బెంగళూరు: షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని అవమానించి, వారిపై దాడి చేసి గాయపరచిన ఘటనలో పది మందికి కర్నాటక హైకోర్టు జైలు శిక్ష విధించింది. రెండు నెలల నుండి సంవత్సరం వరకూ నిందితులకు జైలు శిక్షలు పడ్డాయి. అగ్ర కులాలకు చెందిన వారిపై ఫిర్యాదు చేశారన్న ఒకే ఒక కారణంతో తుముకూరు జిల్లా దుండా గ్రామానికి చెందిన వ్యక్తులు దళితులపై దాడికి తెగబడ్డారు. నిందితులందరినీ 2011లో విచారణ కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. దిగువ కోర్టు తీర్పును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. ‘నిందితుల విషయంలో ఉదారంగా వ్యవహరిం చాల్సిన అవసరం లేదు. వారు ఉద్దేశపూర్వ కంగానే హరిజన కాలనీలోకి ప్రవేశించారు. ఎస్సీలను విచక్షణారహితంగా వేధించి, వారిపై దాడి చేశారు. ఓ ఘటనలో దళితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుల్లో ఒకరి పైన ఫిర్యాదు చేయడమే దీనికి కారణం’ అని వ్యాఖ్యానించింది. ఆధారాలను సరిగా పరిశీలించకుండానే నిందితులను దిగువ కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టిందని హైకోర్టు తప్పుపట్టింది. అదీకాక తన వద్ద ఉన్న ఆధారాలను సైతం విచారణ కోర్టు తప్పుగా అన్వయించుకుందని వ్యాఖ్యానించింది. అగ్ర కులాలకు చెందిన వారు దళితులు నివసించే కాలనీలో ప్రవేశించి వారిని కులం పేరుతో దూషించారని, వారిపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారని పేర్కొంటూ వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివమూర్తి అనే వ్యక్తికి సంబంధించిన భూమి విషయంలో దళితులు, అగ్ర వర్ణాల మధ్య వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి డీఆర్ సందీప్ అనే వ్యక్తిపై దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితులైనప్పటికీ ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని న్యాయమూర్తి జేఎం ఖాజీ ప్రశంసించారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు కాగా వారిలో ఓ వ్యక్తి విచారణ మధ్యలో చనిపోయాడు. దీంతో మిగిలిన పది మంది నిందితులకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు.