నాలుగు రోజుల ముందే వచ్చే అవకాశం
త్వరలో తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం ..ఐఎండీ
న్యూఢిల్లీ: ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ) . నైరుతి రుతుపవనాలు మే 26న కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది. మే 26న రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దీనికి నాలుగు రోజుల అటు ఇటుగా అంటే మే 22 నుంచి మే 30 మధ్య రుతుపవనాలు తాకే అవకాశం ఉండవచ్చని ఐఎండీ వివరించింది. సాధారణంగా కేరళలో రుతుపవనాలు జూన్ 1 నాటికి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి ఉత్తరం వైపునకు విస్తరిస్తూ దేశంలోని మిగిలిన ప్రాంతాలకు చేరతాయి. కేరళలో రుతుపవనాల ప్రవేశం ద్వారా దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే వర్షాకాలం అధికారికంగా ప్రారంభమవుతుంది. రుతుపవనాల రాకపై స్పష్టత రావడంతో దేశవ్యాప్తంగా అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్నారు. కాగా, గతేడాది రుతుపవనాలు మే 24న ప్రవేశించినట్టు ఆ శాఖ వెల్లడించింది.
తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం
రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. “భారత ప్రధాన భూభాగంలోకి నైరుతి రుతుపవనాల విస్తరణ అనేది కేరళలో వాటి ఆగమనంతో గుర్తిస్తాం. వేడి, పొడి వాతావరణం నుంచి వర్షాకాలంలోకి జరిగే మార్పును సూచించే ఒక ముఖ్యమైన సూచిక ఇది. రుతుపవనాలు ఉత్తరం వైపుగా విస్తరిస్తున్న కొద్దీ, ఆయా ప్రాంతాల్లో వేసవిలో ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుంది.” అని ఐఎండీ పేర్కొంది.
సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం
ఈ ఏడాది రుతుపవన కాలంలో భారతదేశంలో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో తక్కువ వర్షపాతానికి కారణమయ్యే ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం కావచ్చని ఐఎండీ అభిప్రాయపడింది. రుతుపవన కాలాల్లో దేశంలో సాధారణంగా సుమారు 80 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాగా, ఈ రుతుపవన కాలానికి సంబంధించిన దీర్ఘకాలిక సగటు (1971-2020 మధ్య కాలం) 87 సెం.మీగా ఉంది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థికవ్యవస్థకు జీవనాడిగా నైరుతి రుతుపవనాలను పిలుస్తారు. నాలుగు నెలల పాటు సాగే ఈ రుతుపవన కాలం దేశానికి లభించే వార్షిక వర్షపాతంలో దాదాపు 70 శాతాన్ని అందిస్తుంది. వ్యవసాయానికి, పంటలకు, మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థకు, అలాగే జలాశయాలు, భూగర్భ జలాలను తిరిగి నింపడానికి ఇది అత్యంత కీలకం. మన దేశంలో 50 శాతానికి పైగా నికర సాగుభూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి.
92 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం
ఇదిలా ఉండగా, దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం పడనుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ ఏడాది జూన్- సెప్టెంబర్లో నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని తెలిపింది. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 92 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఫలితంగా దేశంలోని వ్యవసాయం, నీటి వనరులు, పర్యావరణంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పింది.
26న కేరళంకు నైరుతి పవనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



