అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవికి ఒక సింహం రాజుగా ఉండేది. ఆ సింహం చాలా బలమైనది, కానీ దానికి గర్వం చాలా ఎక్కువ. ”నేనే ఈ అడవికి అధిపతిని, నాకంటే గొప్పవారు ఎవరూ లేరు” అని అది ఎప్పుడూ విర్రవీగేది. తోటి జంతువులతో సింహం ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేది కాదు. అది ఎప్పుడూ అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉండేది. ఎదురుపడిన ప్రతి జంతువును ఏదో ఒక మాట అంటూ ఎగతాళి చేసేది. ఒక రోజు ఏనుగు తన దారిన తాను నెమ్మదిగా వెళ్తోంది. సింహం ఏనుగును చూసి పెద్దగా నవ్వింది. ”ఓ ఏనుగు! నీ శరీరం చాలా భారీగా ఉంది, అస్సలు అందంగా లేవు” అని అవమానించింది. ఏనుగు ఏమీ అనకుండా, కేవలం చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి ఒక ఎలుగుబంటి చెట్టు మీద తేనెను తింటూ కనిపించింది. సింహం అక్కడికి వెళ్లి, ”ఆ జిగురుగా ఉన్న తేనె తింటే నీకు జబ్బు చేస్తుంది, నీకు బుద్ధి లేదు” అంది. ఎలుగుబంటి కూడా సింహం మాటలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంది. పైన చెట్టు మీద ఒక కోతి ఆనందంగా గంతులు వేస్తోంది. సింహం కోతిని చూసి, ”నువ్వు ఎప్పుడూ అల్లరి చేస్తూ గంతులు వేస్తావు, నీకు క్రమశిక్షణ లేదు” అని కసురుకుంది. ఇలా సింహం ప్రవర్తన వల్ల అడవిలోని జంతువులన్నీ చాలా బాధపడ్డాయి.
ఒకరోజు మధ్యాహ్నం సింహం అడవిలో గంభీరంగా నడుచుకుంటూ వెళ్తోంది. దారిలో ఉన్న ఒక లోతైన లోయను అది గమనించలేదు. ఒక్కసారిగా కాలు జారి ఆ లోయలో పడిపోయింది. ఆ లోయ నిండా చిక్కటి బురద ఉంది. సింహం ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది, పైగా బురదలో ఇంకా కూరుకుపోసాగింది. గర్వంతో ఎవరినీ సహాయం అడగకూడదు అనుకుంది కానీ, ప్రాణభయం వేసింది. ”నన్ను కాపాడండి! ఎవరైనా ఉన్నారా? రక్షించండి!” అని గట్టిగా అరిచింది. ఆ అరుపులు దగ్గరలోని చెట్టు మీద ఉన్న ఒక చిన్న ఉడత విన్నది. ”మహారాజా! భయపడకండి, నేను అందరినీ పిలుచుకొస్తాను” అని ఉడత పరుగు తీసింది. ఉడత వెళ్లి జంతువులను పిలిచినా, కొన్ని జంతువులు సింహం పెట్టిన కష్టాలను తలుచుకుని రావడానికి భయపడ్డాయి. ”ఆ సింహం మమ్మల్ని ఎప్పుడూ తిడుతుంది కదా, మనమెందుకు వెళ్లాలి?” అని నక్క వంటి జంతువులు అడిగాయి. కానీ ఏనుగు, ఎలుగుబంటి, కోతి మాత్రం ”కష్టాల్లో ఉన్నప్పుడు పగను చూడకూడదు” అని నిర్ణయించుకున్నాయి.
వెంటనే ఏనుగు అక్కడికి పరుగున వచ్చింది. తన పొడవాటి బలమైన తొండంతో సింహాన్ని గట్టిగా పట్టుకుంది. శక్తినంతా ఉపయోగించి సింహాన్ని ఆ బురదలో నుండి సురక్షితంగా బయటకు తీసింది. బయటకు వచ్చిన సింహం పూర్తిగా బురదలో మునిగిపోయి, నీరసించిపోయింది. అప్పుడు ఎలుగుబంటి తాను దాచుకున్న తియ్యని తేనెను సింహానికి ఆహారంగా ఇచ్చింది. కోతి చెట్టు మీద నుండి తాజా పండ్లను కోసి తెచ్చి సింహానికి అందించింది. సింహం ఆ ఆహారం తిని కాస్త కోలుకుంది. తను ఏ జంతువులని అయితే తక్కువ చేసి మాట్లాడిందో, అవే తన ప్రాణాలు కాపాడాయని సింహం గ్రహించింది. సింహం కళ్లలో నీళ్లు తిరిగాయి, దానికి చాలా సిగ్గుగా అనిపించింది. ”మిత్రులారా! నన్ను క్షమించండి, మిమ్మల్ని అనవసరంగా దూషించాను” బాధతో అంది.. అప్పుడు కోతి నెమ్మదిగా సింహం దగ్గరకు చేరింది. ”రాజా! రూపం చూసి ఎవరినీ తక్కువ చేయకూడదు. మనం ఇతరులను గౌరవిస్తేనే మనకు గౌరవం దక్కుతుంది. ఒంటరిగా ఉంటే కేవలం బలం ఉంటుంది, అందరితో కలిసి ఉంటేనే నిజమైన శక్తి వస్తుంది” అని కోతి వివరించింది. ఏనుగు తన తొండంతో సింహాన్ని ఆశీర్వదించి, ఓదార్చింది. ఆ క్షణం నుండి సింహంలోని గర్వం పూర్తిగా నశించిపోయింది. తన తప్పును తెలుసుకున్న సింహం, అప్పటి నుండి అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. వేటిని విమర్శించకుండా, అన్నిటి కష్టసుఖాల్లో పాలుపంచుకుంది.
పైడిమర్రి రామకష్ణ, 92475 64699



