మళ్లీ 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్‌లో అత్యధికంగా 44.8 డిగ్రీలు
గాలిలో తగ్గిన తేమ శాతం…ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
పలు జిల్లాల్లో కురిసిన వర్షం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎండలు మండిపో తున్నాయి. మళ్లీ ఎండలు క్రమంగా పెరుగుతూ 45 డిగ్రీలకు చేరుతున్నాయి. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాత్రి పూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపై నమోదవుతున్నట్టు గమనార్హం. మధ్యా హ్నం పూట వేడిగాల్పులు కూడా వీస్తున్నాయి. సాయంత్రం పూట కాస్త ఎండ తగ్గినప్పటికీ ఉబ్బరింపు అలాగే ఉంటున్నది. తీవ్ర ఉబ్బరంతో ఇండ్లలో ఉండలేని పరిస్థితి. అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదు అవుతుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. వచ్చే రెండు రోజుల్లో కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికంగా 31.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రామగుండం, కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. శనివారం నాడు ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం లోని చాలా ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినవి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఆ ప్రాంతాలన్నింటికి పూర్తిగా విస్తరించి తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించేలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఆదివారం రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో శనివారం రాత్రి 9 గంటల వరకు 40 ప్రాంతాల్లో వర్షం పడింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 3.6 సెంటీమీటర్లు, మహ్మదాబాద్‌లో 3.5 సెంటీమీటర్లు, దేవరకద్రలో 3.0 సెంటీమీటర్ల చొప్పున వాన పడింది.
అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
ఆదిలాబాద్ 44.8 డిగ్రీలు
నిజామాబాద్ 43.3 డిగ్రీలు
మెదక్ 42 డిగ్రీలు
మహబూబ్‌నగర్ 41.5 డిగ్రీలు
రామగుండం 41 డిగ్రీలు
నల్లగొండ 40.5 డిగ్రీలు
హైదరాబాద్ 40 డిగ్రీలు
కొత్తగూడెం 40 డిగ్రీలు



