– తెలంగాణలో 36 శాతానికిపైగా కౌలు రైతులే
– అయినా వారికి వర్తించని ప్రభుత్వ పథకాలు
– అటకెక్కిన 2011 భూ ఆధీకృత సాగుదారుల చట్టం
– ఎన్నికల మ్యానిఫెస్టోలో కౌలు రైతులకిచ్చిన హామీలు బుట్టదాఖలు
– పెట్టుబడికి అప్పులే దిక్కు…
– పంట దిగుబడిరాక ఆత్మహత్యల పాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘రేవంత్‌రెడ్డి సారూ.. కౌలు రైతులను గుర్తించండి’ అనే డిమాం డ్ ఊపందుకుంటున్నది. ఇంది రమ్మ రైతు భరోసా, పంటల బీమా, రైతులు చనిపోతే ఇచ్చే పరిహారం, వ్యవసాయ సబ్సిడీలు, బ్యాంకు రుణాలు… ఇలా వ్యవసాయ ఆధారిత పథ కాలకు నోచుకోలేకపోతున్నారు. కౌలు రైతుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన 2011 భూ ఆధీకృత సాగుదారుల చట్టం అటకెక్కింది. రేవంత్‌రెడ్డి సర్కారు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కౌలు రైతులను ఆదుకుంటామనే హామీ కూడా ఉంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా కౌలురైతులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పట్టాలెక్కలేదు. దీంతో కౌలుకు, పెట్టుబడులకు కోసం అప్పులు చేసి..పంట దిగబడి రాక కౌలు ఆత్మ హత్యలు చేసుకుంటున్న ఘటనలు తీవ్రమవుతున్నాయి.
తెలంగాణలో సాధారణంగా ఏప్రిల్ ద్వితీయ, మే మొదటి మాసంలో భూ యజమాను లకు, కౌలు రైతులకు మధ్య ఒప్పం దాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో కౌలురైతులకు గుర్తింపు ఇవ్వడంతో పాటు వారి హక్కు లను కాపాడాలనే ఉద్యమం క్రమంగా తీవ్రమవుతున్నది.
అడుగడుగునా అన్యాయమే…
తెలంగాణలో 72 లక్షల కమతాలున్నాయి. కోటీ 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వాటిలో 40 శాతం మేరకు భూములను కౌలు రైతులే సాగుచేస్తున్నారని బ్యాంకర్ల కమిటీ రిపోర్టు చెబుతున్నది. రాష్ట్రంలో 22 లక్షల మంది కౌలు రైతులున్నారు. కౌలు రైతుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వారే ఉన్నారు. గ్రామాల్లో భూములను బట్టి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు నడుస్తున్నది. కౌలు రైతులు తాము సాగు చేసే భూములకు కౌలు కట్టడంతో పాటు పెట్టుబడి భారాన్ని భరించాల్సి వస్తున్నది. ఐదెకరాలు కౌలుకు తీసుకుంటే లక్ష రూపాయలకుపైగా కట్టాల్సి వస్తున్నది. సాగుకు భూమిని సన్నద్ధం చేయడం, విత్తనాలు, ఎరువులు, కూలీలకు ఇలా పెట్టుబడి కోసం మరో రెండు, మూడు లక్షలు ఖర్చుపెట్టాల్సి వస్తున్నది. ఒక వేళ పంట దిగుబడి సరిగా కాకపోయినా, పంట చేను బాగా అయినా దిగుబడి సమయంలో వచ్చే అకాల వర్షాల వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. పెట్టుబడి సాయం కోసం ప్రయివేటుగా తెచ్చిన అప్పులు, వడ్డీలు కట్టలేని దుస్థితి నెలకొంటున్నది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు వీరికి దక్కడం లేదు. రైతు భరోసా భూ యజమానుల ఖాతాల్లోనే పడిపోతున్నది. యూరియా కొనుగోలు చేయాలన్నా, విధిగా భూ యజమాని వివరాలు, తంబ్ అడుగుతున్నారు తప్ప కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. పంట అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళ్తే అక్కడా భూ యజమాని వివరాలే అడుగుతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట ప్రకృతి విపత్తులతో దెబ్బతింటే వచ్చే పంట నష్టపరిహారం కూడా కౌలు రైతులకు దక్కట్లేదు. అ డబ్బులు నేరుగా భూ యజమానుల ఖాతాల్లోనే పడిపోతున్నాయి.
కాంగ్రెస్ హామీలు అమలయ్యేదెన్నడో…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నది. ‘కౌలు రైతులను మేం గుర్తించబోం’ అని కేసీఆర్ ప్రకటించగా…తాము కౌలు రైతులకు అండగా ఉంటామని 2023 సెప్టెంబర్ 13న బహిరంగ లేఖను అప్పటి పీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ‘పంట రుణాలు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం, బీమా, ఇలా ఏ సాయం అందక మీరు నరకయాతన అనుభవిస్తున్నారు….40 శాతం మేర భూమిని మీరే సాగు చేస్తున్నారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడి కోసం ప్రయివేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సి వస్తున్నది. పంట నష్టపోయితే పరిహారం అందక, అధిక వడ్డీ భారంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో మీరే 80 శాతం ఉండటం విషాదకరం…కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతులను గాలికొదిలేశాయి…వారిని ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది. కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తాం. మెరుగైన పంట బీమా పథకాన్ని తీసుకొచ్చి నష్టపరిహారం అందేలా చూస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి రుణాలతో సహా అన్ని పథకాలనూ వర్తింపజేస్తాం. గతంలో కౌలు రైతుల గుర్తింపు చట్టం చేసింది కూడా కాంగ్రెస్సే….’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కౌలు రైతులకు బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా మార్గదర్శకాలపై డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో వేసిన మంత్రుల సబ్‌కమిటీ ఐదు జిల్లాల్లో ప్రజాభిప్రాయాలు సేకరించినప్పుడు కూడా భూ యజమానులకు కాకుండా ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో వారికే రైతు భరోసా ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అయినా, ప్రభుత్వం దాన్ని విస్మరించింది. రైతు భరోసా డబ్బులు కౌలు రైతులకు ఇవ్వడమనే చర్చే లేదు. పంట నష్టపరిహారం, పంట అమ్ముకున్నప్పుడు వచ్చే డబ్బులు భూ యజమానుల ఖాతాల్లోనే పండిపోతుండగా..కౌలు రైతులకు రిక్తహస్తమే మిగులుతున్నది. కౌలు రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి పలు సూచనలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి ఫిబ్రవరి నెలలో లేఖ కూడా రాశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి విధానపరమైన నిర్ణయమూ వెల్లడి కాలేదు.
చట్టమున్నా గుర్తింపేది..?
కౌలు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నది. అందు లో భాగంగానే కౌలు రైతుల గుర్తింపు కోసం భూ ఆధీకృత సాగుదారుల చట్టం-2011 వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత రెండేండ్ల వరకు కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు(ఎల్ఈసీ) ఇచ్చారు. ఈ కార్డుల ఆధారంగా రూ.23 కోట్ల రుణాలు కూడా పొందారు. ఆ తర్వాత పాలకులు దాన్ని క్రమంగా తగ్గిస్తూ 2019 వరకు కొంత మేరకు కార్డులిచ్చారు. వాటివల్ల కౌలు రైతులు ప్రయోజనం కూడా పొందారు. ఆ తర్వాత పాలకులు ఎల్ఈసీ ఇవ్వడాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులిస్తే ప్రభుత్వంపై పైసా భారం కూడా పడదు. పైగా, కౌలు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. గుర్తింపు కార్డులుంటే రైతు బీమా, పంట నష్టపరిహారం, పంట బీమా వర్తిం చే అవకాశాలుంటాయి. కౌలు రైతులకు ఎలాంటి షూరిటీ లేకుండా రూ.2.5 లక్షల వరకు రుణాలి వ్వాలని ఆర్బీఐ 2025లో గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఆచరణలో మాత్రం ఏ ఒక్క బ్యాంకు కూడా కౌలు రైతులకు రుణాలివ్వడం లేదు.
పెట్టుబడి సాయాన్ని వాస్తవ సాగుదారులకే ఇవ్వాలి : టి.సాగర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రైతు భరోసా పేరిట భూ యజమానుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని వేయడం సరిగాదు. పెట్టుబడి సాయాన్ని వాస్తవ సాగుదారులకే ఇవ్వాలి.
కౌలు రైతుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన 2011
చట్టాన్ని అమలు చేయాలి. రుణ అర్హత కార్డులను వెంటనే ఇవ్వాలి. వ్యవసాయరంగంలో ఇచ్చే ప్రభుత్వ పథకాలన్నీ
కౌలు రైతులకు వర్తించేలా నిర్ణయం తీసుకోవాలి. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. తద్వారానే
కౌలు రైతుల ఆత్మహత్యలను నివారించగలుగుతాం.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి : విస్సా కిరణ్, రైతు స్వరాజ్య వేదిక
తక్షణమే 2026 మే నుంచి కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి. 2011 చట్టం అమలు గురించి విస్తృత ప్రచారం చేసి కౌలు రైతులను ప్రోత్సహించాలి. భూ యజమానులకు వారి భూమి హక్కులకు ఎలాంటి సమస్య రాదనే విషయాన్ని రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించాలి. గుర్తింపు కార్డు ఆధారంగా అన్ని ప్రభుత్వ పథకాలను వాస్తవ సాగుదారులకు అందించాలి. బ్యాంకర్ల కమిటీ ద్వారా నిర్ధిష్టమైన ఆదేశాలిచ్చి ఎల్ఈసీ కార్డు ఆధారంగా పంట రుణాలివ్వాలి. పంట అమ్ముకునే కౌలు రైతుల ఖాతాల్లోనే డబ్బులు పడేలా చూడాలి.



