Saturday, May 16, 2026
E-PAPER
Homeసోపతిసిగ్గులేని పిలుపులు

సిగ్గులేని పిలుపులు

- Advertisement -

కేతిగాడు : మోడిగారి మాటలతో రామాహరి మనోడు సన్యాసి అయ్యాడు రామాహరి ఇక సంసారి కాలేడు రామాహరి.
జుట్టుపోలుగాడు : అరె ఎకసెక్కాలు మాని సీరియస్‌గా వుండవేంటి? దేశప్రధాని అంటే మరీ లోకువైందిరా నీకు. ఎన్ని కష్టాలొస్తే మన ప్రధాని మనకు పొదుపు పిలుపు ఇస్తాడు. అదీ హైదరాబాద్‌ వేదికగా. మనమంటే ఎంత అభిమానం ఎంత అభిమానం…
కేతిగాడు : అవునవును. అభిమానం పొంగిపొర్లుతుంది.
జుట్టుపోలుగాడు : నేను ప్రధాని పిలుపును తు.చ. తప్పకుండా పాటిస్తా… నెంబరు 1. బంగారం కొనడం మానేస్తా, 2. విదేశీ టూర్లు చస్తే చేయను, 3. సొంత వాహనాలు అసలే వాడను.
కేతిగాడు : ఆగాగు. అరె, బంగారం కొనే ముఖమేనా ఇది. ఇమానాలెక్కి విదేశాలు ఎల్తావేంట్రా నువ్‌? నీకు ఏదో సొంత కారున్నట్టు ఫీలవుతావేంట్రా? ఓవర్‌ యాక్షన్‌ ఆపరా..
జుట్టుపోలుగాడు : నాకు లేకపోతే దేశంలో చాలామందికి లేవా ఏంటి? ఆళ్లు పాటిస్తారు. పోనీ గాసు వాడకం. వంట నూనె వాడకం తగ్గించమన్నాడు. అది చెయ్యొచ్చుగా.
కేతిగాడు : అలాగే యూరియా వాడకం తగ్గించమని రైతులకు చెప్పాడు. అసలే యూరియా కొరతతో రైతులు అల్లాడిపోతున్నారు. ప్రధాని పిలుపు పుండుమీద కారం చల్లినట్టు లేదు. నీవేమన్నా అనుకో మోడీ పాలన – పైన పటారం, లోన లొటారం.
జుట్టుపోలుగాడు : నీవెప్పుడూ అంతే, ఈర్ష్యగా మాట్లాడతావ్‌. స్వతంత్ర భారత్‌లోనే మోడీ పాలన స్వర్ణయుగం. టాప్‌ ఫైవ్‌ ఆర్థిక వ్యవస్థకు మన ఇండియా వచ్చిందంటే అది మా మోడీ క్రెడిట్టే. మోడీ సారధ్యంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా గర్జన – డిజిటల్‌ ఇండియా విప్లవ భేరీ’ ఇలాంటి హోర్డింగులు దేశమంతటా వెలుస్తున్నాయి. కళ్లున్న కబోదిలా నువ్వు చూడలేకపోతే నేనేం చేయలేను. అటు సైన్స్‌ను, ఇటు ఆధ్యాత్మికతను కలగలిపి జోడు గుర్రాల స్వారీ చేస్తున్నాడు మా మోడీ. ‘భారత్‌ ఎవరికీ తల వంచదు. ఏ ప్రపంచ శక్తీ భారత్‌ ప్రగతిని అడ్డుకోలేదు’ అని సోమనాథ్‌ గుడి అమృతోత్సవంలో మాట్లాడటానికి ఎంత ధైర్యం వుండాలి. హు.. పిల్లకాక్కి ఏం తెల్సు వుండేల్‌ దెబ్బ.
కేతిగాడు : పెద్ద స్పీచ్‌ ఇచ్చావు గానీ ముందు మంచినీళ్లు తాగు. అరె, ఈ పొదుపు గురించి ప్రజలకు చెప్పడం దేనికి? ఆదాని, అంబానీ వంటి వాళ్ల వద్ద లక్షల కోట్లు సొమ్ముంది కదా.. ఆ డబ్బుతో దేశాన్ని ఆదుకోవచ్చు కదా.. అది చేయడు మోడీ. కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టినట్టు ప్రజల సొమ్మంతా తీసుకెళ్లి కుబేరుల పరం చేస్తాడు. ప్రజల నోట్లో మట్టి కొడ్తాడు. విషయం ఏంటంటే.. పశ్చిమాసియా యుద్ధం వల్ల వచ్చిన చమురు సంక్షోభం మన దేశాన్నీ తాకింది. లక్షల కోట్ల నష్టంతో దేశ ఆర్థిక వ్యవస్థకు చిల్లి పడింది. పూడ్చాలంటే పొదుపు చర్యలు తప్పవని మోడీ అంటున్నాడు. కోవిడ్‌ కాలంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా వ్యవహరించారో ఇప్పుడు కూడా అలా వ్యవహరించాలని కోరుకుంటున్నాడు. అవసరాలు కుదించుకోమని చెప్తున్నాడు. ప్రజలు ఏదైతే భయపడ్డారో ఎన్నికలనంతరం అదే జరుగుతున్నది. గ్యాస్‌, చమురు ధరలు పెరిగాయి. దాంతో రవాణా చార్జీలు, హోటళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. రూపాయి విలువ పడిపోయింది. ఇంకేం కావాలి? ‘హైదరాబాద్‌ వస్తున్నాడు మోడీ. వరాలిస్తాడు మోడీ, దేశం కోసం మోడీ – మోడీ కోసం జనం’ అని నీలాంటి వాళ్లు చాలామంది బాకాలూదారు. కానీ జనానికి ఒరిగిందేముంది? పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టయింది.

బంగారక్క : మావా కేతిగా… మా బాగా చెప్పావ్‌. ఏ ప్రభుత్వమైనా ముందు పేదల గురించి ఆలోచించాలి. ఒక పక్క రోజు కూలీ తరుగుతుంటే మరోపక్క నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అచ్చేదిన్‌ రోజులు పోయి చచ్చేదిన్‌ రోజులొస్తున్నాయని జనం గోస పెడ్తున్నారు. 2014లో మోడీ ప్రధానిగా అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్‌ విలువ 60 రూపాయలు వుంటే ఇప్పుడు 94 రూపాయలకు చేరింది. 2014లో మనదేశం అప్పు 54.9 లక్షల కోట్లు. మరిప్పుడు 235.4 లక్షల కోట్లు. దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఇదంతా ఎవరి చలవ? మోడీ ప్రభుత్వం వల్ల కాదా? జి.డి.పి.లో అప్పు నిష్పత్తి 67 శాతం వుంది. అంటే ప్రతి భారతీయునిపై లక్షా 66 వేల రుణభారం వుంది. ఇవన్నీ పార్లమెంటులో చెప్పిన లెక్కలే. మరి ఈ అప్పుల గుదిబండతో మన దేశం ఎలా ఎదుగుతుంది? మన పిల్లలకు ఇది మరణ శాసనం కాదా? ఆకలి సూచీలో మనం 105వ స్థానంలో వున్నాం. పాకిస్తాన్‌ 102 కన్నా మనం వెనుకున్నాం. కష్టజీవికి రోజుకు వచ్చే సగటు కూలి 126 రూపాయలు. ఈ కూలీతో పేదలు తమ సంసారాలను ఎలా నెట్టుకు రావాలి? వాస్తవాలు ఇలా వుంటే… ఇంకా త్యాగాలు చేయమని, పొదుపులు పాటించమని పిలుపులివ్వడానికి సిగ్గుండాలి.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -