ప్రాంతీయ భద్రత గురించి చర్చించేందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఖతార్ చేరుకున్నారు. ఆయన ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీతో చర్చలు జరుపుతారు. ఇదిలావుండగా హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల ప్రయాణా నికి ఎదురవుతున్న ఆటంకాలపై చర్చించేందుకు యూరోపి యన్ నేతలు శుక్రవారం పారిస్‌లో సమావేశమవు తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్‌లు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఇటలీ ప్రధానిపై ట్రంప్ ఆగ్రహం
రెండు రోజుల క్రితం శాంతి వచనాలు పలికిన పోప్ లియోపై విమర్శలు గుప్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై కస్సుబుస్సు లాడారు. ఒకప్పుడు తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న యూరోపియన్ భాగస్వామిపై అక్కసు వెళ్లగక్కారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ జరిపిన యుద్ధానికి ఆమె మద్దతు ఇవ్వకపోవడమే ఈ ఆగ్రహానికి కారణం. ప్రముఖ ఇటలీ దినపత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ‘ఆమె ఎంతో ధైర్యవంతురాలని అనుకున్నాను. కానీ పొరబడ్డాను’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ట్రంప్ జరిపిన దాడులకు మెలోనీ నేరుగా స్పందించలేదు. గత నెలలో ఇటలీలో జరిగిన ఓ రెఫరెండంలో ఆమె ఓటమి చెందారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధా నికి మద్దతు ఇస్తే మరింత ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమోనన్న భయం ఆమెను వెంటాడుతోంది. కాగా తమ మధ్య ఉన్న స్నేహబంధం దెబ్బతిన్నదని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. ‘ఆమె సానుకూలంగా లేరు. ఇరాన్ విషయంలో మాకు సహాయం చేయడానికి నిరాకరించిన వారితో మునుపటి సంబంధం ఉండదు’ అని అన్నారు.
మరోసారి క్రీస్తు ఫొటోతో…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో జీసస్ క్రీస్తు పోస్టుతో ముందుకొచ్చారు. అయితే ఈసారి తనను జీసస్‌తో పోల్చుకోలేదు. జీసస్ తన భుజంపై చేయి వేసిన దృశ్యాన్ని తాజా పోస్టులో చూపించారు. ట్రంప్ తనను తాను జీసస్‌లా చిత్రీకరిస్తూ వివాదాస్పద ఏఐ ఇమేజ్‌ని పోస్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో తన రెండో పోస్టులో ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చిత్రంలో జీసస్, ట్రంప్ ఇద్దరూ కళ్లు మూసుకొని ఉన్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో తెల్లని వస్త్రాలు ధరించిన క్రీస్తు ట్రంప్ భుజంపై చేయి వేశారు. వారిద్దరూ ప్రార్ధనలో లేదా గంభీరమైన ధ్యానంలో ఉన్నట్లు చూపారు. వారి తలల వెనుక మధ్యలో అమెరికా పతాకం అస్పష్టంగా కన్పిస్తోంది. అంతేకాక ప్రకాశవంతమైన, దివ్యమైన కాంతి లేదా వెలుగు కూడా కన్పించింది.
ఆచితూచి అడుగేస్తున్న చైనా ఇరాన్, అమెరికాలతో సత్సంబంధాలు
మధ్యవర్తిత్వానికి సంసిద్ధత…ఆసక్తి చూపని వాషింగ్టన్
హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో చైనా ప్రధాన సవాలును ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఇరాన్ ముడి చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్నది చైనాయే. చైనా నౌకలను అమెరికా అడ్డుకుంటుండడంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశాలు కన్పిస్తు న్నాయి. వచ్చే నెల 14-15 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఆ పర్యటనను వాయిదా వేసేందుకు ఇరు దేశాలు సుముఖం గా ఉన్నాయని తెలుస్తోంది. ఇరాన్‌కు ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశం పైన అయినా యాభై శాతం సుంకాన్ని విధిస్తానని ట్రంప్ చేసిన హెచ్చరిక కూడా వివాదానికి కారణమవు తోంది. ఇరాన్‌కు గగనతల రక్షణ క్షిపణులను సరఫరా చేసేందుకు చైనా సిద్ధంగా ఉన్నదంటూ అమెరికా ఇంటెలిజెన్స్ నమ్ముతోందని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈ వార్తను చైనా తోసిపుచ్చింది.
హార్ముజ్ ప్రాంతంలో తమ నౌకలు ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జన్ చెప్పారు. ఇరాన్‌తో తమకు వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ‘మేము వారిని గౌరవిస్తాం. మా వ్యవహారాలలో ఇతరులు జోక్యం చేసుకోకూడ దని అనుకుంటున్నాం’ అని అన్నారు. చైనాకు సంబంధించినంత వరకూ హార్ముజ్ ఇరాన్ నియంత్రణలోనే ఉన్నదని, తమ కోసం అది తెరిచే ఉన్నదని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇరాన్‌ను చర్చలకు ఒప్పించడంలో చైనా పోషించిన పాత్రను ట్రంప్ గతంలో ప్రశంసించారు. చైనా దృష్టిలో అమెరికాతో సంబంధాలకు ప్రాధాన్యత ఉంది. తమ విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ఇతర దేశాలకు చెందిన సహచర మంత్రులకు 26 ఫోన్ కాల్స్ చేశారని, హార్ముజ్‌ను తిరిగి తెరవడం, కాల్పుల విరమణపై ఐదు సూత్రాల ప్రణాళికను ముందుకు తెచ్చారని చైనా అధికారులు గుర్తు చేశారు.
ఇరాన్‌ను ఒంటరిని చేయాలని అమెరికా అనుకుంటున్నప్పటికీ టెహ్రాన్‌తో చైనా, రష్యాలకు మంచి సంబంధాలే ఉన్నాయి. అమెరికా ఒత్తిడికి తలవంచి ఇరాన్‌తో సంబంధాలను కుదించుకున్న భారత్ మాదిరిగా కాకుండా టెహ్రాన్‌తో వివిధ కోణాలలో చైనా సంబంధా లను నెరపుతోంది. ఘర్షణను నివారించేందుకు ఇప్పటి వరకూ ఇరాన్‌కు చైనా పరోక్ష మద్దతు మాత్రమే ఇస్తోంది. ఇరాన్‌కు సైనిక పరంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడ డం లేదు. 2015లో అణు ఒప్పందం కుదురడానికి ముందు ఇరాన్‌పై ఐరాస విధించిన ఆర్థిక ఆంక్షలను బీజింగ్ సమర్ధించింది. మరోవైపు చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఆసక్తి చూపుతున్నారు. చైనా అభ్యర్థనపై తైవాన్‌తో ఆయుధ విక్రయ ఒప్పందాన్ని కూడా అమెరికా జాప్యం చేస్తోంది.
చైనా తన చమురు దిగుమతులలో 40 శాతం వరకూ హార్ముజ్ పైనే ఆధారపడుతోంది. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ నివారణకు మధ్యవర్తిత్వం వహించడానికి చైనా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పటికీ వాషింగ్టన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. హార్ముజ్‌లో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన తీర్మానంపై ఈ నెల 7న భద్రతా మండలిలో ఓటింగ్ జరిగినప్పుడు చైనా, రష్యా వీటో చేశాయి. ఇరాన్‌కు చైనా వ్యూహాత్మక భాగస్వామే అయినప్పటికీ సైనిక పరంగా నేరుగా జోక్యం చేసుకోకపోవడం గమనార్హం.
తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి సాధించిన చైనా
ప్రస్తుత సంవత్సరంలో తొలి త్రైమాసిక కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ ఐదు శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ జరిపిన యుద్ధం కారణంగా అనేక దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్న తరుణంలో అంచనాలకు మించి చైనా వృద్ధి రేటును సాధించడం గమనార్హం. జనవరి-మార్చి కాలంలో జీడీపీ 33.4 ట్రిలియన్ యువాన్లు (4.87 ట్రిలియన్ డాలర్లు) సాధించింది. గత సంవత్సరపు నాలుగో త్రైమాసికంతో పోలిస్తే ఇది 0.5 శాతం పాయింట్లు అదనం. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) గురువారం ఈ గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభమైన చైనా పదిహేనవ పంచవర్ష ప్రణాళికా కాలానికి ఇది శుభారంభమని ఎన్‌బీఎస్ తెలిపింది.
దౌత్య యత్నాలకు మద్దతిస్తాం : జపాన్
టోక్యో: ఇరాన్, అమెరికా మధ్య తుది ఒప్పందం కుదరడానికి జరిగే దౌత్య యత్నాలకు మద్దతు ఇస్తామని జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొటేగి చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఆయన టెలిఫోన్‌లో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
ప్రపంచం శాంతి సందేశాన్ని వినాలి : పోప్ లియో
ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న పోప్ లియో మరోసారి ఐక్యత, శాంతి సందేశాన్ని వినిపించారు. ప్రపంచం ఈ సందేశాన్ని వినాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఇరాన్ యుద్ధంపై పోప్ వైఖరిని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ తప్పుపడుతున్న సమయంలో ఆయన మరోసారి శాంతి సందేశాన్ని వినిపించడం గమనార్హం. అల్జీరియా నుంచి కామెరూన్ వెళుతూ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ‘మనకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వేర్వేరు పద్ధతులలో ప్రార్థనలు చేస్తాము. ప్రజల జీవన శైలి భిన్నంగా ఉంటుంది. అయినా మనమందరం కలిసి శాంతిలోనే జీవిస్తున్నాం’ అని ఉద్బోధించారు. ఈ తరహా సందేశాన్ని నేడు ప్రపంచం వినాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. కాగా ట్రంప్, పోప్ మధ్య నెలకొన్న వివాదంపై ఆఫ్రికన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తనను జీసస్‌గా చిత్రీకరిస్తూ ఇటీవల ట్రంప్ పెట్టుకున్న పోస్ట్ వివాదాన్ని మరింత ముదిరేలా చేసిందని పలువురు కాథలిక్కులు అభిప్రాయ పడ్డారు. అనేక మంది ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. తనను జీసస్‌లా చిత్రీకరించుకోవడం ద్వారా ట్రంప్ గీత దాటారని విమర్శించారు.
లెబనాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు
దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే చివరి బ్రిడ్జిని ఇజ్రాయిల్ దళాలు ధ్వంసం చేశాయి. దాడిలో బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైందని, మరమ్మతులకు కూడా పనికి రాకుండా పోయిందని లెబనాన్ భద్రతాధికారి ఒకరు చెప్పారు. జహ్రానీ నది దక్షిణ ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయిల్ సేనలు ప్రజలను హెచ్చరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న బాంబు దాడులను స్వతంత్ర హక్కుల నిపుణులు తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ న్యాయ క్రమాన్ని ఈ దాడులు ఉల్లంఘిస్తున్నాయని, ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారని, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ఉత్తర గాజాలోని బెయిల్ లహియా ప్రాంతంపై ఇజ్రాయిల్ జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం కింద ఏర్పాటు చేసిన సరిహద్దుకు సమీపంలో ఈ దాడి జరిగింది.



