Saturday, May 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆగ్రహించిన అన్నదాతలు

ఆగ్రహించిన అన్నదాతలు

- Advertisement -

పండించిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి ధర్నా
కాంటాలు వేసిన బస్తాలను తరలించాలని ఆందోళన
జనగామ జిల్లాలో ధాన్యం బస్తాల దహనం
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం

నవతెలంగాణ- ముదిగొండ,
నర్సాపూర్, జఫర్‌గఢ్, జనగామ వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు సక్రమంగా చేయడం లేదని, ధాన్యం బస్తాలను తీసుకువెళ్లేందుకు లారీలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టా డుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకో వడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. ఖమ్మం ముదిగొండ మండల కేంద్రంలోని ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై మొక్కజొన్న రైతులు ధర్నా ధాన్యం కాంటాలు వేసిన బస్తాలను తరలించాలని ఆందోళన ఆగ్రహించిన అన్నదాతలు నిర్వహించారు. ఆన్‌లైన్ సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయని, దాంతో కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. ఆన్‌లైన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. కాగా ముదిగొండ సొసైటీ చైర్మెన్ తుపాకుల యలగొండస్వామి రైతుల ఆందోళన విషయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కుతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో స్పందించిన మంత్రులు.. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మార్కెట్ డీఎంను ఆదేశించారు. ఆందోళన చేస్తున్న రైతులతో మార్కెట్ డీఎం ఫోన్‌లో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో రైతులు పండించిన ధాన్యం బస్తాలను రోడ్డుపై పోసి వినూత్న రీతిలో నిరసన, రాస్తారోకో చేపట్టారు. నర్సాపూర్ మండలంలోని తుజాల్ పూర్ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని పలు గ్రామాల రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చారు. అయితే కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం తీసుకెళ్లడానికి లారీలు కూడా రావడం లేదని రైతులు ఆరోపించారు. దాంతో మిల్లర్లు ధాన్యాన్ని అన్‌లోడ్ చేయకపోవడం వల్ల వారం రోజులపాటు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ధాన్యం రోడ్డుపై పోసి రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న నర్సాపూర్ ఎస్‌ఐ రంజిత్ కుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాంతో రైతులు, పోలీసులకు వాగ్వివాదం జరిగింది. సంబంధిత అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని లారీలను కొనుగోలు కేంద్రానికి పంపిస్తామని హామీ ఇచ్చేవరకు ఈ ధర్నాను విరమించేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. దాంతో తహసీల్దార్ శ్రీనివాస్ నిరసన ప్రాంతానికి వచ్చి.. ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

జనగామ జిల్లా బఫర్‌గఢ్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొ‌క్కజొన్నలు, వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ధాన్యాన్ని రోడ్డుపైన పోసి తగులబెట్టి.. రోడ్డుపై బైటాయించి చెట్టుకొమ్మలు అడ్డుగా వేసి జఫర్‌గఢ్‌-వర్ధన్నపేట రాకపోకలను రైతులు స్తంభింపచేశారు. విషయం తెలుస్తున్న ఎ‌స్‌ఐ రామారావు ఘటనాస్థలికి చేరుకుని రైతులకు వడ్లు కొనుగోలు చేసేలా అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పెంబర్తిలోని ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన బస్తాలను వెంటనే తరలించేందుకు ప్రభుత్వం తగిన లారీలు కేటాయించాలని రైతులు డిమాండ్ చేస్తూ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పెంబర్తి వద్ద రోడ్డుపై రైతులు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియలో నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -