Saturday, May 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువచ్చే ఎన్నికల్లోప్రధాని అభ్యర్థి రాహుల్‌‌

వచ్చే ఎన్నికల్లోప్రధాని అభ్యర్థి రాహుల్‌‌

- Advertisement -

నేనే ఆయన్ని ఒప్పించా ముందు కాంగ్రెస్‌‌లో తీర్మానించి, తర్వాత ఇండియా కూటమిని ఒప్పిస్తాం
2034 తర్వాత నేను సీఎంగా ఉండను
జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తన కొడుకును విచారణకు పంపాలి
సమస్యలు చూసి పారిపోవద్దని ఆయనకు నా సలహా
దేనికీ భయపడేది లేదు.. మూసీ పునరుజ్జీవం చేసి తీరతాం చెరువులు, కుంటలు ఆక్రమిస్తే కూల్చివేతలు తప్పవ్‌
ఆర్టీసీ ఇప్పుడు లాభదాయక సంస్థ
విజన్‌-2047 అమలే లక్ష్యం
ఓ మీడియా సంస్థ కాంక్లేవ్‌‌లో సీఎం రేవంత్‌‌రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో లోక్‌‌సభలో ప్రతిపక్ష‍నేత రాహుల్‌‌ గాంధీనే ప్రధాని అభ్యర్థి అని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రతి పాదనను తొలుత కాంగ్రెస్‌‌పార్టీలో ఆమోదం తీసుకొని, ఆ తర్వాత ఇం డియా కూటమిని ఒప్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రాహుల్‌‌ గాంధీకి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాల‌నే లక్ష్యం మాత్రమే ఉందనీ, ప్రధాని కావాలని ఆయన ఏనాడూ కోరుకోలేదన్నారు. కానీ ఇటీవల వికారాబాద్ లో జ‌రిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ శిక్ష‍ణా స‌మావేశంలో ప్ర‌ధాని ప‌ద‌వి తీసుకోవాల‌ని తానే రాహుల్ గాంధీకి చెప్పి ఒప్పించానని తెలిపారు. శుక్రవారంనాడిక్కడి ఓ కన్వెన్షన్‌ ‌సెంటర్‌‌లో ఓ మీడియా సంస్థ నిర్వ హించిన కాన్ క్లేవ్ -2026 లో ఆయన మాట్లాడారు. గాంధీ కుటుం బానికి దేశం ప‌ట్ల విశ్వాసం ఉందనీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో తనకు చొరవ ఉందనీ, అయితే ఎప్పుడు తాను గీతను దాటబోననీ చెప్పారు. ఇండియా కూట‌మి తరుపున ఒక పాల‌సీ డాక్యూ మెంటును తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల‌ను తీర్పు ఇవ్వ‌మ‌ని కోర‌తామన్నారు. పార్టీని వ‌దిలిపెట్టిన త‌ర్వాత నాయ‌కుల మ‌ధ్య మంచి సంబంధాలు ఉండ‌టం చాలా అరుదు అనీ, కానీ తనకు టీడీపీతో ఆ అనుబంధం ఇప్పటికీ ఉందన్నారు.

రాష్ర్ట ప్రజలు 2024 నుంచి 2034 వ‌ర‌కు కాంగ్రెస్ కు అధికారం ఇస్తారనీ, అప్పటి వరకు తాను తెలంగాణలోనే ఉండి, రాష్ర్టం కోసం పనిచేస్తాననీ, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానన్నారు. అక్కడ రాహుల్‌‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యమనీ, ఆయన ఏ బాధ్యత ఇస్తే దాన్ని స్వీకరిస్తానని స్పష్టం చేశారు. 2034 తర్వాత తాను రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉండబోననీ, తర్వాతి తరానికి అవకాశం ఇస్తానని తేల్చిచెప్పారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌కుమారుడు బండి భగీరథ్‌ ‌కేసు విషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఈ కేసులో చట్టం ఎక్కడా పక్ష‍పాతంతో వ్యవహరించట్లేదన్నారు. బండి సంజయ్‌ ‌తన కుమారుడిని స్వయంగా విచారణకు పంపితే రాజకీయంగా గౌరవం లభిస్తుందని సలహా ఇచ్చారు. రాష్ర్టంలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఉన్నందున పోలీసులంతా బందోబస్తు విధుల్లో ఉన్నారనీ, అలాగని ఎక్కడా విచారణ ఆపలేదని వివరించారు. అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సేకరించి, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. సినిమా వాళ్లు, రాజ‌కీయ నాయ‌కులు ..ఎవ‌రైనా సరే నేరం చేస్తే తనకు ఎలాంటి మిన‌హాయింపులు లేవనీ, చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేశారు. బండి భగీరథ్‌ ‌కేసు విషయంలో ఐదు టీంలు పనిచేస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే అంశాన్ని బండి సంజయ్‌ ‌వ్యతిరేకించినందువల్లే బీఆర్‌ఎస్‌ ‌వాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌‌కుమార్‌ ఇప్ఫుడు ఐపీఎస్‌ అధికారి కాదనీ, గడీల పాలనకు వ్యతిరేకంగా గణం ఎత్తి ఇప్పుడు అదే గడీల్లో స్వీయ నిర్భంధం చేసుకున్నాడని విమర్శించారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌ట్టాలెక్కించాల్సిన బాధ్య‌త తనపై ఉందనీ, దానికోసమే ప్ర‌తి 15 రోజుల‌కు ఒక సారి జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తున్నానని చెప్పారు. నిధుల స‌మీక‌ర‌ణ పైన ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నాననీ, జ‌డ్పీటీసీ గా ఉన్న‌ప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే ఇంట్లో ఉన్నానన్నారు. క‌ష్ట‌ప‌డ్డ నాయ‌కుల‌కే నామినేటేడ్ పోస్టులు ఇస్తున్నామని, పార్టీ టిక్కెట్లు సామాన్యులకు ఇచ్చి గెలిపించుకున్నామని పలు ఉదాహరణలు వెల్లడించారు. ఎవ‌రు అడ్డువ‌చ్చినా మూసీ ని ప్ర‌క్షాళ‌న చేసి తీరతామనీ, ఆ నదిని ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే సామాన్లయినా మిగులుతాయనీ, లేకుంటే బుల్డోజర్లతో తొక్కించేస్తామని హెచ్చరించారు. మూసీని ఆక్రమించిన పేదలకు పక్కా ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాలు ఉదారంగా ఇస్తున్నామన్నారు. రాష్ర్టంలో డ్రగ్స్‌ తీసుకుంటే ఏ కీలు కు ఆ కీలు తీస్తామని హెచ్చరించారు. తాను అనేక విషయాల్లో పూర్తి స్పష్టతతో ఉంటానని చెప్పారు. తన ఆలోచ‌న‌లపై కొంద‌రికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చనీ, వంద‌శాతం ప్ర‌జ‌ల‌ను మెప్పించాల‌ని కోరుకుంటే అసంతృప్తే మిగులుతుందనీ, 60 నుంచి 75 శాతం మంది మ‌న ఆలోచ‌న‌ల‌ను ఆమోదిస్తే అదే అతి పెద్ద విజ‌యంగా చెప్పుకోవ‌చ్చని స్పష్టత ఇచ్చారు. ఆర్టీసీ ఇప్పుడు లాభాల సంస్థగా మారిందనీ, ప్రతినెలా మహాలక్ష్మి స్కీం ద్వారా ఆర్టీసీకి రూ.350 కోట్లు చెల్లిస్తున్నామన్నారు.

ఇది కేవలం మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే కాదనీ, దీనివెనుక అనేక సామాజిక పరిణామ క్రమాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఆర్టీసీకి రెండేండ్లలో రూ.10వేల కోట్లు ఇచ్చామన్నారు. 3000 ఈవీ బ‌స్సులను ప్ర‌వేశ‌పెట్ట‌డంతో ద్వారా డీజీల్ రూపంలో ఆర్టీసీ ఖ‌ర్చు చేస్తున్న‌ రూ.2000 కోట్లు ఆదా చేస్తామన్నారు. ఈ సందర్భంగా విజన్‌-2047 డాక్యుమెంట్‌‌లోని అంశాలను సీఎం ప్రస్తావించారు. రాష్ర్టంలో రియ‌ల్ ఎస్టేట్ బాగుందనీ, కానీ తాను ఆశించిన‌ట్టు లేదన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగానే అనేక కార‌ణాలతో రియ‌ల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గిందని చెప్పారు. కొందరు వార‌స‌త్వంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌స్తుందని క‌ల‌లు క‌న్నారనీ, వారి కలలు చెదిరిపోయేసరికి ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రజల్ని గందరగోళ పరిచే పనులు చేస్తున్నారని పరోక్ష‍ంగా బీఆర్‌ఎస్‌ ‌నేతల్ని ఉద్దేశించి అన్నారు. డ్ర‌గ్స్ ను కంట్రోల్ చేయ‌డానికి ఈగ‌ల్ ఫోర్స్ ను తీసుకువ‌చ్చామనీ, ఫామ్ హౌస్ లో పార్టీలు చేసుకుని దొరికిపోయిన వారు తనను విమ‌ర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -