నీలాల శరణ్య పేరు, కవిత్వం ఇంతకుముందు పత్రికల్లో చదివినట్టు, విన్నట్టు గుర్తులేదు. గత ఏడాది జన విజ్ఞాన వేదిక నిర్వహణలో ఆంధ్ర మహిళా సభ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెద్ద ఎత్తున జరిగింది. నన్ను ఆత్మీయ అతిథిగా జేవీవీ మిత్రులు ఆహ్వానించారు. మహిళా దినోత్సవం మీటింగ్‌లో శరణ్య అనే ఒక విద్యార్థిని ‘అడ్డుగా కాదు, అండగా వుండు’ అనే కవితా శీర్షికతో ‘నా కాళ్లు గాలిలో కాదు నేల మీద ఉండాలి, నా కళ్ళు నేలను కాదు నింగిని చూడాలి అందుకే ఆడబిడ్డకు అడ్డుగా కాదు, అండగా ఉండు’ అని చదివిన కవితకు ఒక కవయిత్రిగా బిళ్ళ బీటుగా ఫిదా అయిన. అట్లా పరిచయమైన శరణ్య అక్కడిక్కడ జరిగిన సభలలో పరస్పర పలకరింపులు. తర్వాత శరణ్య బతుకమ్మ కవిత్వాన్ని వినడం, ఆ కవిత్వంలో జెడ్ జనరేషన్ గొంతులో బతుకమ్మ కొత్త పుంతల ఆవిష్కరణ ఆసక్తి పెంచింది. తర్వాత సమూహ నిర్వహించిన యూత్ లిటరరీ ఫెస్ట్‌లో శరణ్య చదివిన ‘కలం కూల్చే గోడలు’/’అవి నిర్మించిన పుర్రెలలో/వాటిని మోస్తున్న బుర్రలలో/నెర్రెలు వారుతాయి/దేశానికి దేశానికి/దేహానికి దేహానికి మధ్య లెక్కలేనన్ని గోడలు /నీకు నాకే కాదు/నాలో నాకే గోడలు’ కవిత గొప్ప సామాజిక రాజకీయ అవగాహన అద్దిన కవిత. అట్లా శరణ్య కవిత్వం మీద నాకు తెలవకుండానే ఒక అభిమానం ఆవరించింది.
ఒక రోజు క్యాజువల్‌గా శరణ్య తన కవితల్ని వాట్సప్ చేసి ఫోన్ చేసింది. మేడం నా కవితలు పంపాను. మీకు తెలిసిన పబ్లిషర్స్ ఎవరైనా ఉన్నారేమో చెప్పరా’ అని కోరింది. ఇట్లాంటి రచయితల పుస్తకాలను ప్రచురించడంలో బి ఎస్ రాములు ముందుంటారు. సాహిత్య సహకారాలే కాకుండా సాహిత్య సంబంధ సలహాలు, సూచనలు కూడా చేస్తుంటారు. వెంటనే ఫోన్ చేసి శరణ్య కవిత్వం గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన. ‘ఒకే వేద్దాం’ ఆ కవయిత్రితో మాట్లాడించి, కలవమని చెప్పిండు. అంతే ఒక రోజు కాదు, ఒక పూట కాదు కొన్ని గంటల్లోనే నీలాల శరణ్య కవిత్వాన్ని చదివి నాలాగే ఫిదా అయ్యి, డిటిపి చేయించి, కవర్ ఫొటోస్ డిజైన్ చేయించి, ‘నిశ్శబ్ద కడలి’ టైటిల్‌ని నికరం జేసి, విశాల సాహితీ అకాడమీ ప్రచురణ అని ఫైనల్ చేసి, ఆ కాపీ పంపిస్తూ ‘ముందుమాట వెంటనే రాసి పంపించండి’ ఈనెల జరిగే బుక్ ఫెయిర్‌లో ఆవిష్కరన జరపాలి’ అని వాట్సప్ మెసేజ్ పంపడం, సాహిత్యాలకు ఇంత ఫాస్ట్ ట్రాక్ ప్రచురణల బాగ్యాలందడం అబ్బురం, ఆనందం.
నీలాల శరణ్య తెలంగాణ బిడ్డ. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మే ఇంగ్లీష్ (2024) పూర్తి చేసి ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో సైకాలజీ చదువుతున్న విద్యార్థిని. ఇప్పుడు శరణ్య కవిత్వం సాహితీ సమాజం ముందుకు ‘కడివెడు కావ్యపు మొలకలు’గా కాదు, కడలిని కమ్ముకొని నిశ్శబ్దంగా డెబ్బ యొక్క (71) కవితలతో’ కోటి కాంతుల కొత్త గొంతుతో ‘నిశ్శబ్ద కడలి’గా ఎగిసి పడే అలల తుఫాన్.
– జూపాక సుభద్ర
కాలం తొలిచిన కడలి తడ
- Advertisement -
- Advertisement -



