సోషల్ మీడియాను విస్తృతంగా వాడాలి : ఏఐకేఎస్ మాజీ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలను చూపేందుకు సోషల్‌మీడియాను విస్తృతంగా వాడాలనీ, పాలకులు అనుసరిస్తున్న వ్యవసాయక వ్యతిరేక విధానాలపై పోరాడేలా రైతులను చైతన్యం చేయాలని అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) మాజీ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మూడ్ శోభన్ అధ్యక్షతన సోషల్ మీడియా రాష్ట్రస్థాయి వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. రైతులందరికీ సోషల్ మీడియా ద్వారా వార్తలు, భావజాలం చేరే విధంగా నెట్వర్క్‌ను విస్తరించాలని సూచించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై విశ్లేషణలు చేయాలన్నారు. తక్షణ సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు.
సమస్యల శాశ్వత పరిష్కారాలకు, సమాజానికి ఉన్న లింకును రైతాంగానికి అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. రైతాంగ సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వాటి పట్ల నిరంతరం సంఘీభావం ప్రదర్శించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, భావజాలం ఏ రూపంలో ప్రవేశిస్తున్నాయి? వాటి ప్రభావమేంటి? అన్న అంశాలను గమనించి ఎండగట్టాలన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ పై కమిటీలు ఉత్పత్తి చేసిన కంటెంట్‌లో అవసరమైన వాటిని షేర్ చేస్తూనే లోకల్ స్థాయిలో స్థానిక సమస్యలపై కంటెంట్ ఉత్పత్తి జరగాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా నిపుణులు పిట్టల రవి సోషల్ మీడియాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పోస్టర్లను ఎలా రూపొందించాలనే అంశంపై ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సోషల్ మీడియా బాధ్యులు వడ్ల భరత్ బోధించారు. ఈ వర్క్‌షాప్‌లో సోషల్ మీడియా రాష్ట్ర కో కన్వీనర్ ఎస్‌కే.మీరా, నిరడి జలంధర్, లెల్లెల బాలకృష్ణ, వాసిరెడ్డి వరప్రసాద్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.



