వచ్చే నెల 13వరకు ‘ఆషాఢం బోనాలు’
గోల్కొండ జగదాంబిక
అమ్మవారికి తొలి బోనం
ఉత్సవాల కోసం రూ. 20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
ప్రజలకు మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/ మెహిదీపట్నం
హైదరాబాద్ భాగ్యనగరంలో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. తెలంగాణ ఆత్మను, శతాబ్దాల సంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ‘ఆషాఢం బోనాల’ ఉత్సవాలు నేటి(గురువారం) నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. చారిత్రక గోల్కొండ కోటపై జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో నెల రోజుల వేడుకలకు అంకురార్పణ జరుగుతుంది. ఈ సందర్భంగా అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కరుణతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతన్నలు ఆనందంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
ఘనంగా ఏర్పాట్లు.. రూ.20 కోట్లు కేటాయింపు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 3 వేలకు పైగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది ఉత్సవాల కోసం రూ. 20 కోట్లను కేటాయించారని మంత్రి తెలిపారు. గోల్కొండలో ప్రారంభమై, ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి (లష్కర్) బోనాలు, ఆగస్టు 9న ఓల్డ్ సిటీ బోనాలు జరగనున్నాయి. ఆగస్టు 13న అక్కన్న మాదన్న దేవాలయం వద్ద ఘటాల నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయి.
నేడు జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గురువారం జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం లంగర్‌హౌస్ ఎక్స్‌రోడ్డు వద్ద ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోనాల ఉత్సవాల తొలి రోజునే భారీ సంఖ్యలో జనం అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యంతో పాటు తాగునీరు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
లంగర్‌హౌస్ నుంచి ఊరేగింపు..
లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట వరకు అమ్మవారి రథం, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ప్రదర్శనలు, బాజాభజంత్రీల నడుమ బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దారిపొడవునా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గోల్కొండలో ట్రాఫిక్ ఆంక్షలు
బోనాల సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. రామ్‌దేవ్‌గూడ, బంజారా దర్వాజా, లంగర్ హౌజ్ ప్రాంతాల్లో వాహనాలను మళ్లించనున్నారు. భక్తుల వాహనాల కోసం ఆర్టిలరీ సెంటర్, ఒవైసీ గ్రౌండ్, డెక్కన్ పార్క్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. బోనాల పండుగకు వెయ్యి ఏండ్ల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
నేటి నుంచే బోనాలు షురూ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



