Friday, April 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమిల్లర్ల పిటిషన్లపై ముగిసిన వాదనలు

మిల్లర్ల పిటిషన్లపై ముగిసిన వాదనలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మిల్లింగ్‌ కోసం సరఫరా చేసిన వారిని దారి మళ్లించారనీ, అలాగే ప్రభుత్వానికి ధాన్యం నిల్వలకు సమానమైన రూ.3,960 కోట్ల బకాయిలు చెల్లింపుల వివాదంలో నమోదైన కేసులను కొట్టేవేయాలని కోరుతూ రైస్‌ మిల్లర్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తమపై పౌరసరఫరాల కార్పొరేషన్‌ నమోదు చేసిన క్రిమినల్‌ కేసులను కొట్టేయాలంటూ వందల సంఖ్యలో రైస్‌మిల్లు యజమానులు వేసిన పిటిషన్లను జస్టిస్‌ జె.శ్రీనివాసరావు గురువారం విచారించారు. మిల్లర్లపై కేసులు అన్యాయమనీ, ప్రభుత్వ విధానాన్ని అనుసరించే ధాన్యాన్ని పబ్లిక్‌ వేలంలో అమ్మామని లాయర్‌ చెప్పారు. ఈ వాదనలను పోలీసుల తరఫున పీపీ వ్యతిరేకించారు. మిల్లర్లు డబ్బును ప్రభుత్వానికి చెల్లించకుండా దారి మళ్లించారన్నారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది
కింది కోర్టు ఉత్తర్వుల అమలు నిలిపివేత
మేడ్చల్‌ మల్కాజిగిరి కాప్రాలోలోని 90 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తులు లోక్‌అదాలత్‌లో మోసపూరితంగా రాజీ చేసుకున్న వ్యవహారంలో వెలువడిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. ఆ ఉత్తర్వులు పొందిన ప్రయివేట్‌ పార్టీలకు నోటీసులు ఇచ్చింది. విచారణను జూన్‌ 15కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన బెంచ్‌ గురువారం ఆదేశాలిచ్చింది. కాందిశీకుల భూమిని ఆస్తి పంచుకున్నట్లుగా రికార్డులు తయారు చేసి లోక్‌అదాలత్‌ ద్వారా అవార్డు పొంది ఆపై కింది కోర్టు నుంచి అమలుకు ఆదేశాలు పొందారని, ఇది సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకమని ప్రభుత్వం వేసిన పిటిషన్‌లో హైకోర్టు స్టే ఆదేశాలిచ్చింది.
కోర్టుకు హాజరైన ఐఏఎస్‌
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేవెళ్ల, వికారాబాద్‌, పరిగి, తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాలకు మిషన్‌ భగీరథ కింద తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఎన్‌సీసీకి చెల్లించాల్సిన రూ.180 కోట్ల బకాయిలను ఈనెల 23లోగా 30 శాతం చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఈ మేరకు స్వయంగా హైకోర్టుకు హాజరైన ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా తెలియజేశారు. ఈ హామీని అమలు చేయకపోతే తదుపరి విచారణకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అమలు చేస్తే హాజరు నుంచి మినహాయింపునకు అనుమతించారు. విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.
ఆదేశాలు అమలా.. కోర్టుకు వస్తారా..
కింది కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం అమలు చేయాలన్న గత ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి గత ఆదేశాలను అమలు చేయనిపక్షంలో వారిద్దరూ వ్యక్తిగతంగా హైకోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. 2004లో మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు జారీ చేసిన నోటిఫికేషన్‌ వెలువడినప్పటికీ ఉద్యోగాల్లో 2005లో చేరారు. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాల్లో చేరినవారికి ఒకే పెన్షన్‌ విధానం ఉండాలని కొందరు ఉద్యోగులు హైకోర్టుకు వచ్చారు. గత ఆదేశాల్ని అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. పిటిషనర్లు కోరిన మేరకు పెన్షన్‌ పథకం అమలు చేయాలనీ, ఈ మేరకు జూన్‌ 10లోగా అమలు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లేని పక్షంలో ఆర్థికశాఖ, న్యాయశాఖ కార్యదర్శులు వ్యక్తిగతంగా హాజరుకావాలంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -