Friday, April 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహిందూ రాజ్యంగా మార్చే కుట్ర

హిందూ రాజ్యంగా మార్చే కుట్ర

- Advertisement -

చిన్న రాష్ట్రాల అస్థిత్వానికి పెను ప్రమాదం
మహిళా బిల్లును అడ్డం పెట్టి గట్టెక్కేందుకు బీజేపీ కుతంత్రం
అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
18న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకే మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం డీలిమిటేషన్‌ను హడావిడిగా ముందుకు తీసుకొచ్చిందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో ‘సమాఖ్య రాజ్యాంగానికి తూట్లు పొడిచే డీలిమిటేషన్‌’ అంశంపై నిర్వహించిన అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వివిధ ప్రజా సంఘాల నేతలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై మాట్లాడారు.

హడావిడిగా డీలిమిటేషన్‌తో బీజేపీ కుట్ర : జాన్‌వెస్లీ
2026 జనగణన లెక్కల తర్వాత చేయాల్సిన డీలిమిటేషన్‌ను హడావిడిగా చేయడంలో బీజేపీ కుట్ర కోణం దాగుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ్లఅన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ రాజ్యం, వన్‌ ఎలక్షన్‌-వన్‌ నేషన్‌, డీలిమిటేషన్‌ మొదలగు ప్రమాదకర చర్యలకు కాషాయదళం తెర లేపిందని తెలిపారు. తమ లక్ష్య సాధనకు అడ్డుగా ఉన్న దక్షిణాది ప్రాముఖ్యతను తగ్గించి, రాజకీయంగా లాభపడాలని కేంద్రం చూస్తోందన్నారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ప్రజా క్షేత్రంలో విస్తృత చర్చల అనంతరం ఏకాభిప్రాయం ద్వారా ముందుకెళ్లాలని కేంద్రానికి సూచించారు.

సవరణల పేరుతో మరణ శాసనాలు
సవరణల పేరుతో రాజ్యాంగానికి మరణ శాసనాలు చేస్తున్నారని కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేండ్లు శ్రమించి తయారు చేసిన రాజ్యాంగాన్ని.. మూడ్రోజుల్లోనే మార్చేస్తారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌ ప్రతిపాదిత బిల్లులో పునర్విభజన ఎలా నిర్వహిస్తారనే అంశం లేకపోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లెక్కలేనితనం వల్ల మన లెక్కలు మారిపోతున్నాయనీ, ఇలా చేస్తే రాజ్యాంగం ఏమైపోతుందోననే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటినీ మానిప్యులేట్‌ చేస్తారనీ, చివరికి ఎన్నికల కమిషన్‌ను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.

చిన్న రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే యత్నం
కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ పేరుతో చిన్న రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్‌ చేస్తున్నారో స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా డీలిమిటేషన్‌ ప్రక్రియను మలుచుకుంటూ, ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణను అందరం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

18న నిరసన ర్యాలీ
బీజేపీ ప్రతిపాదిత డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ ఈ నెల 18 హైదరాబాద్‌లో నిరసన ర్యాలీ నిర్వహించాలని అఖిల పక్ష సమావేశం తీర్మానించింది. ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి నిజాం కళాశాల జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. డీలిమిటేషన్‌ బిల్లులను ఆమోదించేంచుకు ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణను సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిం చింది. కాగా ర్యాలీకి సీపీఐ(ఎం), సీపీఐతో పాటు పలు పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

మహిళా రిజర్వేషన్లను అడ్డంపెట్టి డీలిమిటేషన్‌
మహిళా రిజర్వేషన్లను అడ్డం పెట్టి డీలిమిటేషన్‌ బిల్లును తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము మహిళా రిజర్వేషన్ల బిల్లును సమర్థిస్తున్నామనీ, అదే సందర్భంలో డీలిమిటేషన్‌ను ఏకాభిప్రాయం తర్వాత తేవాలన్నారు. కేంద్రం ఆదేశాలు పాటించి కుటుంబ నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదిత డీలిమిటేషన్‌పై ఆలోచించాలన్నారు. ప్రముఖ పర్యావరణ వేత్త దొంతి నర్సింహరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో డీలిమిటేషన్‌ అవసరం లేదన్నారు. ప్రస్తుతమున్న 543 మంది ఎంపీల్లో ఎంత మంది ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎంపీల సంఖ్యను పెంచడం రాజకీయ నిరుద్యోగానికి పదవులు కల్పించడం తప్ప మరేం కాదన్నారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోక పోయిన జరుగుతున్న వాస్తవం ఇదేనని స్పష్టం చేశారు. తెలంగాణ సమాఖ్య కన్వీనర్‌ కరుణాకర్‌ దేశాయి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు పాశం యాదగిరి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ.అబ్బాస్‌, న్యూ డెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్దన్‌, హైకోర్ట్‌ న్యాయవాది శారదాగౌడ్‌, టీపీఎస్‌కే నాయకులు జి.రాములు, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌, జై స్వారాజ్‌ పార్టీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, మోహన్‌రెడ్డి, జితిన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -