భారతీయ చలనచిత్ర రంగంలో మూకీల శకంతో మొదలుకొని టాకీలు వచ్చిన తొలి దశకంలో సినీ పరిశ్రమ నిలదొక్కుకోవడానికి కషిచేసిన వారిలో రూబీ మేయర్ సులోచన, జద్దన్ బాయి, ఫాతిమా బేగం, జుబేదా బేగం.. ఆ తర్వాత దేవికా రాణి వంటి వారిని పేర్కొంటారు. కానీ వారికి సమాంతరంగా కషిచేసిన ఏణాక్షి రామారావును భారతీయ చలనచిత్రకారులు ఏ కారణం చేతనో గానీ విస్మరించారనిపిస్తుంది. చరిత్రలో ఆమెకు చెందాల్సిన స్థానం చెందలేదేమో అనిపిస్తుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో అక్కడక్కడ కొన్ని వాక్యాలుగా కనిపించే ఏణాక్షి రామారావు జీవన రేఖల గురించి రేఖామాత్రంగా తెలుసుకుందాం.
ఏణాక్షి 1910 ఆగస్టు 17న జన్మించింది. మద్రాసులోని బాల్డ్విన్ గర్ల్స్ స్కూల్, క్వీన్ మేరీస్ కళాశాలలో చదువుకుంది. ఆమె తండ్రి బెనిగస్ రామారావు మద్రాసు ప్రెసిడెన్సీలో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేసేవాడు. తల్లి సగుణ సంగీత కళాకారిణి. ఆమె స్వయంగా పియానో వాయించేది. ఎణాక్షి పాశ్చాత్య శైలిలో పియానో, వయోలిన్, దిల్రుబా ఇంకా వీణ కూడా వాయించేదని ఆమె కోడలు మార్జోరీ భవనాని అంటున్నారు. ‘షిరాజ్’ (1928) చిత్రంలో అవకాశం వచ్చినప్పుడు ఏణాక్షికి18 ఏండ్లు. ఈ చిత్ర నిర్మాత హిమాంషు రారు. మార్జోరీ మాటల్లో ”ఈ సినీ అవకాశం ఏణాక్షి సంప్రదాయ కుటుంబంలో ఆందోళన కలిగించింది. అయిష్టంగానే అనుమతి లభించినప్పటికీ, సినిమా షూటింగ్ సమయంలో ఆమెపై కఠినమైన పర్యవేక్షణ ఉండేది”. ఫ్రాంజ్ ఓస్టెన్ తీసిన మూకీ చిత్రం షిరాజ్ (1928) చిత్ర సమీక్షలు ఏణాక్షి రామారావుపై ప్రశంసల వర్షం కురిపించాయి. ఒక యువరాణి పాత్ర పోషించి, హిమాన్షు రారుతో ఆమె నటన గురించి ఒక అమెరికన్ వార్తాపత్రిక ఇలా పేర్కొంది, ”మిస్ ఏణాక్షి రామారావు కెరీర్ గమనించదగినది.
షిరాజ్‌లో ఆమె నటన ఒక్కటే ఆకట్టుకునేలా ఉంది. ఆమె సమయస్ఫూర్తి, మార్గదర్శక స్ఫూర్తి కలిగిన ఒక ప్రతిభావంతమైన యువతి” అని ఆ సమీక్షలలో పేర్కొంటూ, ”మిస్ రావు నూతన భారతదేశానికి ఒక ప్రతీక” అని ప్రకటించింది. తాజ్ మహల్ నిర్మాణానికి సంబంధించిన కల్పిత నాటకం షిరాజ్. దాని నిర్మాణం పూర్తయిన రెండేండ్ల తర్వాత, 1930లో అమెరికాలో విడుదలైంది. ఆమె తక్కువ సినిమాలలో నటించినప్పటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సినిమాతో సంబంధం కొనసాగించింది. ఆమె రెండవ చిత్రం ‘వసంతసేన’ 1931లో మోహన్ భావనాని దర్శకత్వంలో రూపొందింది. అదే ఏడాది ఫిబ్రవరి 6న ఏణాక్షి, భవనానిల వివాహం జరిగింది. ఈ వివాహం ”ఎల్లప్పుడూ వారిద్దరి వైవాహిక జీవితం పని భాగస్వామ్యంగా కొనసాగిందంటుంది” ఆమె కోడలు మార్జోరి.
ఏణాక్షి – భవనానిల గురించి ఆమె కోడలు మార్జోరీ మాట్లాడుతూ ”ఆరు అడుగుల పొడవున్న అతను, కేవలం ఐదు అడుగుల పొడవున్న తన భార్య కంటే చాలా పొడవుగా కనిపించేవాడు” అంటారు. ఇంకా ”వారిద్దరి కలయిక ఇద్దరు ఆసక్తికరమైన వ్యక్తుల కథగా పేర్కొనవచ్చు. వారిద్దరూ వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చినప్పటికీ చలనచిత్రాలు, డాక్యుమెంటరీల నిర్మాణమనే ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు వారు ఏకమై నిరంతరం కషి చేశారు”. మోహన్ భవనాని కూడా హిమాంష్ రారు, వి. శాంతారామ్ లాగే జర్మనీలో చలనచిత్ర నిర్మాణంలో శిక్షణ పొంది, అభివద్ధి చెందుతున్న భారతీయ చలనచిత్ర రంగంలో తన అనుభవాన్ని జోడించడానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు.
1962లో భవనాని మరణం తర్వాత కూడా ఏణాక్షి రామారావు కళారంగంలో తన ప్రమేయాన్ని కొనసాగించింది. చిన్న కథలు రాశింది. భారతదేశం అంతటా తిరిగి జానపద కథలను సేకరించింది. వార్తా పత్రికల కోసం అనేక వ్యాసాలు కూడా రాసింది. 1965 – 1978 మధ్య నాలుగు పుస్తకాలు రాసింది. భారతీయ సినీ సంస్కత రంగాలకు సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఎనలేని సేవలు చేసిన ఏణాక్షి మే 10, 1981న మరణించింది. భారతీయ నత్యాలు, డిజైన్లను పశ్చిమ దేశాలకు పరిచయం చేయడంలో ఏణాక్షి అపారమైన సేవ చేశిందని చాలా మందికి తెలియదు. కాశ్మీర్ కళలు, డిజైన్లను (వస్త్రాలు, కలప, పాపియర్ మాచే) పశ్చిమ దేశాలకు పరిచయం చేయడంలో ఆమె చేసిన కషి ఏమాత్రం తక్కువ కాదు. కొన్నేండ్ల కిందట కేరళలో ఒక అమెరికన్ పర్యాటకుడు శాలువాలు, జాకెట్లు, నమ్దాలు, తివాచీలు మొదలైన కాశ్మీర్ డిజైన్లపై ఆమె చేసిన కషిని గురించి గొప్పగా పేర్కొన్నాడు. ఏణాక్షి వ్యక్తిత్వంలోని ఈ కోణం, ఆమె పని గురించి నాకు తెలియదు కానీ నర్తకిగా, ఫోటోగ్రాఫర్‌గా, నటిగా ఆమె చేసిన కషి మాత్రమే నాకు తెలుసు. ఎణాక్షి రాసిన రెండు పాండిత్య పుస్తకాల గురించి కూడా నాకు తెలిసింది. ఈ రెండు పుస్తకాలు అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో భద్రపరిచారు. అవి: డాన్స్ ఇన్ ఇండియా, డెకోరేటివ్ డిజైన్స్ ఆన్ స్టోన్ అండ్ వుడ్ ఇన్ ఇండియా.
ఏణాక్షి 1950లో కొంతకాలం కాశ్మీర్లో ఉండి కళలు, చేతివత్తులకు సంబంధించిన వివిధ వర్గాల ప్రజలను కలిసింది. ఆమె తన పుస్తకం కోసం లేV్‌ా, కార్గిల్‌ను కూడా సందర్శించింది. ఈ కాలంలో ఆమె కాశ్మీర్ సంస్కతి గొప్పతనాన్ని, సుందరమైన ప్రకతి సౌందర్యాన్ని చిత్రీకరిస్తూ కొన్ని ఛాయాచిత్రాలను కూడా తీసింది. అలాగే ”వేల్ ఆఫ్ కాశ్మీర్” అనే డాక్యుమెంటరీని కూడా చిత్రీకరించింది. ఆమె క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో క్రియాశీల సభ్యురాలు కూడా. ఈ సంస్థ 1964లో కళాకారులకు మద్దతు ఇవ్వడానికి దేశీయంగా, విదేశాలలో వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య వారి కళల సంబంధితంగా, మార్కెట్ ను అనుకూలంగా ఉంచడానికి స్థాపించబడింది. భారతదేశ జానపద నృత్యాలపై ఆమె రాసిన పుస్తకంలో కాశ్మీరీ జానపద నత్యాల అన్ని రూపాలను సోదాహరణంగా వివరించింది.
ఆమె నర్తకి, నటి, ఫొటోగ్రాఫర్ కళలు, హస్తకళలు, సంస్కతిపై పరిశోధనాత్మక రచనలు చేసిన రచయిత్రి.
1928 నుండి 1938 వరకు ఆమె ఆరు చిత్రాలలో కథానాయికగా నటించారు. ఈ ఆరు చిత్రాలలో వసంతసేన, ట్రాప్డ్, జాగరణ్, హిమాలయకి బేటి, యుంగ్రిల్లా ఐదింటికి ఆమె భర్త మోహన్ భవనాని దర్శకత్వం వహించాడు. హిమాన్షు రారు ‘షిరాజ్’ (1929) చిత్రానికి మాత్రమే ఫ్రాంజ్ ఓస్టెన్ దర్శకత్వం వహించారు. రామారావు భావనాని చిత్రాలకు స్క్రీన్‌ప్లేలు కూడా రాశారు, వాటిలో ‘బిస్వీ సది’ (1945) ఒకటి. ఆమె భారతదేశం అంతటా యూరోపియన్ నత్యకారులతో కలిసి విస్తతంగా నత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఇంకా ‘జాగరణ్’ (1936) చిత్రంలో నటించిన ఆమె మణిపురి శైలిలో నత్యం చేశింది. ఆమె తీసిన ఛాయా చిత్రాలు నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి, ముఖ్యంగా ఆమె తీసిన ”ఎ జర్నీ టు లిటిల్ టిబెట్ 1951” అనే సిరీస్ ప్రసిద్ధమైనది.
ఏణాక్షి భారతీయ సిరి రంగంలో ఒక కథానాయక గానే గాక స్క్రిప్ట్ రైటర్ గా నత్యకారిణిగా తనదైన ముద్రను వేసింది. అది మాత్రమే కాకుండా స్వతంత్ర భారతదేశంలో సాంస్కతిక రంగం రూపురేఖలను రికార్డు చేసేందుకు ఆమె చేసిన కషి భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శకంగా నిలిచిపోయింది. అయితే సినీ చరిత్రలో ఆమెకు సరైన స్థానం లభించలేదెమో అనిపిస్తుంది. చరిత్రకందని తెర నాయకగా ఏణాక్షి రామారావు సినీ చరిత్రలో తనదైన ముద్రను వేసిందనడంలో ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండబోదు.
భారతీయ సినీరంగంలో ఒక తొలివెలుగు – మోహన్ భవనాని
ఏణాక్షి రామారావు గురించి రాసినప్పుడు మోహన్ భవనాని గురించి రాయకుండా ఉండలేము. ఎందుకంటే వారిద్దరి సంయుక్త కషి వలన భారతీయ తొలినాటి సినిమారంగం వికాసం చెందడమే కాకుండా స్వాతంత్ర భారతదేశ తొలి దశాబ్దపు కాలంలో దేశ సంస్కతిక కళారంగ పురోభివద్ధికి, చారిత్రాత్మకమైన అంశాలపై పరిశోధనాత్మక డాక్యుమెంటరీల నిర్మాణానికి వారిద్దరి కషి ఎంతైనా ఉన్నది.
మోహన్ దయారామ్ భవనాని ఏప్రిల్ 12, 1901న పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతానికి హైదరాబాద్‌లో జన్మించాడు. ఆయన 1919లో మాంచెస్టర్‌లోని కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఫిల్మ్, ఫోటోగ్రఫీ చదవడానికి వెళ్ళాడు. భవనాని ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలోనే నిరంజన్ పాల్ స్థాపించిన ఇండియన్ ప్లేయర్స్ అనే పర్యాటక నాటక బృదం విజయవంతంగా తన ప్రదర్శనలు కొనసాగిస్తున్నది. నిరంజన్ పాల్, హిమాంషు రారు నిర్మించిన ‘లైట్ ఆఫ్ ఆసియా’, ‘షిరాజ్’ చిత్రాలకు స్క్రీన్‌ప్లే రాశారు. అక్కడ భవనానికి, నిరంజన్‌కి పరిచయం కలిగింది. 1924లో జర్మనీ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ద్వారకాదాస్, సంపత్ కోహినూర్ స్టూడియో కోసం ‘వీర్ బాలా’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రూబీ మేయర్స్ నటించింది. ఆమె స్క్రీన్ పేరు సులోచన. భవనాని మళ్ళీ ‘వైల్డ్‌క్యాట్ ఆఫ్ బాంబే’ (1927) చిత్రంలో సులోచనకు దర్శకత్వం వహించాడు. తర్వాత ప్రేమ్‌చంద్ స్క్రీన్‌ప్లే ఆధారంగా భవనాని ‘నవజీవన్’ (1935) సినిమా తీశాడు మోహన్ భవనాని.
ఈ నేపథ్యంలో బిబ్బో, దుర్గాఖోటే, డేవిడ్ అబ్రహం వంటి వారి కెరీర్లను ప్రారంభించడంలో భవనాని కీలక పాత్ర పోషించాడు. ఏణాక్షి రామారావు కూడా భావనాని చిత్రాలలో భాగమైంది. ఆమె ‘జాగరణ్’ (1936) చిత్రంలో నటించింది. భవనాని 1948లో ఫిలిం డివిజన్ వారికి డాక్యుమెంటరీలు తీశాడు. 1958లో చైనా ప్రధానమంత్రి చౌ ఎన్-లై భావనానిని తమ దేశానికి ఆహ్వానించాడు. ఏణాక్షి, మోహన్ భావనానితో పాటు ఒక చలనచిత్ర బృదం మూడు నెలల పాటు ఆ దేశంలో పర్యటించింది. ఫలితంగా రూపొందిన 70 నిమిషాల డాక్యుమెంటరీ ‘చైనా ఆన్ ది మార్చ్’కు ఏనాక్షి, రోమేష్ థాపర్లు వ్యాఖ్యానం అందించారు. ఆ తరువాత మోహన్ భవనాని డిసెంబర్ 30, 1962న మరణించాడు.
హెచ్ రమేష్ బాబు,
7780736386



