నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో గురువారం నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ కృష్ణ తేజ, శ్రీజన్ పాల్గొని రైతులకు పలు వ్యవసాయ అంశాలపై అవగాహన కల్పించారు. విశ్వవిద్యాలయం సూచించిన ఆరు ముఖ్యాంశాలపై వివరించిన వారు, రైతులు కేవలం పంటల ఉత్పత్తి వరకు మాత్రమే పరిమితం కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. రైతు సహకార సంఘాల ద్వారా ఉత్పత్తులను విక్రయిస్తే మంచి ధర లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.
రైతు కేవలం వ్యవసాయదారుడిగా కాకుండా ఒక వాటాదారుడిగా, వ్యాపార దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. సేంద్రీయ ధృవీకరణ, డ్రిప్ ఇరిగేషన్ విధానం, నీటి కుంటల ఏర్పాటు, తక్కువ నీటితో సాగు చేసే ఉద్యాన పంటలపై రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బడిస లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.



