– మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం
– ఉపాధి హామీ పనుల పరిశీలన
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : వేసవి ఎండల నేపథ్యంలో ఉపాధి కూలీలు తగు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలని మండల ప్రత్యేక అధికారి రాజా గంగారాం అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పల్లె చెరువులో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జరుగుతున్న పూడికతీత పనులను ఆయన, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం మాస్టర్ రోల్ లో కూలీల హాజరును పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధి కూలీల ఉద్దేశించి మాట్లాడుతూ వేసవి అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధి కూలీలు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎండలో పనిచేసే సమయంలో తరచూ నీరు తాగడం,తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం,మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, అవసరమైనప్పుడు ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా నీరసం, అలసట వంటి సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల్లో కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న కూలీలకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మంజురాణి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ రమ, మేట్లు, తదితరులు పాల్గొన్నారు.



