– మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతీయ మహిళా సంఘాల స్పష్టత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
షరతులతో కూడి మహిళా రిజర్వేషన్ బిల్లును తాము అంగీకరించబోమనీ, దాన్ని తిరస్కరిస్తున్నామని జాతీయ మహిళా సంఘాలు స్పష్టం చేశాయి. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నారీ శక్తి వందన్ చట్టం (ఎన్‌ఎస్‌వీఏ) సవరణలను తొందరపాటు, తగిన ప్రజాస్వామ్య ప్రక్రియ లేకుండా ఆమోదించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాయి. ఆ బిల్లును, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు, పౌర సమాజ సమూహాలతో సహా సంబంధిత వర్గాలన్నింటినీ సంప్రదించకుండా ఆమోదించకూడదని హెచ్చరించాయి. అటువంటి సంప్రదింపులు లేకపోవడం భాగస్వామ్య ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు గురువారం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్‌ఎఫ్‌ఐడబ్య్లూ), ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఏఐడీడబ్య్లూఏ), ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ (ఏఐపీడబ్ల్యూఏ), ఆల్ ఇండియా కోఆర్డినేషన్ (పీవోడబ్ల్యూ-పీఎంఎస్-ఐజేఎం) ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలుకు జోడించిన ఎలాంటి షరతులనైనా తాము తిరస్కరిస్తున్నట్టు తెలిపాయి. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం కోసం చేసిన డిమాండ్ 30 ఏండ్లకుపైగా సాగిన నిరంతర పోరాట ఫలితమని పేర్కొన్నాయి. న్యాయాన్ని ఆలస్యం చేసే షరతుల ద్వారా దీనిని నీరుగార్చడం గానీ, వాయిదా వేయడం గానీ సాధ్యం కాదని తెలిపాయి. అమలుకు ముందస్తు షరతుగా ఈ దశలో హడావిడిగా సీట్లను పెంచాలన్న ఏ ప్రతిపాదననూ తాము అంగీకరించబోమని స్పష్టం చేశాయి. పెంచిన సీట్లను ఎలా విభజిస్తారనే దానిపై స్పష్టత లేదని విమర్శించాయి. ఇటువంటి చర్య అధికార పార్టీల పితృస్వామ్య మనస్తత్వానికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నాయి. ఇది మహిళా ప్రాతినిధ్యాన్ని కల్పించడం కాక, దానిని వాస్తవంగా సాకారం చేయడాన్ని వాయిదా వేయడానికి వేసిన ఎత్తుగడ అని పేర్కొన్నాయి. మహిళా రిజర్వేషన్‌కు జనాభా లెక్కలతో సంబంధం లేదనీ, అందువల్ల రిజర్వేషన్ల అమలును ఎప్పుడో జరగబోయే జనాభా లెక్కలతో ముడిపెట్టడం అనిశ్చితిని సృష్టించి, నిర్లక్ష్యానికి దారి తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ దేశ మహిళలు శాసనసభల్లో తమ న్యాయమైన స్థానం కోసం చాలా కాలంపాటు తీవ్రంగా పోరాడారని గుర్తు చేశాయి. మరోసారి మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, నిర్ణయాధికార సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల ప్రయోజనాలు పొందేందుకు ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్ని స్తోందని తెలిపాయి. ఈ కొత్త బిల్లు, జనగణన, డీలిమిటేషన్‌కు సంబంధించిన మునుపటి నిబంధనల్లో సవరణలను ప్రతిపాదిస్తున్నదని తెలిపాయి. ఎన్నికల ప్రక్రియల మధ్యలో ఇంతటి ముఖ్యమైన బిల్లును తీసుకురావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నాయి. ఎన్నికల మధ్య ఇంతటి భారీ చట్టాన్ని ఆమోదించడం అన్ని ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని తెలిపాయి.
2023 బిల్లులో జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌కు సంబంధించిన షరతులను తొలగించి, గతంలో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలి
ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్‌ను మహిళా రిజర్వేషన్లలో చేర్చాలి. ఓబీసీ మహిళల రిజర్వేషన్ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
మహిళా రిజర్వేషన్ జనాభాపై ఆధారపడి ఉండదు కాబట్టి డీలిమిటేషన్‌తో దీనిని ముడిపెట్టడం పూర్తిగా తప్పు.
మహిళా రిజర్వేషన్ అనేది ఒక ప్రత్యేకమైన అంశం దీనిని ఇతర ఎజెండాల నుంచి వేరు చేయాలి
సంబంధిత వర్గాలన్నింటితో సరైన సంప్రదింపులు జరపాలి
ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగకుండా, తొందరపాటుతో బిల్లును ఆమోదించే ఏ ప్రయత్నాన్నైనా ఉపసంహరించుకోవాలి
ఈ పోరాటానికి నాయకత్వం వహించిన మహిళా సంఘాలు, మోడీ ప్రభుత్వం ఇటువంటి కుతంత్రాల ద్వారా దీనిని హైజాక్ చేస్తున్నది.
ఆ షరతులు అంగీకరించం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



