బంగారం, పాలు, ఆ తర్వాత
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ
కేంద్రం తీరుతో జనజీవితాలపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ : గడిచిన 48 గంటల్లో అనేక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి ఎగిశాయి. దేశ ప్రజలు ద్రవ్యోల్బణం అనే సర్వనాశన దాడికి గురయ్యారు. దీనిని కట్టడి చేయడంలో ప్రధాని మోడీ పూర్తిగా విఫలమయ్యారు. మోడీ పాలనలో దేశంలోని ప్రజల ఆదాయాలు పెరగలేదు. జీవితాలు మారలేదు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ అకస్మాత్తుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ధరల వాయింపు షురూ చేసింది. బిడ్డ పెండ్లికి తాళి బొట్టు కూడా కొనలేని పరిస్థితులు నెలకొంటే.. మీరు బంగారం, వెండి కొనొద్దంటూ ప్రధాని మోడీ ప్రకటన చేశారు. దీంతో దేశంలో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైంది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితిని గుర్తు చేస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక కేంద్రం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దీనివల్ల బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. బంగారం మాత్రమే కాదు.. పాల ధరలు కూడా పెరిగాయి. సీఎన్జీ ధరలు కూడా పెరిగాయి . ఇప్పుడు, పెట్రోల్, డీజిల్ ద్రవ్యోల్బణ బాంబు దాడికి గురయ్యాయి. శుక్రవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ₹3 చొప్పున పెరిగాయి. కాగా జనంపై ద్రవ్యోల్బణ బాంబు విసిరేసి ప్రధాని మోడీ యూరప్ దేశాల పర్యటనకు వెళ్లడం గమనార్హం.
మొదటి ద్రవ్యోల్బణ దాడి: బంగారం, వెండి ధరల పెరుగుదల
గత ఆదివారం.. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దని ప్రధాని మోడీ ప్రజలకు మొదట విజ్ఞప్తి చేశారు. ఈ పిలుపును ఆయన 24 గంటల్లో రెండుసార్లు పునరావృతం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం అకస్మాత్తుగా బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో, ఎంసీఎక్స్, దేశీయ మార్కెట్ రెండింటిలోనూ బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. దిగుమతి సుంకం పెంపు వార్త తెలియగానే, బంగారం ధర రూ.11,000, వెండి ధర రూ.22,000 మేర పెరిగింది.
రెండో ద్రవ్యోల్బణ దాడి: పాల ధరల పెరుగుదల
బంగారం, వెండి తర్వాత, రెండో ద్రవ్యోల్బణ బాంబు పాలపై పేలింది. అమూల్ నుంచి మదర్ డెయిరీ వరకు, వాటి ప్యాకేజ్డ్ పాల ధరలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెరిగింది. ఆ వెంటనే మదర్ డెయిరీ కూడా తన పాల ధరను రూ.2 పెంచింది. ఈ కొత్త ధరలు మే 14 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
మూడో ద్రవ్యోల్బణ దాడి: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల
పాల ధరల పెరుగుదల తర్వాత, ద్రవ్యోల్బణం పెట్రోల్, డీజిల్‌ను కూడా తాకింది. దీంతో శుక్రవారం నాడు చమురు కంపెనీలు పెట్రోల్ , డీజిల్ ధరలను లీటరుకు రూ. 3 చొప్పున పెంచాయి. ఈ కొత్త ధరలు మే 15 శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో పలు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి.
నాలుగో ద్రవ్యోల్బణ దాడి: సీఎన్జీ ధరలు కూడా ..
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా, సీఎన్జీ వినియోగదారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. ముంబయి తర్వాత, ఇప్పుడు ఢిల్లీలో కూడా సీఎన్జీ ధరలు మరింత పెరిగాయి. శుక్రవారం నుంచి కిలోకు రూ.2 మేర ధరలు పెరిగాయి. ఈ పెరుగుదలతో, ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.79.09కి చేరింది. ముంబయిలో కూడా ఒక రోజు ముందే సీఎన్జీ ధరలు రూ.2 మేర పెరిగి, రూ.82 నుంచి రూ.84కు ఎగబాకాయి.
దేశంలో ధరల పెంపు.. విదేశాలకు మోడీ
పెట్రో ధరల విషయంలో నా చేతుల్లో ఏమి లేదంటూనే మోడీ.. చమురు సంస్థలు లీటర్‌కు మూడు రూపాయలు పెంచుకునేందుకు అనుమతించారు. పశ్ఛిమాసియా యుద్ధం కారణంగా రూ.18వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ ఇక్కడి చమురు సంస్థలు గగ్గోలు పెట్టాయి. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి ధరల పెంపు తప్పదన్న సంకేతాలు వచ్చాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో సైలెంట్ గా ఉన్న మోడీ సర్కార్ ఫలితాలు రాగానే బాదేసిందని పౌర సమాజం అంటోంది. సామాన్య, మధ్యతరగతి నెత్తిన పిడుగులా ధరలు పెరుగుతున్నాయని, వారి జీవితాల్లో మార్పు రావటానికి మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవటంలేదన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. దేశంలో కీలక ఘటనలు, జనంపై భారాలు మోపేముందు ప్రధాని మోడీ విదేశాలకు వెళ్లడం కామన్ అయిపోయిందని ప్రతిపక్షాలు, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.



